తెలంగాణ బీజేపీలో పదవుల కోలాహలం.. ఒకేసారి 27 జిల్లాలకు అధ్యక్షులు

తెలంగాణలోని 33 జిల్లాలకు గాను ఒకేసారి ఏకంగా 27 జిల్లాలకు అధ్యక్షులను ప్రకటించింది బీజేపీ. మరొక్క ఆరు జిల్లాలకు చీఫ్ ల నియామకాన్ని ఆపింది.

Update: 2025-02-03 08:11 GMT

అసెంబ్లీ ఎన్నికలకు ముందు తాము గెలిచేస్తున్నట్లు హడావుడి చేసిన బీజేపీ చివరి నిమిషంలో రాష్ట్ర అధ్యక్షుడిని మార్చి చేజేతులా చెడగొట్టుకుంది. అయితే, ఆ వెంటనే జరిగిన లోక్ సభ ఎన్నికల్లో 8 స్థానాలను గెలుచుకుని తన సత్తా చాటింది. కాగా, మరోసారి ఇప్పుడు అధ్యక్షుడి నియామకం చేపట్టాల్సి ఉంది. ఈ క్రమంలో ముందుగా జిల్లాల అధ్యక్షులను నియమించింది.

తెలంగాణలోని 33 జిల్లాలకు గాను ఒకేసారి ఏకంగా 27 జిల్లాలకు అధ్యక్షులను ప్రకటించింది బీజేపీ. మరొక్క ఆరు జిల్లాలకు చీఫ్ ల నియామకాన్ని ఆపింది. ఈ లెక్కన సంస్థాగతంగా కాషాయ పార్టీ గట్టి చర్యలు తీసుకుంటోందని తెలుస్తోంది.

సోమవారం విడుదల చేసిన జాబితా ప్రకారం జనగామ జిల్లాకు సౌడ రమేశ్‌, వరంగల్‌ కు గంట రవి, హనుమకొండకు సంతోష్‌రెడ్డి, భూపాలపల్లికి నిశిధర్‌రెడ్డి, నల్లగొండకు నాగం వర్షిత్‌ రెడ్డి, నిజామాబాద్‌ కు దినేష్‌ కులాచారి, వనపర్తికి నారాయణ, హైదరాబాద్‌ సెంట్రల్‌ కు దీపక్‌రెడ్డి, మేడ్చల్‌ రూరల్‌ కు శ్రీనివాస్‌, ఆసిఫాబాద్‌ కు శ్రీశైలం ముదిరాజ్‌, కామారెడ్డికి నీలం చిన్నరాజులు, ములుగు కు బలరాం, మహబూబ్‌నగర్‌ కు శ్రీనివాస్‌రెడ్డి, జగిత్యాల కు యాదగిరిబాబు, మంచిర్యాల కు వెంకటేశ్వర్లు గౌడ్‌, పెద్దపల్లికి సంజీవరెడ్డి, ఆదిలాబాద్‌ కు బ్రహ్మానందరెడ్డిలను జిల్లా బీజేపీ అధ్యక్షులుగా నియమించారు.

పెండింగ్ లోవి ఏవి..?

బీజేపీ అధ్యక్షుల జాబితాను పరిశీలిస్తే ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు అధ్యక్షులను ప్రకటించలేదు. యాదాద్రి భువనగిరి సహా మరికొన్ని జిల్లాలకూ చీఫ్ లు ఎవరో తేల్చలేదు. బహుశా స్థానిక నాయకత్వం నుంచి తీవ్ర పోటీ, వర్గ విభేదాలు ఇతర కారణాలు ఉండొచ్చు. ఇక మిగిలింది రాష్ట్ర అధ్యక్షుడి నియామకమే.. మరి అది ఎంత త్వరగా జరుగుతుందో చూడాలి.

Tags:    

Similar News