భారతరత్నల విషయంలో ఇదే రికార్డు!
కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఈ ఏడాది ఐదుగురికి దేశ అత్యున్నత పౌర పురస్కారం.. భారతరత్నను ప్రకటించిన సంగతి తెలిసిందే
కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఈ ఏడాది ఐదుగురికి దేశ అత్యున్నత పౌర పురస్కారం.. భారతరత్నను ప్రకటించిన సంగతి తెలిసిందే. తద్వారా మోదీ ప్రభుత్వం రికార్డు సృష్టించింది.
ఇప్పటివరకు ఒక ఏడాదిలో గరిష్టంగా నలుగురికి మాత్రమే భారతరత్నలు ప్రకటించారు. అది కూడా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడే. 1999లో అటల్ బిహారీ వాజపేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు నలుగురికి భారతరత్నలు ప్రకటించారు.
1999కి ముందు ఒకే ఏడాది నలుగురికి భారతరత్నలు ప్రకటించిన దాఖలాలు లేవు. మళ్లీ ఇన్నాళ్లకు 1999 నాటి రికార్డును బద్దలు కొడుతూ ఒకే ఏడాది (2024) ఐదుగురికి భారతరత్నలు ప్రకటించారు.
ఈ ఏడాది బిహార్ ముఖ్యమంత్రి కర్పూరీ ఠాకూర్, రాజకీయ కురువృద్ధుడు, దేశ మాజీ ఉప ప్రధాని ఎల్కే అద్వానీ, మాజీ ప్రధానమంత్రులు పీవీ నరసింహారావు, చౌదరీ చరణ్ సింగ్, హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్ లకు భారతరత్న పురస్కారాన్ని ప్రకటించారు. దీంతో భారతరత్న పురస్కారం అందుకున్నవారి సంఖ్య 53కు చేరింది.
1954 నుంచి భారతరత్న పురస్కారాలను అందిస్తున్న సంగతి తెలిసిందే.
మొదటి ఏడాది (1954)లో దేశ తొలి ఉపరాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్, స్వతంత్ర భారతదేశానికి తొలి భారత గవర్నర్ జనరల్ సి.రాజగోపాలాచారి, విఖ్యాత శాస్త్రవేత్త సీవీ రామన్ లకు భారతరత్న పురస్కారాన్ని ప్రకటించారు.
కాగా చివరిసారిగా భారతరత్న పురస్కారాలను 2019లో ప్రకటించారు. ఆ ఏడాది మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రముఖ గాయకుడు భూపేన్ హజారికా, నానాజీ దేశ్ ముఖ్ లకు భారతరత్నను ప్రకటించారు.
మళ్లీ ఐదేళ్లపాటు ఎవరికీ ఈ పురస్కారాన్ని ప్రకటించలేదు. ఇప్పుడు 2024లో ఏకంగా ఐదుగురికి ఒకేసారి భారతరత్న పురస్కారాలను అందజేశారు. తద్వారా భారతరత్నల చరిత్రలో ఒకే ఏడాది అత్యధికంగా ఐదుగురికి ఈ పురస్కారం దక్కింది.
భారతరత్న పురస్కారం కింద రాష్ట్రపతి సంతకం చేసిన ధ్రువపత్రం, పతకం అందజేస్తారు. ఎలాంటి నగదు బహుమానం ఉండదు.
ఏదైనా రంగంలో అసాధారణ సేవలు అందించి, అత్యున్నత పనితీరు ప్రదర్శించినవారికి ‘భారతరత్న’ పురస్కారం అందిస్తారు. దేశ ప్రధానమంత్రిగా ఉన్న వ్యక్తి ఈ పురస్కారానికి సంబంధించిన సిఫార్సులను రాష్ట్రపతికి పంపుతారు. మరే అధికారిక సిఫార్సుల అవసరం ఉండదు.