ప్రజాభవన్ కు బాంబు బెదిరింపు... అసలే ఈ రోజు మంగళవారం!
ఇటీవల కాలంలో బాంబు బెదిరింపులకు సంబంధించిన ఫోన్ కాల్స్ తీవ్ర సంచలనం రేపుతున్న సంగతి తెలిసిందే.
ఇటీవల కాలంలో బాంబు బెదిరింపులకు సంబంధించిన ఫోన్ కాల్స్ తీవ్ర సంచలనం రేపుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఢిల్లీలో పలు స్కూల్స్ లో బాంబులు పెట్టినట్లు బెదిరింపు కాల్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా బేగంపేటలోని ప్రజా భవన్ కు బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో ఈ విషయం తీవ్ర చర్చనీయాంశం అయ్యింది.
అవును... హైదరాబాద్ మహా నగరంలో బాంబు బెదిరింపు ఫోన్ కాల్ కలకలం సృష్టించింది. ఇందులో భాగంగా... తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ క్యాంపు కార్యాలయం ప్రగతి భవన్.. ప్రస్తుత ప్రజాభవన్ లో బాంబు పెట్టామని, అది మరికాసేపట్లో పేలి పోతుంది అంటూ పోలీస్ కంట్రోల్ రూమ్ కి అగంతకుడు ఫోన్ కాల్ చేశాడని తెలుస్తుంది.
ఇలా ప్రజా భవన్ కు బాంబు బెదిరింపు కాల్ రావడంతో అప్రమత్తమైన పోలీసులు, బాంబ్ స్వ్కాడ్ బృందాలు హుటాహుటీన అక్కడకు చేరుకుని తనిఖీలు చేస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడి తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నివాసం ఉంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సిబ్బంది సహా అందరినీ ప్రజాభవన్ నుంచి ఖాళీ చేయించిన బాంబ్ స్క్వాడ్.. తనిఖీలు జరుపుతోంది.
మరోపక్క అసలు ఆ ఫోన్ కాల్ ఎక్కడ నుంచి వచ్చింది.. ఆ ఫోన్ చేసింది ఎవరు.. నిజంగానే ప్రజాభవన్ లో బాంబు పెట్టారా.. ఇది ఆకతాయిల ఫోన్ కాలా అనే పనిలోనూ ఉన్నారని తెలుస్తుంది. పైగా ఈ రోజు మంగళవారం కావడం.. ప్రజా దర్భార్ ఉండటంతో ప్రజలు ఎక్కువగా ఈ భవన్ వైపు కదులుతారు.. దీంతో.. ఈ విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
కాగా... ఇటీవల ఢిల్లీ, ముంబై, కోల్ కతాలోని ప్రముఖ ప్రదేశాలకు బాంబు బెదిరింపు కాల్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ తరహా బాంబు బెదిరింపు కాల్స్ వెనుక ఓ ముఠా హస్తం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. వరుసగా బాంబు బెదిరింపు కాల్స్ వస్తున్న నేపథ్యంలో తెలంగాణ పోలీసులు లోతుగా విచారిస్తున్నారని సమాచారం.