ఈవీఎంలను ప్రపంచంలో ఎవరూ హ్యాక్ చేయలేరు.. స్పష్టం చేసిన సీఈసీ రాజీవ్ కుమార్
దేశంలో సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తరువాత ఈవీఎంలను హ్యాక్ చేశారన్న ప్రచారం విస్తృతంగా జరుగుతోంది.
దేశంలో సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తరువాత ఈవీఎంలను హ్యాక్ చేశారన్న ప్రచారం విస్తృతంగా జరుగుతోంది. గతంలో మాదిరిగానే బ్యాలెట్ విధానంలో ఎన్నికల నిర్వహించాలన్న డిమాండ్ కూడా పెద్ద ఎత్తున వినిపిస్తోంది. ఏపీలో కూడా ఈ ప్రచారం గట్టిగానే ఉంది.
గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో కూటమి నేతృత్వంలోని పార్టీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఏకంగా 164 స్థానాలను తెలుగుదేశం, జనసేన, బిజెపి నేతృత్వంలోనే పార్టీల కూటమి దక్కించుకుంది. ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత వైసిపి ఈవీఎం విధానంపై పెద్ద ఎత్తున విమర్శలు చేసింది. ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట రెడ్డి, ఒంగోలు మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి వంటి నేతలు కోర్టును కూడా ఆశ్రయించారు. కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులు కూడా దీనిపై విమర్శలు గుర్తించారు.
ఈ నేపథ్యంలోనే దేశ ప్రధాన ఎన్నికల అధికారి రాజీవ్ కుమార్ మరోసారి కీలక ప్రకటన చేశారు. ప్రస్తుతం ఈయన చేసిన వ్యాఖ్యలు సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఈవీఎంలను ఎవరూ ట్యాంపర్ చేయలేరు అంటూ ఆయన మరోసారి స్పష్టం చేశారు. ఓటింగ్ యంత్రాల్లోకి ట్రోజన్ హార్స్, బగ్స్‌ను పంపించలేరని కుండబద్దలు కొట్టారు. ఇది తాను చెప్తున్నది కాదని, ఈవీఎంలు హ్యాక్ ఫ్రూఫ్ అంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఆయన చదివి మరి వినిపించారు. ఈవీఎంలు హ్యాక్ అవుతున్నాయంటూ అనుమానాలతో బ్యాలెట్ వైపు మొగ్గుచూపితే తిరోగమనం వైపు వెళ్లడమేనని ఆయన మరోసారి నొక్కి వక్కాణించారు.
తుది ఓటింగ్ పెరుగుదల మిస్ మ్యాచింగ్ వంటివి వదంతులేనని సీఈసీ మరోమారు స్పష్టం చేశారు. అయితే.. ఎన్నికల ప్రధాన అధికారి రాజీవ్ కుమార్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం ఆసక్తిని కలిగిస్తున్నాయి. గడిచిన కొన్నాళ్లుగా ఈవీఎంలను హ్యాక్ చేసి బిజెపి విజయం సాధించిందంటూ విమర్శలు చేస్తున్న నేతలు ప్రధాన ఎన్నికల అధికారి చేసిన కామెంట్లపై ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది. ఎలాన్ మస్క్ వంటి ప్రముఖులు కూడా ఈవీఎంలను హ్యాక్ చేసే అవకాశం ఉందని గతంలో వ్యాఖ్యానించారు. మస్క్ వ్యాఖ్యల తర్వాత దేశంలో ఈవీఎంలు ట్యాంపరింగ్ అంశంపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఈ విమర్శలు మరింతగా ప్రజల్లోకి వెళ్తున్న నేపథ్యంలో ఎన్నికల ప్రధాన అధికారి తాజాగా ఈ ప్రకటన చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. మరి దీనిపై రాజకీయ పార్టీలు ఏ విధంగా స్పందిస్తాయో చూడాల్సి ఉంది.