ట్రంప్ విజ‌యం.. భార‌త్‌కు మేలెంత‌?

మ‌రీ ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ భార‌త్‌కు అనుకూల అధ్య‌క్షుడిగా గ‌తంలోనే పేరు తెచ్చుకున్నారు.

Update: 2024-11-06 13:30 GMT

అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల‌కు భార‌త్‌కు అవినాభావ సంబంధం ఉంది. అమెరికాకు జ‌లుబు చేస్తే.. భార‌త్‌లో తుమ్ములు వ‌స్తాయ‌న్న నానుడి అంద‌రికీ తెలిసిందే. అలా ద‌శాబ్దాలుగా అమెరికాతో భార‌త్‌కు అనేక రూపాల్లో సంబంధ బాంధ‌వ్యాలు ఉన్నాయి. ఇవ‌న్నీ కూడా.. అమెరికా అధ్య‌క్షుడిగా ఉన్న నేత‌ను బ‌ట్టే బ‌లోపేతం అవుతున్నాయి. మ‌రీ ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ భార‌త్‌కు అనుకూల అధ్య‌క్షుడిగా గ‌తంలోనే పేరు తెచ్చుకున్నారు.

అయితే, కొన్ని కొన్ని విష‌యాల్లో మాత్రం ముందు దుందుడుకు నిర్ణ‌యాలు తీసుకున్నా.. త‌ర్వాత వాటిని వెన‌క్కి తీసుకున్న సంద‌ర్భాలు కూడా ఉన్నాయి. మ‌రీ ముఖ్యంగా బైడెన్ స‌ర్కారు వ‌చ్చాక‌.. భార‌త్‌కు అంత‌ర్గ‌తంగానే కాకుండా.. ప్ర‌పంచ స్థాయిలోనూ ఇక్క‌ట్లు ఎదుర‌య్యాయి. దీంతో మోడీ ప్ర‌భుత్వం ఇబ్బందులు ప‌డింది. ర‌ష్యా-ఉక్రెయిన్ యుద్ధం స‌హా.. చైనాతో ఉన్న ర‌గ‌డ వంటి వాటిని పెంచి పోషించ‌డంలో బైడెన్ స‌ర్కారు దూకుడుగా వ్య‌వ‌హ‌రించింది.

భార‌త్ విష‌యంలో బైడెన్ వ‌ర్సెస్ ట్రంప్‌..

+ భార‌త దాయాది దేశం, అదేస‌మ‌యంలో శ‌త్రుదేశం కూడా.. అయిన పాకిస్థాన్‌కు సాయం చేసే విష‌యం లో ట్రంప్ క‌ఠినంగా వ్య‌వ‌హ‌రిస్తే.. బైడెన్ స‌ర్కారు ఉదారంగా వ్య‌వ‌హ‌రించింది. ఇది భార‌త్‌కు కంటిపై కునుకు లేకుండా చేసింది.

+ చైనా అనుకూల విధానాల‌ను బైడెన్ ప్రోత్స‌హించారు. కానీ, ట్రంప్ గ‌తంలోనూ.. ఇప్పుడు కూడా.. చైనా అనుకూల విధానాల‌కు చెక్ పెట్టారు. ఇప్పుడు కూడా ఇదే హామీ ఇచ్చారు. ప‌లితంగా భార‌త్‌కు ఇది మేలు చేసే చ‌ర్య‌గా మారుతుంది.

+ ర‌ష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో భార‌త్ వాస్త‌వానికి త‌ట‌స్థ వైఖ‌రి అవ‌లంభిస్తోంది. కానీ, బైడెన్ మాత్రం.. భార‌త్ ప‌రోక్షంగా ర‌ష్యాకు సాయం చేస్తోందంటూ.. ఇటీవ‌లే భార‌త్‌కు చెందిన వ్య‌క్తులు, సంస్థ‌ల‌పై ఆంక్ష‌లు విధించారు. ఈ ప‌రిణామం అంత‌ర్జాతీయంగా భార‌త్‌కు ఇబ్బందిగా మారింది. కానీ, ట్రంప్ మాత్రం తాను అధ్య‌క్ష పీఠం ఎక్క‌గానే ర‌ష్యాను నియంత్రిస్తాన‌ని.. త‌న మిత్రుడు పుతిన్‌ను ఒప్పించి.. యుద్ధానికి ముగింపు ప‌లుకుతాన‌ని చెప్పారు. త్వ‌ర‌లోనే భార‌త్‌లో స‌యోధ్య భేటీ జ‌ర‌గ‌నుంది. దీనికి ప్ర‌స్తుతం విజ‌యం ద‌క్కించుకున్న ట్రంప్ కూడా హాజ‌ర‌య్యే అవ‌కాశం ఉంది.

+ భార‌తీయ విద్యార్థుల వీసాల విష‌యంలో బైడెన్ క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించారు. దీంతో భార‌తీయ ఓట‌ర్లు ట్రంప్ వైపు మొగ్గు చూపారు. ఈ ప‌రిణామాల‌ను గుర్తించిన క‌మ‌ల హ్యారిస్‌.. భారతీయ ఓట‌ర్ల‌ను త‌న‌వైపు తిప్పుకొనే ప్ర‌య‌త్నం చేశారు. కానీ, ఫ‌లించ‌లేదు. ట్రంప్ మాత్రం భార‌త్ కు అనుకూల విధానాలే తీసుకువ‌స్తామ‌న్నారు.

+ భార‌త అంత‌ర్గ‌త విష‌యాల్లో బైడెన్ స‌ర్కారు జోక్యం చేసుకునేందుకు ఇష్ట‌ప‌డింది. ముఖ్యంగా.. ఆర్టిక‌ల్ 370 ర‌ద్దును ప్ర‌శ్నించ‌డం గ‌మ‌నార్హం. క‌శ్మీర్‌కు స్వ‌యం ప్ర‌తిపత్తిని ర‌ద్దు చేస్తూ.. మోడీ స‌ర్కారు తీసుకున్న నిర్ణ‌యాన్ని బైడెన్ స‌ర్కారు త‌ప్పుబ‌ట్ట‌డం గ‌మ‌నార్హం.

+ ప్ర‌ధానంగా న‌రేంద్ర మోడీకి ట్రంప్ మిత్రుడు కావ‌డం గ‌మ‌నార్హం. 2020లో స్వ‌యంగా ట్రంప్‌కు ప్ర‌చారం కూడా చేశారు. ఇప్పుడు క్షేత్ర‌స్థాయిలో ప‌ర్య‌టించి ప్ర‌చారం చేయ‌క‌పోయినా.. విదేశాంగ శాఖ ద్వారా మాత్రం ట్రంప్‌కు అనుకూలంగా ప్ర‌క‌ట‌నలు చేయించ‌డం గ‌మ‌నార్హం. మొత్తంగా చూస్తే.. అంత‌ర్గ‌తంగా, అంత‌ర్జాతీయంగా కూడా.. భార‌త్‌కు ట్రంప్‌తో మేలు జ‌ర‌గ‌నుంది.

Tags:    

Similar News