అగ్నికి ఆహుతైన 2000 గృహాల్లో స్టార్ల భవంతులు ఎన్ని?
ఈ దారుణ విలయంలో చిక్కుకున్న వారిలో సెలబ్రిటీలు పెద్ద సంఖ్యలో ఉన్నారు. పలువురు హాలీవుడ్ స్టార్లకు చెందిన ఖరీదైన ఇండ్లు, ఆస్తులు మంటల్లో తగలబడ్డాయి.
అమెరికా - లాస్ ఏంజెల్స్ పరిసరాలు భయానకమైన అగ్నికీలల్లో చిక్కుకుని తగలబడిన సంగతి తెలిసిందే. పాలిసేడ్స్, ఈటన్ కార్చిచ్చు అని దీనిని పిలుస్తున్నారు. భీకరమైన ఈదురుగాలులు.. పెనుగాలులతో ఈ విధ్వంసం కొన్ని రోజుల పాటు కొనసాగింది. 17,234 ఎకరాలు .. 2100 గృహాలు... తగలబడగా ఇందులో ఐదు మరణాలు కూడా నమోదయ్యాయి. అధికారుల అప్రమత్తత, జాగ్రత్తల కారణంగా చాలా వరకూ మరణాలను తగ్గించగలిగారు. ఈ దారుణ విలయంలో చిక్కుకున్న వారిలో సెలబ్రిటీలు పెద్ద సంఖ్యలో ఉన్నారు. పలువురు హాలీవుడ్ స్టార్లకు చెందిన ఖరీదైన ఇండ్లు, ఆస్తులు మంటల్లో తగలబడ్డాయి.
అమెరికా చరిత్రలోనే ఇది అత్యంత భారీ అగ్నిప్రమాదం. ఇప్పటికీ లాస్ ఏంజెల్స్ ఈ విలయం నుంచి బయటపడలేదు. దాదాపు 1.30 వేల మంది నివాసితులు తరలించారు. కార్చిచ్చులో ఇండ్లు ఆస్తులను కోల్పోయిన వారిలో సుమారు 40 మంది పైగా సెలబ్రిటీలు ఉన్నారు. వీరిలో బిల్లీ క్రిస్టల్, మాండీ మూర్, పారిస్ హిల్టన్ వంటి ప్రముఖులు ఉన్నారు. ఆడమ్ శాండ్లర్, బెన్ అఫ్లెక్, టామ్ హాంక్స్, స్టీవెన్ స్పీల్‌బర్గ్‌లకు కూడా అగ్నిప్రమాద ప్రాంతంలో ఇళ్ళు ఉన్నాయి. పారిస్ హిల్టన్ మాలిబులో తన ధ్వంసమైన ఇంటి ఫుటేజ్‌తో కూడిన వీడియో క్లిప్‌ను ఇన్‌స్టాలో పోస్ట్ చేయగా అది వైరల్ అయింది. జామీ లీ కర్టిస్ తన కుటుంబం సురక్షితంగా ఉందని కానీ తన ఇల్లు మంటల్లో ఉందని సోషల్ మీడియాలో తెలిపారు. విల్ రోజర్స్ రాంచ్ ఇల్లు కూడా ధ్వంశమైంది.
ఖరీదైన ప్రాంతంలో ఇండ్లు, వ్యాపార సముదాయాలు తగలబడ్డాయి. చాలా స్కూళ్లు, మార్కెట్ స్థలాలు ధ్వంశమయ్యాయి. ల్యాండ్‌మార్క్ అని చెప్పుకోదగినవి ఏవీ మిగల్లేదు. ఈటన్ మంటలు అల్టాడెనా, పసాడెనాలోని సుమారు 11వేల ప్రాంతాలను భారీ నిర్మాణాలను అగ్నికి ఆహుతయ్యేలా చేసాయి. భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది. ఫైర్ ప్రస్తుతానికి హాలీవుడ్ హిల్స్ కి సమీపంలో ఒక కిలోమీటర్ దూరంలో ఆగినట్టు యుఎస్ వర్గాలు చెబుతున్నాయి. అధ్యక్షుడు జో బైడెన్ ఇప్పటికే ఈ ప్రాంతాన్ని పర్యటించారు. ఆయన తన ఇటలీ పర్యటనను కూడా రద్దు చేసుకున్నారు.