బాలికతోపాటు జలపాతంలో పడిన కారు... వీడియో వైరల్!

సరదాగా విహారయాత్రకు వెళ్లిన ఓ కుటుంబానికి ఊహించని ప్రమాదం ఎదురైంది. వారి కారు జలపాతంలోకి దూసుకెళ్లింది.

Update: 2023-08-07 13:58 GMT

సరదాగా విహారయాత్రకు వెళ్లిన ఓ కుటుంబానికి ఊహించని ప్రమాదం ఎదురైంది. వారి కారు జలపాతంలోకి దూసుకెళ్లింది. ఆ సమయంలో కారులో 12ఏళ్ల పాప ఉండటం గమనార్హం. అయితే ఆ అంతెత్తునుంచి కారు జలపాతంలో పడినా... పాప బ్రతికింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

వివరాళ్లోకి వెళ్తే... మధ్యప్రదేశ్‌ రాష్ట్రం ఇందౌర్‌ కు సమీపంలోని లోహియా కుంద్‌ జలపాతం చూడటానికి ఓ కుటుంబం కారులో బయలుదేరి వెళ్లింది. ఆ సమయంలో ఆ వాహనాన్ని జలపాతానికి సమీపంలో పార్క్‌ చేశారు. కాసేపటి తర్వాత అది అకస్మాత్తుగా జలపాతం వైపు దూసుకెళ్లింది.

దీంతో లోపల జనాలు ఉన్నారో లేదో కనిపించకుండా... కారు జలపాతం దిశగా దూసుకురావడంతో అక్కడున్న పర్యాటకులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అలా ముందుకు దూసుకువచ్చిన కారు... అంతా చూస్తుండగానే కొండపై నుంచి జలపాతంలో పడిపోయింది.

అయితే ఆ సమయంలో కారు లోపల 12ఏళ్ల బాలిక ఉంది. దీంతో... చుట్టుపక్కలవారు వెంటనే వెళ్లి కారు తలుపులు తెరవడంతో అందులోని బాలికకు ప్రాణాపాయం తప్పింది. ఈ ప్రమాద ఘటనను కొందరు తమ కెమెరాల్లో బంధించారు.

ఈ సమయంలో హ్యాండ్‌ బ్రేక్‌ సరిగా వేయకపోవడంతో వాహనంలో కూర్చున్న చిన్నారి గేర్‌ రాడ్‌ ను కదిలించిందని అంటున్నారు. దాంతో కారు ఒక్కసారిగా జలపాతం దిశగా దూసుకెళ్లింది. అది గమనించిన చిన్నారి తండ్రి.. ఆమెను రక్షించేందుకు వెంటనే జలపాతంలోకి దూకేశాడని అంటున్నారు.

ఈ ప్రమాదాన్ని కళ్లారా చూసిన వారిలో కొంతమంది వెంటనే ప్రమాద స్థలానికి ఈత కొడుతూ వెళ్లి తండ్రీ కూతురుని రక్షించారు. గాయపడిన వారిద్దరినీ చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

Tags:    

Similar News