టీడీపీని సవాల్ చేస్తున్న బొత్స

వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ మంచి రోజు అని సోమవారం తన నామినేషన్ ని దాఖలు చేశారు.

Update: 2024-08-12 12:03 GMT

వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ మంచి రోజు అని సోమవారం తన నామినేషన్ ని దాఖలు చేశారు. ఆయన విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ తరఫున అభ్యర్ధిగా పోటీ చేస్తున్నారు. ఆయన నామినేషన్ పత్రాలను విశాఖ జిల్లా కలెక్టర్ కి అందచేశారు. విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రులు గుడివాడ అమర్నాధ్, బూడి ముత్యాలనాయుడు, అరకు ఎంపీ తనూజా రాణి, మాజీ ఎంపీ బొత్స ఝాన్సీ రాణి తదితరులు వెంట రాగా బొత్స నామినేషన్ ఘట్టం ఘనంగా సాగింది.

ఈ సందర్భంగా బొత్స చేసిన కామెంట్స్ ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. బలం లేకపోయినా టీడీపీ పోటీ చేస్తోంది అని బొత్స విమర్శించారు. మొత్తం 838 ఓట్లు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉన్నాయని ఆయన చెప్పారు. ఇందులో తమ పార్టీకి ఏకంగా 500 కి పైనే ఉన్నాయి అన్నారు. అందువల్ల తన విజయం తధ్యమని ఆయన స్పష్టం చేశారు. మెజారిటీ లేకుండా పోటీ చేస్తున్న టీడీపీ దుశ్చర్యలకు పాల్పడుతోందని ఆయన మండిపడ్డారు.

మరో వైపు చూస్తే బొత్స అభ్యర్ధిత్వం చాలా కాలం క్రితమే వైసీపీ అధినాయకత్వం ప్రకటించింది. దాంతో ప్రచారంలో దూసుకుపోతున్నారు. వైసీపీకి కొత్తగా మరో ఆరు ఓట్లు యాడ్ అయ్యాయి. అరకు ఎంపీ తనూజా రాణి, అరకు పాడేరు ఎమ్మెల్యేలు, విశాఖ జిల్లా ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి, రాజ్యసభ సభ్యుడు గొల్లపల్లి బాబూరావు తమ ఓట్లను ఎమ్మెల్సీ ఎన్నికల కోసం నమోదు చేయించుకున్నారని తెలుస్తొంది.

మరో వైపు చూస్తే వైసీపీకి స్పష్టమైన ఆధిక్యత ఈ ఎన్నికల్లో కనిపిస్తోంది. మొత్తం ఉమ్మడి విశాఖ జిల్లాలో 39 మంది జెడ్పీటీసీలు ఉండాల్సి ఉంది. అయితే మూడు ఖాళీలు తీసివేస్తే 36 మంది జెడ్పీటీసీలు ఉన్నారు. ఇందులో వైసీఎపీకి 34 మంది ఎంపీటీసీల బలం ఉంది. టీడీపీకి ఒకరు సీపీఎం కి ఒకరు జెడ్పీటీసీలు ఉన్నారు.

అదే విధంగా ఎంపీటీసీలు చూస్తే జిల్లావ్యాప్తంగా 652 మంది ఉండాల్సి ఉండగా ఖాళీలు పోనూ 636 మంది ఉన్నారు. ఇందులో కూడా అత్యధికులు వైసీపీ వైపు ఉన్నారు. దాంతో వైసీపీ విజయం మీద పూర్తి ధీమా వ్యక్తం చేస్తోంది. టీడీపీలో చూస్తే సీనియర్ల పేర్లు అన్నీ ఇపుడు వెనక్కి పోయాయి.

కొత్తగా అనకాపల్లికి చెందిన నేత బైరా దిలీప్ చక్రవర్తి పేరు వినిపిస్తోంది. ఆయన పేరుని ప్రకటిస్తారు అని అంటున్నారు. అంగబలం అర్ధబలంలో ఆయన ముందు వరసలో ఉన్నారు అని అంటున్నారు. ఏది ఏమైనా గెలుపు ధీమాతో వైసీపీ ఈ రోజుకు అయితే ఉంది. ఈ నెల 13తో నామినేషన్లకు గడువు ముగుస్తోంది. మంగళవారం అంత మంచిది కాదని అంటారు. కానీ టీడీపీ అభ్యర్థి ఖరారు అయితే మాత్రం ఆ రోజే నామినేషన్ వేయాల్సి ఉంటుంది. చూడాలి మరి ఏమి జరుగుతుందో.

Tags:    

Similar News