బొత్స కోసం ఆఫర్లే ఆఫర్లు ?

వైసీపీకి పెద్ద దిక్కుగా ఉత్తరాంధ్రాలో సీనియర్ నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఉన్నారు.

Update: 2024-08-12 03:57 GMT

వైసీపీకి పెద్ద దిక్కుగా ఉత్తరాంధ్రాలో సీనియర్ నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఉన్నారు. ఆయనను జగన్ ఎంతో నమ్ముతున్నారు. బొత్స అడిగిందే తడవుగా ఇటీవల జరిగిన ఎన్నికల్లో నాలుగు టికెట్లు ఇచ్చారు. ఇది ఫ్యామిలీ పాక్ అన్న మాట. ఏ లీడర్ కి వైసీపీలో ఇన్ని టికెట్లు దక్కలేదు. అలా దటీజ్ బొత్స అనిపించుకున్నారు.

పార్టీ ఓడినా బొత్స ప్రయారిటీ ఏమీ తగ్గలేదు అని అంటున్నారు. ఆయనను ఏరి కోరి తెచ్చి మరీ ఉమ్మడి విశాఖ జిల్లా ఎమ్మెల్సీ అభ్యర్థిగా జగన్ చేశారు. నిజానికి పోటీ చేయడానికి వైసీపీలో ఎంతో మంది ఎదురుచూసినా జగన్ బొత్స వైపే మొగ్గు చూపించారు. ఇది అనూహ్య నిర్ణయం అని వైసీపీ విశాఖ జిల్లా నేతలే అనుకోవాల్సి వచ్చింది.

ఇక బొత్స విజయం సాధించాలి కానీ ఆయన కోసం వైసీపీ అధినాయకత్వం ఆఫర్లే ఆఫర్లు అన్నట్లుగా కొన్ని సిద్ధం చేసి పెట్టింది అని అంటున్నారు. బొత్స ఎమ్మెల్సీ అయితే ఆయనను శాసనమండలిలో ప్రతిపక్ష నాయకుడిగా చేస్తామని జగన్ ఒక బిగ్ ఆఫర్ ఇచ్చారని అంటున్నారు. అది కేబినెట్ ర్యాంక్ తో కూడిన పదవి. అలా బొత్స మంత్రి హోదాతో మళ్లీ సమానమైన స్థాయి అధికార కళతో ఉంటారన్న మాట.

అంతే కాదు ఆయనకే ఉత్తరాంధ్ర జిల్లాల మొత్తం పార్టీ బాధ్యతలను అప్పగిస్తారు అని అంటున్నారు. ప్రస్తుతం ఈ బాధ్యతలను వైవీ సుబ్బారెడ్డి చూస్తున్నారు. అయితే ఆయన నాన్ లోకల్ ముద్రతో ఉండడం, అలాగే స్థానికంగా రాజకీయాలను అవగాహన చేసుకుని పట్టు సాధించలేకపోవడం వంటి వాటి వల్ల పార్టీ నష్టపోయింది అని అంటున్నారు.

పైగా ఆయన ఎంపీగా ఉన్నారు. ఢిల్లీలో వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా కొత్త బాధ్యతలు ఇచ్చారు. దాంతో బొత్సకే ఉత్తరాంధ్ర బాధ్యతలు అప్పగించడం ద్వారా బయట వారిని తెచ్చి నెత్తిన పెట్టారు అన్న విమర్శలు పార్టీ లోపలా బయటా వినిపించకుండా చూడాలని హై కమాండ్ అనుకుంటోందిట. మరో వైపు చూస్తే బొత్స బలమైన బీసీ నేత కావడంతో పాటు మూడు జిల్లాలలో ఆయన అనుచర గణం ఉండడంతో వైసీపీకి ఆయన బలోపేతం చేయగలరని పార్టీ భావిస్తోందిట.

మొత్తానికి బొత్స ఎమ్మెల్సీ కావాలే కానీ ఆయనకు వైసీపీలో ప్రాధాన్యత అధికంగా లభించడం ఖాయమని అంటున్నారు. ఉత్తరాంధ్రాలో బీసీలకు పార్టీ పగ్గాలు ఇవ్వడం గోదావరి జిల్లాలలో కాపులకు పెద్ద పీట వేయడం ద్వారా పోయిన చోటనే మళ్లీ వెతుక్కోవాలన్న సిద్ధాంతాన్ని వైసీపీ అమలు చేస్తుంది అని అంటున్నారు. చూడాలి మరి వైసీపీ ఆలోచనలు ఎంతవరకూ ఆచరణలో అమలులోకి వస్తాయో.

Tags:    

Similar News