వైసీపీ నుంచి జనసేనలోకి వలసలు? బాలినేని పిలిస్తే వచ్చేవారెందరు?

సీనియర్ నేత, పైగా తనకిష్టమైన వ్యక్తి కావడంతో బాలినేని కోరిన వెంటనే జనసేనాని కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట.. ఇంతకీ బాలినేని ఏం అడిగారు.. పవన్ దేనికి ఓకే చెప్పారు?

Update: 2025-01-24 13:07 GMT

మాజీ మంత్రి, జనసేన నేత బాలినేని శ్రీనివాసరెడ్డి తన మార్కు రాజకీయానికి పదును పెట్టారట.. తన వ్యూహం అమలు చేయడానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ జనసేనాని పవన్ కల్యాణ్ ను కలిశారు బాలినేని. సీనియర్ నేత, పైగా తనకిష్టమైన వ్యక్తి కావడంతో బాలినేని కోరిన వెంటనే జనసేనాని కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట.. ఇంతకీ బాలినేని ఏం అడిగారు.. పవన్ దేనికి ఓకే చెప్పారు?

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి భేటీ రాజకీయంగా ఇంట్రెస్టింగ్ గా మారింది. మంగళగిరిలో పార్టీ కార్యాలయంలో డిప్యూటీ సీఎంతో భేటీ అయిన బాలినేని తన అనుచరులు, వైసీపీకి చెందిన ముఖ్య నేతలను జనసేనలోకి తెచ్చేందుకు అనుమతి కోరినట్లు సమాచారం. పైగా వచ్చే ఫిబ్రవరి నెలలోనే ఇందుకు ముహూర్తం ఫిక్స్ చేసినట్లు చెబుతున్నారు. వైసీపీ నుంచి జనసేనలోకి వచ్చే సమయంలో భారీ జనసమీకరణ ఉండాలని భావించిన బాలినేని, అప్పట్లో అది కుదరకపోవడంతో మంగళగిరి పార్టీ కార్యాలయంలోనే కామ్ గా పార్టీ కండువా కప్పుకున్నారు. కానీ, ఇప్పుడు మాత్రం తన అనుచరులు, వైసీపీ నేతలు చేరే సందర్భంలో ఒంగోలులో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని ఫిక్స్ అయ్యారు. అధినేత పవన్ కల్యాణ్ అపాయింట్మెంట్ తీసుకుని ఫిబ్రవరి 5న భారీ కార్యక్రమం నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

పవన్, బాలినేని మధ్య చర్చలు ప్రకారం వచ్చేవారంలో వైసీపీ నుంచి వలసలకు ముహూర్తం ఫిక్స్ చేసినా, బాలినేని పిలిస్తే ఎంతమంది పార్టీ మారతారనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పటి నుంచి అసమ్మతి రాగం ఆలపిస్తున్న బాలినేనిపై ఆ పార్టీ నేతలు గుర్రుగా ఉన్నారని చెబుతున్నారు. అందుకే ఎన్నికల ముందే ఆయన పార్టీ మారే ప్రయత్నాలు చేసినా ఎవరూ వెంటరామని చెప్పడంతో వెనక్కి తగ్గారంటున్నారు. ఇక అధికారం కోల్పోయిన తర్వాత పార్టీ మారిన బాలినేని ఒక్కరే జనసేన కండువా కప్పుకోవాల్సివచ్చింది. అప్పట్లో తన అనుచరులతో జనసేనలోకి వస్తానని ఆయన చెప్పినా, కూటమిలోని ప్రధాన పార్టీ టీడీపీ నుంచి వ్యతిరేకత వ్యక్తమవడంతో బాలినేని ఒక్కరికే జనసేన తీర్థం ఇచ్చినట్లు చెబుతున్నారు.

ఈ పరిస్థితుల్లో భారీ జనసమీకరణ చేసి ఒంగోలులో సభ నిర్వహిద్దామని, ఆ సందర్భంగా తన అనుచరులను పార్టీలో చేర్చుకోవాలని బాలినేని మరోసారి డిప్యూటీ సీఎం, జనసేనాని పవన్ ను కోరినట్లు చెబుతున్నారు. దీంతో వచ్చేనెల 5న ఒంగోలు వెళ్లేందుకు పవన్ అంగీకరించినట్లు చెబుతున్నారు. అయితే దీనిపై జనసేన నుంచి అధికారిక ప్రకటన లేకపోయినా, బాలినేని వర్గీయులు మాత్రం వచ్చేనెల తొలివారంలో వైసీపీ నుంచి భారీ వలసలు ఉంటాయని చెబుతున్నారు. మరోవైపు పార్టీ మారిన తర్వాత వైసీపీ నేతలు ఎవరూ బాలినేనితో టచ్ లేనట్లు చెబుతున్నారు. ఇటీవల కాలంలో ఆయన జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు సైతం కూటమిలోని జనసేన నేతలు మాత్రమే కలుస్తున్నారు. అందులోనూ ఓ వర్గం వ్యతిరేకతతో ఉన్నట్లు ప్రచారం ఉంది.

జనసేనలో చేరినా ఎమ్మెల్యే, టీడీపీ నేత దామచర్ల జనార్దన్ మాత్రం బాలినేని ప్రమేయాన్ని అంగీకరించడం లేదు. ఈ పరిస్థితుల్లో వైసీపీ నుంచి మరింత మంది తన అనుచరులను తెస్తానని బాలినేని చెబుతున్నారు. దీనికి ఎమ్మెల్యే దామచర్ల అనుమతి తీసుకుంటారా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది. ఎన్నికల ముందు, ఆ తర్వాత జరిగిన సమన్వయ సమావేశాల్లో వైసీపీ నుంచి ఎవరు కూటమి పార్టీల్లో చేరినా ముందుగా మూడు పార్టీలు చర్చించుకోవాలని నిర్ణయించారు. ఇప్పటికే కొందరి విషయంలో ఈ నిబంధన అతిక్రమించారని ప్రచారం ఉంది. ఈ లిస్టులో బాలినేని పేరు ఉన్నాదంటున్నారు. ఎమ్మెల్యేకు ఇష్టంలేకపోయినా, డిప్యూటీ సీఎం పవన్ ప్రత్యేకంగా శ్రద్ధ చూపడంతో బాలినేని విషయంలో సీఎం చంద్రబాబు ఏమీ అనలేకపోయారంటున్నారు. ఇప్పుడు బాలినేని అనుచరులు వస్తే టీడీపీ క్యాడరుకు ఇబ్బంది తప్పదని అంటున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే నెలలో జరగబోయే రాజకీయ పరిణామాలతో ప్రకాశం పాలిటిక్స్ హీటెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ఈ పరిస్థితిని కూటమి పార్టీలు ఎలా అధిగమిస్తాయో చూడాల్సిందే.

Tags:    

Similar News