బాపట్లలో షాకింగ్ సీన్.. ఇంటి కోసం ఇసుక తెస్తే తల లేని బాడీ వచ్చింది
ఇంటికి తీసుకొచ్చిన ఇసుక కుప్పలో డెడ్ బాడీ కనిపించింది. తల లేకుండా కేవలం మొండం మాత్రమే ఉన్న ఈ డెడ్ బాడీ ఇసుక కుప్పలో కనిపించటంతో షాక్ తిన్నారు.
విన్నంతనే ఉలిక్కిపడే ఉదంతం బాపట్ల జిల్లాలోని ఈపురుపాలెంలో చోటు చేసుకుంది. బాపట్ల పట్టణానికి పది కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ చిన్న గ్రామానికి చెందిన రాంబాబు అనే వ్యక్తి ఇంటిని నిర్మించుకుంటున్నాడు. ఇంటి నిర్మాణానికి అవసరమైన ఇసుక కోసం నాలుగు రోజుల క్రితం ఒక కాంట్రాక్టర్ తో ఇసుక కోసం ఒప్పందం చేసుకున్నాడు.
ఒప్పందంలో భాగంగా సదరు కాంట్రాక్టర్ అదే రోజు రాత్రి ఇసుక కుప్ప తీసుకొచ్చి ఇంటి ముందు పోశాడు. దీంతో.. శుక్రవారం దాన్ని పొక్లెయిన్ సాయంతో బేస్ మెంట్ లో పోసే క్రమంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఇంటికి తీసుకొచ్చిన ఇసుక కుప్పలో డెడ్ బాడీ కనిపించింది. తల లేకుండా కేవలం మొండం మాత్రమే ఉన్న ఈ డెడ్ బాడీ ఇసుక కుప్పలో కనిపించటంతో షాక్ తిన్నారు.
తల లేకుండా డెడ్ బాడీ రావటం.. ఎడమ చేయి చిన్నగా ఉండటం.. కుడి చేతి మీద లవ్ సింబల్ తో పాటు ఎల్లో కలర్ తాడు కట్టి ఉన్న విషయాన్ని గుర్తించారు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడకు చేరుకొని.. డెడ్ బాడీని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం కోసం చీరాల ఆసుపత్రికి తరలించారు. ఇసుకను ఎక్కడ నుంచి తీసుకొచ్చారు? ఎవరు తెచ్చారన్న ప్రశ్నలతో పాటు.. డెడ్ బాడీ ఎవరిది? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.
సంచలనంగా మారిన ఈ ఉదంతం చూస్తే.. ఎవరో చంపేసి.. ఆనవాళ్లు తెలీకుండా ఉండేందుకు తలను వేరు చేసి ఉంటారని భావిస్తున్నారు. తల లేకుండా గుర్తించటం కష్టమన్న ఉద్దేశంతో ఈపని చేసి ఉంటారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. హత్య చేసి.. ఇసుక రీచ్ లో కప్పేసి ఉంటారని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. చుట్టుపక్కల ప్రాంతాల్లో మిస్సింగ్ కేసుల్లో పేర్కొన్న వ్యక్తి వివరాలతో ఈ డెడ్ బాడీ మ్యాచ్ అయితే ఈ కేసు ఒక కొలిక్కి వస్తుందని భావిస్తున్నారు.