కేంద్ర హోం శాఖకు బాంబు బెదిరింపు.. తర్వాత ఏం జరిగింది?
వెంటనే ఉద్యోగులను ఖాళీ చేయించి.. బ్లాక్‌ను తమ అధీనంలోకి తీసుకుని సాయంత్రం ఆరు వరకు పరిశీలన చేశాయి.
ఢిల్లీలోని కేంద్ర హోం శాఖ విభాగాలు ఉండే.. సచివాలయ నార్త్ బ్లాక్‌కు బాంబు పెట్టినట్టు ఆగంతకుడు బెదిరింపు ఈ మెయిల్ పంపడం కలకలం రేపింది. బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు వచ్చిన ఈ మెయిల్.. రెండు గంటల పాటు నార్త్ బ్లాక్‌లో అలజడి రేపింది. ఈ విషయాన్ని తెలుసుకున్న కేంద్ర భద్రతా బలగాలు హుటాహుటిన రంగంలోకి దిగాయి. వెంటనే ఉద్యోగులను ఖాళీ చేయించి.. బ్లాక్‌ను తమ అధీనంలోకి తీసుకుని సాయంత్రం ఆరు వరకు పరిశీలన చేశాయి.
స్నిఫర్ డాగ్స్, స్కానింగ్ యంత్రాలు, బాంబు డిస్పోజల్ పరికరాలతో భవనాన్ని జల్లెడ పట్టాయి. అదేవిధంగా సందర్శకుల లాగ్ బుక్‌ను నిశితంగా పరిశీలించారు. ఎవరైనా అనుమానాస్పదంగా సంచరించారా? అనే విషయాన్ని కూడా పరిశీలించారు. ఈ తనిఖీల్లో సెంట్రల్ ఫోర్సెస్‌తో పాటు.. ఢిల్లీ పోలీసులు కూడా పాల్గొన్నారు. ప్రతి ప్రాంతాన్నీ.. క్షుణ్ణంగా పరిశీలించారు. సిబ్బందిని బయటకు పంపించినా.. వారి సెల్ ఫోన్లను మాత్రం స్వాధీనం చేసుకుని వాటిని కూడా పరిశీలించారు. చివరకు ఏమీ లేవని నిర్ధారణకు వచ్చారు.
బుధవారం మధ్యాహ్నం 3 గంటలసమయంలో సచివాలయంలోని నార్త్ బ్లాక్‌లో ఉన్న పోలీస్ కంట్రోల్ రూమ్‌కు ఈ-మెయిల్ బెదిరింపు లేఖ వచ్చింది. బాంబు అమర్చారని.. ఏ క్షణమైనా అవి పేలిపోవచ్చని.. ఈ లేఖలో పేర్కొన్నారు. దీంతో అధికారులు వెంటనే రంగంలోకి దిగి తనిఖీలు చేపట్టారు. ఇదిలావుంటే.. ఇది ఫేక్ సమాచారమా? లేక.. నిజమా అని తెలుసుకునేందుకు.. అధికారులు ప్రయత్నిస్తున్నారు. కాగా.. గత రెండు మాసాల కిందట కూడా.. ఇలానే బెదిరింపు ఫోన్లు వచ్చాయి. అప్పట్లోనూ ఇలానే అలజడి చోటు చేసుకుంది.