గజదొంగ: చోరీలే కాదు.. విలాసాల్లోనూ దిట్టే!
గజదొంగ.. 1980లలో వచ్చిన సినిమా ఇది. దీనిలో అన్నగారు ఎన్టీఆర్ గజదొంగ పాత్రధారి.
గజదొంగ.. 1980లలో వచ్చిన సినిమా ఇది. దీనిలో అన్నగారు ఎన్టీఆర్ గజదొంగ పాత్రధారి. దొంగతనాలు చేస్తూ.. వచ్చిన సొమ్ముతో జల్సాలు చేసే పాత్ర అది. దానిని సమర్థించుకున్న పాత్ర కూడా అది! అప్ప ట్లో ఆ సినిమా పెద్ద ఎత్తున ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు కట్ చేస్తే.. అచ్చం .. అలాంటి గజ దొంగే పోలీసులకు పట్టుబడ్డాడు. సినిమాటిక్‌లో ఈ దొంగ కూడా.. చోరీ చేసిన సొత్తుతో విలాసాలు చేస్తూ.. ఎంజాయ్ చేస్తున్నాడని పోలీసులు తెలిపారు.
ఎవరీ దొంగ!
ఇటీవల హైదరాబాద్ నడిబొడ్డున గచ్చిబౌలి ప్రాంతంలోని ప్రిజమ్.. పబ్బులో పోలీసులపై కాల్పులు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులు గాయపడ్డారు. దీనికి సంబంధించి పోలీసులు అరెస్టు చేసిన నిందితుడు.. బత్తుల ప్రభాకర్. చూడడానికి చాలా అమాయకుడిగా కనిపించే ప్రభాకర్ చరిత్రను తవ్వితీస్తే.. అచ్చం అన్నగారి పాత్ర `గజదొంగ` కళ్లకు కట్టినట్టు కనిపిస్తుంది. ఏకంగా 80 దొంగతనాల కేసులు ఇతనిపై ఉన్నాయి. పైగా ఒక ప్రాంతం ఒక రాష్ట్రం కాదు.. ఏకంగా ఐదు రాష్ట్రాల్లో ప్రభాకర్ పేరు మార్మోగుతోందని పోలీసులు తెలిపారు.
నేరస్వభావం ఉన్న ప్రభాకర్ ఎప్పుడో జైలుకు వెళ్లాడు. ఆ తర్వాత.. బెయిల్‌పై విడుదలైనా.. తన స్వభా వాన్ని ఏమాత్రం మార్చుకోలేదు. పైగా.. తన నేర వృత్తిని రాష్ట్రాలు దాటించి ఏపీ, తెలంగాణ సహా.. తమి ళనాడు, కర్నాటక, కేరళ వరకు పాకించాడు. ఇలా.. మొత్తం 80కి పైగా దొంగతనాలు చేసిన ప్రభాకర్.. వచ్చిన సొమ్ముతో జల్సాలు చేయడాన్ని అలవాటుగా మార్చుకున్నాడు. ఈ చోరీ రాయుడి దొంగతనాలు ఏరేంజ్‌లో ఉంటాయంటే.. కేవలం 11 చోరీల్లో కొట్టేసిన సొత్తు విలువే రూ.2.5 కోట్లట!!
అంతేకాదు.. ప్రభాకర్.. పర్సనల్ లైఫ్‌ను చూస్తే.. ఆయనకు ఖరీదైన కార్లు సొంతం. పైగా లక్షలు వెచ్చించే పబ్బుల్లో ఖుషీఖుషీగా గడపడం.. ఆయనకు ఎంతో ఇష్టమట! శనివారం గచ్చిబౌలిలో జరిగిన కాల్పుల ఘటన అనంతరం.. ప్రభాకర్‌ను పోలీసులు రిమాండుకు తరలించారు. అతని నుంచి 3 నాటు తుపాకులు, 451 తూటాలు స్వాధీనం చేసుకున్నారు.
ఏపీ దొంగే!
ప్రభాకర్.. ఏపీకి చెందిన వ్యక్తేనని పోలీసులు తెలిపారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని సోమల మండలం ఇరికిపెంట గ్రామానికి చెందిన ప్రభాకర్(30) కుటుంబం అతని చిన్నతనంలోనే పశ్చిమగోదావరి జిల్లాకు వలస వెళ్లింంది. తల్లిదండ్రుల మరణించడంతో 9వ తరగతిలోనే చదువు వదిలేసిన ప్రభాకర్.. 2013లో దొంగతనాల బాట పట్టి.. దానినే వృత్తిగా చేసుకుని అనతికాలంలోనే గజదొంగగా మారిపోయాడని పోలీసులు తెలిపారు. 2020లో విశాఖ పోలీసులు అరెస్టు చేశారు. అప్పటికే అతనిపై 60 కేసులున్నాయి.
తోటి ఖైదీని చంపాలని!
ప్రభాకర్ దగ్గర తుపాకులు ఉండడానికి కారణం.. గతంలో తాను జైల్లో ఉన్న సమయంలో తనను వేధించిన ఓ ఖైదీని అంతం చేయాలన్న ఉద్దేశమేనని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో బెయిల్‌పై వచ్చిన ప్రభాకర్.. గచ్చిబౌలిలో ఓ స్నేహితుడి గదిలో ఉంటున్నాడు. 8 నెలల క్రితం బిహార్ నుంచి 3 నాటు తుపాకులు, బుల్లెట్లు తెప్పించుకున్నాడు. అప్పటి నుంచి తప్పించుకుని తిరుగుతూ.. ఇంజనీరింగ్ కాలేజీల్లో దొంగతనాలు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే పోలీసుల కంట పడడం.. ఆవెంటనే వారిపై కాల్పలకు దిగడంతో పోలీసులు ప్రభాకర్‌ను అరెస్టు చేశారు.