ఏపీలో ఎమ్మెల్సీ బెర్త్‌లు.. త్యాగరాజులకు బీజేపీ ట్విస్ట్ ఇచ్చిందే... !
ఏపీలో 5, తెలంగాణలో 5 ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే.;
ఏపీలో 5, తెలంగాణలో 5 ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ పది స్థానాలు కూడా ఎమ్మెల్యే కోటాలోనే ఎన్నికలు జరుగుతాయి. ఇక ఏపీ విషయానికి వస్తే ఐదు స్థానాలు కూడా కూటమి ఖాతాలోకే వెళతాయి. కూటమిలో మూడు పార్టీలు ఉన్నాయి. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిలో అధికారం అనుభవిస్తున్నాయి. ఇక్కడి వరకు బాగానే ఉంది. జనసేన కోటా పక్కన పెట్టేస్తే ఇప్పుడు బీజేపీ కూడా తమకు ఓ ఎమ్మెల్సీ కావాలని గట్టిగా పట్టుబడుతున్నట్టు తెలుస్తోంది.
అప్పుడు తెలుగుదేశం పార్టీకి మూడు ఎమ్మెల్సీ సీట్లే మిగులుతాయి. ఇక బీజేపీ నేతలు నిన్న మొన్నటి వరకు సైలెంట్‌గానే ఉన్నారు. ఇప్పుడు మా సీటు ఒకటి మాకు ఇవ్వాలి కదా అని రాష్ట్ర నాయకత్వం ద్వారా జాతీయ నాయకత్వంపై ఒత్తిడి పెట్టిస్తున్నారట. కొందరు నేతలు ఢిల్లీ స్థాయిలో చేసిన లాబీయింగ్ తో కొన్ని పేర్లు తెరపైకి వచ్చాయి. బీజేపీ క్రమశిక్షణా కమిటీ చైర్మన్ గా ఉన్న పాకా వెంకట సత్యనారయణకు అవకాశం ఇవ్వాలంటూ ఆయన పేరు తెరమీదకు తీసుకు వచ్చారు.
దీంతో కూటమి ఎమ్మెల్సీ సీట్ల విషయంలో ఏం జరుగుతుంది.. ఏయే పార్టీల నుంచి ఫైనల్‌గా ఎవరి పేర్లు ఫైనల్ అవుతాయి అన్నది కూడా ఆసక్తిగా మారింది. ఇక పొత్తు పొడిచేందుకు జనసేన బీజేపీ కోసం ఎమ్మెల్యే సీట్లే త్యాగం చేసింది. ఇప్పుడు ఎమ్మెల్సీ స్థానాలను టీడీపీ త్యాగం చేయాల్సి వస్తోందన్న టాక్ వచ్చేసింది. అయితే ఇప్పుడు బీజేపీ కూడా ఎమ్మెల్సీ సీటు అడిగితే తెలుగుదేశం నుంచి సీట్లు త్యాగం చేసి ఎమ్మెల్సీ రేసులో ఉన్న నేతల పరిస్థితి ఏంటన్నదే ప్రశ్న.
అయితే వైసీపీ మాజీ నేత విజయసాయిరెడ్డి రాజీనామా చేసిన సీటు కూడా బీజేపీకే వెళ్తుందని అంటున్నారు. చంద్రబాబు ఢిల్లీ నుంచి వచ్చినా మళ్లీ వెంటనే ఢిల్లీకి వెళ్లనున్నారు. అక్కడే బీజేపీకీ ఎమ్మెల్సీ సీటు ఇచ్చే విషయమై ఏదో ఒకటి తేల్చేస్తారంటున్నారు. చంద్రబాబు ఢిల్లీ బీజేపీ నేతలను ఏదోలా కన్వీన్స్ చేస్తేనే ఏపీలో త్యాగరాజులకు కాస్త న్యాయం జరుగుతుందన్న ఆశలతో టీడీపీ నేతలు ఉన్నారు.