వంగవీటి సైలెంట్ వెనక...అడుగులు అటేనా...!?

సరే కానీ ఇంతటి కీలకమైన ఎన్నికల వేడిలో రాధా ఎందుకు సైలెంట్ గా ఉన్నారు అన్నది ప్రశ్నగా ముందుకు వస్తోంది.

Update: 2023-12-29 03:15 GMT

వంగవీటి ఈ పదానికి ఏపీ పాలిటిక్స్ లో వైబ్రేషన్స్ వైడ్ గా ఉంటాయి. సౌండ్ కూడా భూమి దద్దరిల్లేలా ఉంటుంది. ఈ పదం అన్నది ఒక ఇంటి పేరు కాదు, ఒక బలమైన సామాజిక వర్గం తన సొంత పేరుగా భావిస్తుంది. అందుకే వంగవీటి అంటే అంత పాపులర్ అవుతుంది. అలాంటి వంగవీటి రంగా గతించి 35 ఏళ్ళు అయింది. నిన్నటికి నిన్న ఆయన వర్ధంతి వేడుకలను అభిమానులు ఘనంగా జరుపుకున్నారు. అదే టైం లో రాధా ఎక్కడ అన్న చర్చకు తెర లేచింది.

రాధా ఆ టైం లో కాశీలో ఉండి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అని జవాబు వచ్చింది. సరే కానీ ఇంతటి కీలకమైన ఎన్నికల వేడిలో రాధా ఎందుకు సైలెంట్ గా ఉన్నారు అన్నది ప్రశ్నగా ముందుకు వస్తోంది. రాధా సైలెంట్ వెనక వైలెంట్ డెసిషన్ కూడా ఉండబోతోందా అన్నది కూడా అంతా అంటున్న విషయం.

రాధా ప్రస్తుతం టీడీపీలో ఉన్నారు. ఆయన ఉన్నారు అంటే ఉన్నారు కానీ కచ్చితంగా ఆ పార్టీతో కలసి నడవడం లేదు అని అంటున్నారు. ఎక్కడా పెద్దగా కనిపించడంలేదు అని అంటున్నారు. ఆయన ఆ మధ్య లోకేష్ పాదయాత్రలో కొంత మెరిసారు. మళ్లీ సైలెంట్ అయ్యారు. ఈలోగా ఆయన పెళ్ళి కూడా జరిగింది. ఆయన ఏ పార్టీలో చేరుతారు అన్నది కొన్నాళ్ళ పాటు చర్చ జరిగింది.

ఏపీలో టీడీపీ జనసేన పొత్తులో ఉన్నాయి. ఈ రెండు పార్టీలలో కూడా రాధాకు అనుకున్న సీటు రాదు అని కంఫర్మ్ అయింది అంటున్నారు. రాధా విజయవాడ సెంట్రల్ సీటుని ఆశిస్తున్నారు. ఆయన అక్కడే పట్టుబట్టి ఉన్నారు. అయితే టీడీపీలో పొలిట్ బ్యూరో మెంబర్ అయిన బోండా ఉమా మహేశ్వరరావుకు దాన్ని చంద్రబాబు కేటాయించారు.

ఆయన 2014లో తొలిసారి గెలిచారు. 2019లో జస్ట్ పాతిక ఓట్ల తేడాతో ఓటమి పాలు అయ్యారు. ఇక 2024లో కూడా ఆయనకే టికెట్ అన్నది ఖరారు అయింది. జనసేనలోకి వెళ్ళినా కూడా ఆ సీటు దక్కే చాన్స్ లేదని అందుకే రాధా మౌనముద్రలో ఉన్నారని అంటున్నారు

తమాషా ఏంటి అంటే వైసీపీలో ఆ సీటు ఖాళీగా ఉంది. సిట్టింగ్ ఎమ్మెల్యే మల్లాది విష్ణుకు ఈసారి సీటు ఇవ్వరని తేలిపోతోంది. ఆ సీటు కోసం వైసీపీలో చాలా మంది చూస్తున్నారు కానీ బోండా ఉమాని ఓడించే వారి కోసం వైసీపీ సెర్చ్ చేస్తోంది. రాధా వస్తే ఆయన్ని పార్టీలోకి తీసుకుని వైసీపీ ఆ సీటు ఇవ్వగలదు.

మరి రాధా మదిలో ఏముందో తెలియదు. ఎందుకంటే ఆయన 2019 ఎన్నికలకు ముందు వైసీపీని వీడి బయటకు వచ్చేశారు. అదే విధంగా ఆయన టీడీపీలో చేరారు. ఆ నిర్ణయం అప్పట్లో రాధా అభిమానులను కూడా విస్మయానికి గురి చేసింది అంటారు.

ఏది ఏమైనా రాధా టీడీపీలో సుఖంగా అయితే లేరు అని అంటున్నారు. ఆయనకు వైసీపీలో కూడా మిత్రుడు మాజీ మంత్రి కొడాలి నాని ఉన్నారు. దాంతో అక్కడ ఆయనకు డోర్స్ ఓపెన్ అయి ఉన్నాయి. మరో విషయం ఏంటి అంటే కాంగ్రెస్ పార్టీ కూడా రాధా కోసం చూస్తోంది.

ఆయన వస్తే చేర్చుకుని ఏపీ రాష్ట్ర పదవి ఇస్తామని కోరుకున్న సీటు ఇస్తామని చెబుతోంది. మొత్తానికి రాధా పెదవి విప్పడం లేదు. ఆయన టీడీపీలో ఉంటే విజయవాడ తూర్పు సీటు ఇస్తారని అంటున్నారు. అది రాధాకు ఇష్టం లేకపోతే మాత్రం పార్టీ మారాల్సి ఉంటుంది. ఎన్నికలు ముంచుకొస్తున్న వెళ రాధా ఏ డెసిషన్ తీసుకుంటారు అన్నది ఆసక్తిని పెంచుతోంది. మొత్తానికి రాధా వైపు అంతా చూస్తున్నారు.

Tags:    

Similar News