చంద్రబాబు రెండో జాబితాకు అదే ప్రాతిపదికా?

ప్రజలకు నచ్చిన అభ్యర్థిని ఎంచుకోవాలని సూచిస్తున్నారు. ఒకటి, రెండు, మూడు అంటూ ఆప్షన్లు ఇస్తున్నారు. కొన్ని చోట్ల ఒకే అభ్యర్థి పేరుతో ఫోన్‌ కాల్స్‌ వస్తున్నాయి.

Update: 2024-03-02 11:15 GMT

టీడీపీ అధినేత చంద్రబాబు మొదటి విడతలో 94 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన సంగతి తెలిసిందే. వీరంతా అసెంబ్లీకి పోటీ చేసేవారే. జనసేనకు కేటాయించిన 24 స్థానాలు పోగా మరో 57 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. కాగా బీజేపీ కూడా తమతో కలిసి వస్తే ఈ 57 స్థానాల్లో 10 లేదా 12 స్థానాలను బీజేపీకి కేటాయించే అవకాశం ఉంది.

కాగా చంద్రబాబు ప్రకటించిన తొలి జాబితాలో సీనియర్‌ నేతలు గంటా శ్రీనివాసరావు, యరపతినేని శ్రీనివాసరావు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, కిమిడి కళా వెంకట్రావు, దేవినేని ఉమామహేశ్వరరావు తదితరులకు సీట్లను ప్రకటించలేదు.

గత కొంతకాలంగా చంద్రబాబు ఎన్నికల వ్యూహకర్త రాబిన్‌ శర్మ సలహాలపైనే ఆధారపడుతున్నారు. గత నాలుగేళ్లలో ఆయన నాలుగుసార్లు సర్వేలు నిర్వహించి చంద్రబాబుకు నివేదికలు అందజేసినట్టు చెబుతున్నారు. ఇప్పుడే కాదు గతంలో కూడా చంద్రబాబు సొంతంగా సర్వేలు చేయించుకునేవారు. వాటి ఆధారంగానే టికెట్లు ఇచ్చేవారు.

అయితే ఈసారి అధికారంలోకి రావడం కీలకం కాబట్టి ఒకటికి నాలుగుసార్లు సర్వేలు చేయించుకోవడంతోపాటు చంద్రబాబు పేరిట ఆయా నియోజకవర్గాల్లో ప్రజలకు ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేయాలనుకుంటున్నవారి పేర్లను వినిపిస్తున్నారు. ప్రజలకు నచ్చిన అభ్యర్థిని ఎంచుకోవాలని సూచిస్తున్నారు. ఒకటి, రెండు, మూడు అంటూ ఆప్షన్లు ఇస్తున్నారు. కొన్ని చోట్ల ఒకే అభ్యర్థి పేరుతో ఫోన్‌ కాల్స్‌ వస్తున్నాయి.

ఇలా అన్ని అంశాలను బేరీజు వేసుకున్నాకే గెలుపు అవకాశాలు ఉన్నాయనుకున్నాకే చంద్రబాబు అభ్యర్థులను ప్రకటిస్తున్నారని చెబుతున్నారు. మొదటి విడతలో ప్రకటించిన 94 మంది అభ్యర్థులను కూడా సర్వేల ఆధారంగానే ప్రకటించారని అంటున్నారు. తాజాగా చంద్రబాబు హైదరాబాద్‌ లో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ తో భేటీ అయ్యారు. నాలుగు గంటలపాటు సుదీర్ఘంగా ఆయనతో చర్చించారు.

చంద్రబాబు, ప్రశాంత్‌ కిశోర్‌ భేటీలో ఎన్నికల వ్యూహాలు, అభ్యర్థుల ఎంపిక, ప్రత్యర్థి పార్టీల బలాబలాలు తదితర అంశాలపై చర్చించినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో వచ్చే వారంలో టీడీపీ రెండో విడత జాబితా ఉంటుందని చెబుతున్నారు. మొత్తం 30 మంది అభ్యర్థులతో రెండో విడత జాబితా విడుదల చేస్తారని తెలుస్తోంది.

ఈ రెండో విడత జాబితాకు కూడా వివిధ సర్వేలు, ఐవీఆర్‌ఎస్‌ ఫోన్‌ కాల్సే ఆధారమని తెలుస్తోంది. టీడీపీకి కీలకమైన ఎన్నికలు కావడంతో చంద్రబాబు ఏ చిన్న విషయాన్నీ తేలిగ్గా తీసుకునే పరిస్థితిలో లేరని అంటున్నారు. ఈ నేపథ్యంలో తమకు సీట్లు దక్కుతాయో, లేదోనని సీనియర్లంతా టెన్షన్‌ పడుతున్నట్టు సమాచారం. తమ సీట్లలో జనసేన పార్టీ ఏమైనా కోరుతుందా అనే ఆందోళనలో కూడా ఉన్నారని అంటున్నారు.

Tags:    

Similar News