తెలంగాణా పట్ల వివక్ష...కమలానికి మంచిదేనా ?
ఈసారి రాజకీయ బలం దక్షిణాదినే పెంచుకోవాలని బీజేపీ వ్యూహంగా ఉంది అన్నది తెలిసిందే. ఉత్తరాదిన బెజేపీ బలం సంతృప్త స్థాయిని దాటేసింది.
ఈసారి రాజకీయ బలం దక్షిణాదినే పెంచుకోవాలని బీజేపీ వ్యూహంగా ఉంది అన్నది తెలిసిందే. ఉత్తరాదిన బెజేపీ బలం సంతృప్త స్థాయిని దాటేసింది. అక్కడ పీక్స్ లో బీజేపీ గ్రాఫ్ పెంచుకుంది. ఇక దాని నుంచి క్షీణత కూడా 2024 ఎన్నికల్లో మొదలైంది. అందుకే మూడవసారి కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావడానికి సరిపడా సీట్లు దక్కలేదు. ఆ సమయంలో దక్షిణాది మాత్రమే ఆదుకుంది.
తెలంగాణాలో ఏకంగా సగానికి సగం ఎనిమిది ఎంపీ సీట్లను బీజేపీ గెలుచుకుంది. ఏపీలో మూడు ఎంపీ సీట్లు కలిపితే పదకొండు నంబర్ గా మారి కేంద్రంలో బీజేపీ అధికారానికి బాగా కొమ్ము కాశాయి. అలాంటిది ఏపీ విషయంలో ఎంతో కొంత విదిలిస్తున్నా తెలంగాణాకు వచ్చేసరికి కేంద్ర ప్రభుత్వం వివక్ష ప్రదర్శిస్తోందని అంటున్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ ఇదే అంశం మీద బీజేపీని టార్గెట్ చేస్తున్నాయి.
తెలంగాణాకు ఐఐఎం అన్నది లేదు, బయ్యారంలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయాలన్న ఊసే లేదు, హైదరాబాద్ లో మెట్రో రైలు విస్తరణ గురించిన మాట కూడా లేదు అని అంటున్నారు. అలాగే, తెలంగాణా రాష్ట్రానికి సంబంధించి ఒక్క పధకం కానీ ప్రాజెక్ట్ కానీ ప్రకటించకపోవడమేంటి అన్న చర్చ సాగుతోంది.
ఒక కేబినెట్ మంత్రి ఒక సహాయ మంత్రి తెలంగాణా నుంచి కేంద్రంలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇపుడు ఆ ఇద్దరు కేంద్ర మంత్రులూ విపక్షాలకు టార్గెట్ అవుతున్నారు. ఎనిమిది మంది ఎంపీలు ఉండి ఏమి సాధించారు అని ప్రత్యర్ధి పార్టీలు బీజేపీని ఘాటుగా విమర్శిస్తున్నాయి. ఇంకో వైపు చూస్తే బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తరువాత ఈ వివక్ష ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న ప్రభుత్వాల మీద చూపిస్తోంది అని కూడా అంటున్నారు.
ఇది బీజేపీకి తగదని కూడా అంటున్నారు బీజేపీ తెలంగాణాలో అధికారంలోకి రావాలని అనుకున్నా తమకు మొత్తం 17 ఎంపీ సీట్లలో సగం ఇచ్చారని ప్రజల పట్ల అభిమానం ఉన్నా ఈ విధంగా చేయదని అంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ ఉంటే ఉండొచ్చు కానీ అక్కడ నాలుగు కోట్ల మంది ప్రజలు ఉన్నారని ఎందుకు గుర్తు చేసుకోరని కూడా ప్రశ్నలు వస్తున్నాయి.
కేంద్రం పెద్దన్నగా ఉండి అన్ని రాష్ట్రాలకు సరిసమానంగా అభివృద్ధికి సరిపడా నిధులు సమకూర్చాల్సి ఉంటుందని అంటున్నారు. అలాంటిది ఒకరి పట్ల అభిమానం మరొకరి పట్ల వివక్ష చూపించడం తగదు కాక తగదని అంటున్నారు. ఈ విధంగా అయితే తెలంగాణాలో కమల రాజకీయానికే ఇబ్బంది అవుతుదని అంటున్నారు. ఎంపీ ఎన్నికల్లో బీజేపీని ప్రజలు గెలిపించడానికి కారణం కేంద్రంలో మరోసారి బీజేపీ వస్తే అభివృద్ధి తన రాష్ట్రానికి జరుగుతుందనే అని అంటున్నారు.
తొలి ఏడాదే ఆ నమ్మకాన్ని వమ్ము చేసేలా కేంద్ర బడ్జెట్ ని చూస్తే అర్ధం అవుతోందని అంటున్నారు. ఇక కేంద్ర బడ్జెట్ లో తెలంగాణాకు జరిగిన అన్యాయం పట్ల నిరసనగా కాంగ్రెస్ ఆందోళనా కార్యక్రమాలను చేపడుతోంది. తమతో కలసి రావాలని కేంద్రాన్ని అంతా నిలదీద్దామని బీఆర్ఎస్ ని కూడా పిలుస్తోంది. మొత్తానికి బీజేపీ కార్నర్ అవుతోంది. చూడాలి ఈ రాజకీయం ఎటు దారి తీస్తుందో.