వైసీపీ నలుగురు ఎంపీలపై బీజేపీ కన్ను?

అధికరంలోకి వచ్చిన తర్వాత అయినా కొందరిని పార్టీలో కలుపుకోవటం ద్వారా తమకు ఎలాంటి ఇబ్బంది ఏర్పడని రీతిలో పాలన సాగించేందుకు వీలుగా ప్లానింగ్ నడుస్తోందని చెబుతున్నారు.

Update: 2024-06-09 05:43 GMT

అనూహ్య రీతిలో ఓటమిని ఎదుర్కోవటమే కాదు.. అంచనాలకు మించి దారుణంగా దెబ్బ తిన్న ఆ పార్టీకి ఊరట కలిగించే అంశం నాలుగు ఎంపీ స్థానాల్లో విజయం సాధించటం. సాధారణంగా ఒక ఎంపీ స్థానంలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి. నిజానికి అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ 11 స్థానాల్ని మాత్రమే గెలుచుకుంది. ఆ లెక్కన చూస్తే ఒక స్థానం లేదంటే రెండు స్థానాలకే పరిమితం కావాల్సి ఉంటుంది. అందుకు భిన్నంగా.. నాలుగు స్థానాల్లో అంటే 28 స్థానాల్లో ఆ పార్టీ పార్లమెంటు స్థాయిలో గెలిచిందన్న మాట.

మరోవైపు బీజేపీ సొంతంగా 300 మార్కు దాటుతుందని.. అన్ని బాగుంటే 350 సీట్లు దాటేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదనుకున్నారు. కానీ.. ఆ పార్టీ సొంతంగా 240 స్థానాలకే పరిమితం కావటం.. పదేళ్లలో తొలిసారి కూటమిలోని మిత్రుల అవసరం ఆ పార్టీకి గట్టిగా పడింది. దీంతో.. కూటమిలోని మిగిలిన మిత్రపక్షాలను కలుపుకుంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటానికి అవసరమైన సంఖ్యా బలం ఉన్నప్పటికీ.. ఎప్పుడేం జరుగుతుందోనన్న భయాందోళనలతో బతకాల్సిన పరిస్థితిని ఓటర్లు కల్పించారు.

ఈ నేపథ్యంలో తనను తాను బలోపేతం చేసేందుకు వీలుగా బీజేపీ వర్గాలు ఇప్పటికే ప్రయత్నాలు షురూ చేసినట్లుగా చెబుతున్నారు. అధికరంలోకి వచ్చిన తర్వాత అయినా కొందరిని పార్టీలో కలుపుకోవటం ద్వారా తమకు ఎలాంటి ఇబ్బంది ఏర్పడని రీతిలో పాలన సాగించేందుకు వీలుగా ప్లానింగ్ నడుస్తోందని చెబుతున్నారు. ఇలాంటి వేళ.. వైసీపీకి చెందిన నాలుగు ఎంపీ స్థానాల మీద బీజేపీ కన్ను పడినట్లుగాచెబుతున్నారు.

అడిగినా.. అడగకున్నా కీలకమైన సమయాల్లో తమ మద్దతు మోడీ సర్కారుకు ఇచ్చేందుకు జగన్మోహన్ రెడ్డి పెద్దగా ఆలోచించరు. అయినప్పటికీ.. ఎలాగైతే తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుల్ని బీజేపీలోకి విలీనం చేసుకున్నారో.. అదే రీతిలో బీజేపీలోకి వైసీపీ నలుగురు ఎంపీల్ని కలిపేసుకుంటే మరింత బలంగా మారుతామన్న ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. ఈ వ్యూహాన్ని వెంటనే కాకుండా కాస్త నిదానంగా అయినా అమలు చేయాలన్నట్లుగా వారి మాటలు ఉంటున్నాయి. అయితే.. వైసీపీ తరఫున గెలిచిన ఎంపీ అభ్యర్థులు చూస్తే. పార్టీ పట్ల విపరీతమైన కమిట్ మెంట్ చూపించే వారు. అలాంటి వారిని కమలనాథులు కలుపుకోవటం అంత తేలికైన విషయం కాదంటున్నారు. మరేం జరుగుతుందో చూడాలి.

Tags:    

Similar News