వామ్మో... న్యూఇయర్ సెలబ్రేషన్స్ కోసం షాకింగ్ ప్రిపరేషన్!?

రానున్న న్యూ ఇయర్ సందర్భంగా ప్రారంభమయ్యే పార్టీలకు మత్తు పదార్థాలు సరఫరా చేసేందుకు గ్యాంగులు ఇప్పటికే సిద్ధమైపోయాయని అంటున్నారు.

Update: 2024-11-23 09:30 GMT

వేడుక ఏదైనా మాదకద్రవ్యాలు ఉండాల్సిందే అన్నట్లుగా కొన్ని చోట్ల పరిస్థితులు మారిపోయాయని అంటున్నారు. గ్రామ స్థాయి నుంచి మెట్రోపాలిటన్ నగరాల వరకూ సెలబ్రేషన్స్ ఏమి జరిగినా అక్కడ ఏదో ఒక రూపంలో మత్తుపదార్థం జాడ కనిపిస్తుందని.. ఆ స్థాయిలో ఈ విష సంస్కృతి మొదలైందని అంటున్నారు.

ఇలా చిన్నా చితకా పార్టీల్లో పరిస్థితే అలా ఉంటే.. ఇక న్యూ ఇయర్ వేడుకల సంగతి? ఇప్పటి నుంచే నూతన సంవత్సర వేడుకల సందడి మొదలైపోయిందని.. 31 రాత్రి జరిగే ఈవెంట్లకు టిక్కెట్ల అమ్మకాలు ప్రారంభమైపోయాయని.. కొన్ని చోట్ల అయిపోయాయని అంటున్నారు. ఈ సమయంలో గుట్టలుగా మత్తుపదార్ధాలు పట్టుబడ్డాయి.

అవును... రానున్న న్యూ ఇయర్ సందర్భంగా ప్రారంభమయ్యే పార్టీలకు మత్తు పదార్థాలు సరఫరా చేసేందుకు గ్యాంగులు ఇప్పటికే సిద్ధమైపోయాయని అంటున్నారు. దీంతో.. పోలీసులు వీటిపై గట్టి నిఘా పెట్టారని తెలుస్తోంది. ఈ సమయంలో బెంగళూరు సెంట్రల్ క్రైం బ్రాంచ్ (సీసీబీ) గుట్టల కొద్దీ మత్తు పదార్ధాలు స్వాధీనం చేసుకున్నారు.

ఈ విషయాలను తాజాగా బెంగళూరు సిటీ పోలీస్ కమిషనర్ దయానంద్ వెల్లడించారు. ఇందులో భాగంగా... బెంగళూరు సీసీబీ అధికారులు రెండు ముఠాల నుంచి రూ.6.25 కోట్ల విలువ చేసే వివిధ రకాల మత్తు పదార్థాలు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఇందులో గంజాయి నుంచి కొకైన్, ఎండీఎంఏ క్రిస్టల్ వరకూ ఉన్నాయని అంటున్నారు.

ఈ క్రమంలో సోలదేవనహళ్లీ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ఇంటిపై దాడిచేసిన సీసీబీ అధికారులకు.. రూ.3 కోట్ల విలువ చేసే మాదక ద్రవ్యాలు పట్టుబడాయని సీపీ తెలిపారు. ఇందులో 1520 గ్రాముల ఎండీఎంఏ, 20 గ్రాముల కొకైన్, 20 గ్రాముల ఎక్స్ టెసీ గుళికలు ఉన్నాయని తెలిపారు.

ఇదే సమయంలో... గోవిందపుర పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇంటిపై దాడి చేయగా.. రూ.3.25 కోట్ల విలువ చేసే 318 కిలో గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. దీనితో పాటు ముగ్గురు నిందితులు, మూడు సెల్ ఫోన్లు, ఓ కారు కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఒడిశా నుంచి ఏపీ మీదుగా కారులో ఇది తరలించుకొచ్చినట్లు చెబుతున్నారు.

ఇక సోలదేవనహళ్లీ పోలీస్ స్టేషన్ పరిధిలో దొరికిన డ్రగ్స్ కేసులో పట్టుబడినవారు ఆఫ్రికా దేశాలకు చెందినవారని అంటున్నారు! ముగ్గురు నిందితులూ ఆఫ్రికా నుంచి వైద్య అవసరాల వీసాలతో భారత్ లోకి ఎంట్రీ ఇచ్చి.. ముంబై, ఢిల్లీ ల్లో ఉన్న ఆఫ్రికన్లతో సన్నిహితంగా ఉంటూ ఈ దందా కొనసాగిస్తున్నట్లు గుర్తించామని అన్నారు.

Tags:    

Similar News