బెయిల్ కోసం తప్పుడు ధ్రువపత్రం.. బోరుగడ్డపై సంచలన ఆరోపణలు!

బోరుగడ్డ అనిల్‌కుమార్ తప్పుడు మెడికల్ సర్టిఫికెట్‌తో హైకోర్టులో బెయిల్ పొందినట్టు వెలుగులోకి వచ్చింది.;

Update: 2025-03-07 05:12 GMT

బోరుగడ్డ అనిల్‌కుమార్ తప్పుడు మెడికల్ సర్టిఫికెట్‌తో హైకోర్టులో బెయిల్ పొందినట్టు వెలుగులోకి వచ్చింది. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్, వారి కుటుంబ సభ్యులను అసభ్య పదజాలంతో దూషించిన కేసులో అరెస్ట్ అయిన అనిల్ కుమార్, తన తల్లి అనారోగ్యాన్ని కారణంగా చూపుతూ తప్పుడు ధ్రువీకరణ పత్రం సమర్పించి మధ్యంతర బెయిలు పొందినట్లు పోలీసులు గుర్తించినట్టు సమాచారం.. ఈ మేరకు ఓ అగ్రదినపత్రిక కథనాన్ని బ్లాస్ట్ చేసింది. మీడియాలో విస్తృతంగా ఈ వార్త వైరల్ అయ్యింది.

అనంతపురంలో నమోదైన కేసు కారణంగా రాజమహేంద్రవరం జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న బోరుగడ్డ అనిల్‌కుమార్, తన తల్లి పద్మావతి అనారోగ్యంతో ఉన్నారని చెబుతూ హైకోర్టులో మధ్యంతర బెయిలు కోసం పిటిషన్ దాఖలు చేశాడు. కోర్టు ఈ పిటిషన్‌ను పరిశీలించి, ఫిబ్రవరి 15 నుంచి 28 వరకు మధ్యంతర బెయిలు మంజూరు చేసింది. అనంతరం, ఫిబ్రవరి 28న సాయంత్రం బోరుగడ్డ తిరిగి లొంగిపోయాడు.

అయితే మార్చి 1న అతను మరోసారి హైకోర్టులో పిటిషన్ వేస్తూ తన తల్లికి ఇంకా చికిత్స అవసరమని, తాను ఒక్కడినే కుమారుడునని చెబుతూ మధ్యంతర బెయిలు పొడిగించాలని విజ్ఞప్తి చేశాడు. తన వాదనకు మద్దతుగా గుంటూరులోని లలిత సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి చీఫ్ కార్డియాలజిస్ట్ పీవీ రాఘవశర్మ ఇచ్చినట్టు పేర్కొంటూ ఓ మెడికల్ సర్టిఫికెట్‌ను సమర్పించాడు.

అయితే పోలీసులు ఈ సర్టిఫికెట్‌పై దర్యాప్తు జరిపినప్పుడు అది నకిలీదని నిర్ధారించారని సమాచారం. బోరుగడ్డ తల్లి పద్మావతి వాస్తవంగా చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందినప్పటికీ ఆమె ఫిబ్రవరిలోనే డిశ్చార్జ్ అయినట్లుగా తెలిసింది. అంతేకాకుండా లలిత ఆసుపత్రి వైద్యులను సంప్రదించిన పోలీసులు, వారు అలాంటి మెడికల్ సర్టిఫికెట్ ఇవ్వలేదని స్పష్టం చేసినట్లు వెల్లడించారట.. ఆసుపత్రి చీఫ్ కార్డియాలజిస్ట్ పీవీ రాఘవశర్మ కూడా తాము ఎలాంటి ధ్రువీకరణ పత్రం జారీ చేయలేదని పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారని సమాచారం.

దీంతో కోర్టును మోసగించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న అనిల్‌కుమార్‌పై మరిన్ని చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులు యోచిస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం అతను ఎక్కడ ఉన్నాడు? ఏమి చేస్తున్నాడు? అనే విషయాలపై పోలీసుల విచారణ కొనసాగిస్తున్నారని మీడియాలో ప్రచారం సాగుతోంది. దీనిపై పోలీసులు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. తెలుగులో ఓ టాప్ పత్రిక ఈ విషయాన్ని బయటపెట్టింది.

బోరుగడ్డ అనిల్ కుమార్ నిజంగానే తప్పుడు ధ్రువపత్రం సమర్పించాడా? ఈ వార్తలు ఎంత వరకూ నిజం అన్నది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం మీడియాలో మాత్రం బోరుగడ్డ హైకోర్టులోనే తప్పుడు ధ్రవపత్రం సమర్పించి బెయిల్ పొందడాన్న వార్తలు జోరుగా ప్రచారం అవుతున్నాయి. ఇందులో నిజనిజాలు బయటకు రావాల్సి ఉంది.

Tags:    

Similar News