బాలినేని 2024లో ఎమ్మెల్యేగా గెలిచి ఉంటే పార్టీ మారేవారా ?

ఆయనకు రాజకీయంగా అవకాశాలు ఎక్కువగా దక్కాయి అంటే వైఎస్సార్ కుటుంబం వల్లనే అని చెప్పాల్సిఉంది.;

Update: 2025-03-15 03:52 GMT

బాలినేని శ్రీనివాసరెడ్డి. ప్రకాశం జిల్లాకు చెందిన సీనియర్ నేత. ఆయన రాజకీయ జీవితంలో అత్యధిక భాగం వైఎస్సార్ ఫ్యామిలీతో గడచింది. ఆయనకు రాజకీయంగా అవకాశాలు ఎక్కువగా దక్కాయి అంటే వైఎస్సార్ కుటుంబం వల్లనే అని చెప్పాల్సిఉంది. బాలినేని వైఎస్సార్ కుటుంబానికి దగ్గర బంధువు కూడా.

అయితే అనూహ్యంగా ఆయన వైసీపీని వీడిపోయారు. జనసేనలో చేరారు. అయితే అంతటితో ఆగకుండా జనసేన ఆవిర్భావ సభలో జగన్ మీద నిప్పులు చెరిగారు. ఆయన చేసిన రాజకీయ విమర్శల మీద ఇపుడు వైసీపీ నుంచి సోషల్ మీడియా వేదికగా గట్టిగానే కౌంటర్లు పడుతున్నాయి.

ఇక చూస్తే కనుక ప్రకాశం జిల్లాలో ఒకప్పుడు పలుకుబడి ఉన్న నేతగా బాలినేనిని చూడాలి. అయితే ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆయన కేసుల భయంతోనే పార్టీని వీడి పారిపోయారని కూడా సోషల్ మీడియాలో కామెంట్స్ పడుతున్నాయి.

ఇక జనసేన వేదిక మీద ఆయన పవన్ తో సినిమా తీయాలన్నది తన కోరిక అన్నారు. మరి పవన్ తో సినిమా తీసేటంతగా డబ్బులు బాలినేనికి ఎక్కడివి అని కూడా సోషల్ మీడియా వేదికగా ప్రశ్నలు వేస్తున్న వారు ఉన్నారు. బాలినేని సుద్దపూస గా ఉన్నారా అని కూడా అంటున్నారు. ఆయన అవినీతి చేయలేదా అని సోషల్ మీడియాలో వైసీపీ క్యాడర్ గట్టిగానే తగులుకుంటోంది.

ఇక ఒంగోలులో ఒక వైశ్య క్యాండిడేట్ ని బాలినేని కొట్టించారని కూడా పాత విషయాలు కెలికి మరీ సోషల్ మీడియాలో పెడుతున్నారు. ఇక బాలినేని ప్రత్యేకంగా ఏ వ్యాపారాలు చేయలేదు కానీ ఆరు ఎన్నికల్లో పోటీ చేసే స్తోమత డబ్బులు ఆయనకు ఎలా వచ్చాయని కూడా నిలదీస్తున్నారు వైసీపీ అభిమానులు.

మా నాన్న ఆస్తులు అమ్మాను అని బాలినేని అంటున్నారు. అయితే ఆయన నాన్నకు ఉన్న ఆస్తులు ఏమిటి అని కూడా అడుగుతున్నారు. ఆయన ఏమీ పెద్ద పారిశ్రామికవేత్త కారు కదా అని అంటున్నారు. ఆయన ఒక చిన్న ఉద్యోగి మాత్రమే కదా అని పాత విషయాలను చెబుతున్నారు.

ఇక ప్రకాశం జిల్లాలో అందరి దగ్గర ప్యాకేజీలు బాలినేని తీసుకున్నారని కూడా ఆరోపిస్తూ వైసీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. వాట్సప్ గ్రూప్ లో బాలినేని మీద వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున కామెంట్స్ చేస్తూ తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి.

బాలినేనికి అంత బలం ఉంటే ఒంగోలు నుంచి గిద్దలూరు కు ఎందుకు పోటీ చేయడానికి ప్రయత్నించారు అని కూడా ప్రశ్నిస్తున్నారు. ఇక ఒంగోలు నుంచి ఎమ్మెల్యేగా అయిదు సార్లు ప్రజలు గెలిపిస్తే బాలినేని ఏమి చేశారు అని కూడా నిగ్గదీస్తున్నారు. పాతికేళ్ళ రాజకీయ జీవితంలో ఏ అవినీతి చేయకపోతే బాలినేనికి ఇంత డబ్బు ఎలా వచ్చింది అని సోషల్ మీడియాలో వైసీపీ శ్రేణులు ఏకి పారేస్తున్నాయి.

అంతే కాదు బాలినేనికి ఈ రోజుకు ఉన్న కార్ల ఖరీదు ఏకంగా ఏడు నుంచి ఎనిమిది కోట్ల రూపాయలుగా ఉంటుంది అని అంటున్నాయి వైసీపీ శ్రేణులు. ఇవన్నీ పక్కన పెడితే ఒకవేళ వైసీపీ తరఫున 2024 ఎన్నికల్లో బాలినేని ఎమ్మెల్యేగా నెగ్గితే కనుక పార్టీ మారే ఆలోచన చేసేవారా అని కూడా ప్రశ్నిస్తున్నారు.

ఇక మంత్రివర్గంలో మార్పు చేర్పులు రెండున్నరేళ్ళ తరువాత చేస్తాను అని జగన్ ముందే చెప్పి ఉన్నారని గుర్తు చేస్తున్నారు. ఆ విధంగా చేసినపుడు చాలా మందిని మంత్రి పదవుల నుంచి తీసేశారు. అందులో బాలినేని కూడా ఒకరు. ప్రత్యేకించి బాలినేనిని తప్పిస్తే ఆయన తప్పుపట్టాలి కానీ తనకే అన్యాయం చేసినట్లుగా ఆయన విమర్శలు చేయడమేంటి అని ప్రశ్నిస్తున్నారు.

ఏది ఏమైనా సీనియర్ నేతగా రాజకీయాల్లో విశేష అనుభవం కలిగిన వారుగా బాలినేని ఈ తరహా విమర్శలు చేయడం తగదని అంటున్నారు. రాజకీయాల్లో పార్టీలు మారడం ఎవరికైనా సహజమే కానీ వదిలేసిన పార్టీ గురించి అధినేత గురించి వేరే పార్టీ వారి దగ్గర ఘాటు విమర్శలు చేస్తే రేపటి రోజున అక్కడ నుంచి వెళ్తే తమ మీద కూడా ఈ తరహా విమర్శలు చేస్తారని వారు కూడా అనుకునే ప్రమాదం ఉంది.

అది ఏకంగా పొలిటికల్ కెరీర్ కే కాదు ఆయా వ్యక్తుల విషయంలో కూడా అవతల వారు సందేహించాల్సిన పరిస్థితి ఉంటుంది అని అంటున్నారు. మెప్పు కోసం గొప్ప కోసం విమర్శలు చేయడం వరకూ బాగానే ఉంటుంది కానీ వెళ్ళిన ప్రతీ చోటా తమకు అనువైన రాజకీయమే సాగుతుంది అనుకోవడమూ పొరపాటే అంటున్నారు. అలా కుదరనపుడు అక్కడ కూడా ఇబ్బంది పడాల్సి వస్తుందని అంటున్నారు. మొత్తానికి బాలినేని జగన్ మీద వైసీపీ మీద చేసిన విమర్శల వల్ల ఆయనకే అవి తిప్పికొడతాయని వైసీపీ శ్రేణులు అంటున్నారు.

Tags:    

Similar News