పుష్ప కాదు రేవంత్ పాన్ ఇండియా సీఎం.. ఎంపీ సంచలన వ్యాఖ్యలు
తెలంగాణలోని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తొలినుంచి ప్రత్యేకమే. తొలిసారి ఎంపీగా గెలిచిన ఆయన చురుగ్గా వ్యవహరిస్తున్నారు.
సరిగ్గా నెల రోజుల కిందటివరకు అంతా బాగానే ఉంది.. పుష్ప 2 ది రూల్ విడుదల హంగామాలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ దేశమంతా పర్యటిస్తూ వస్తున్నారు. బిహార్ రాజధాని పట్నాలో అయితే 2 లక్షల మంది జనం హాజరైనట్లుగా అంచనా. కానీ, ఇప్పుడు చూస్తే పుష్ప-2 ఎంత హిట్టయిందో.. ఆ సినిమా ప్రీమియర్ షో సందర్భంగా తొక్కిసలాట జరిగి ఒక మహిళ ప్రాణాలు కోల్పోవడం ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడి ఆస్పత్రి పాలవడం అంతకుమించిన వివాదం రేపింది. ఈ ఉదంతంలో అల్లు అర్జున్ అరెస్టయి 13 గంటలు జైళ్లో గడిపారు. ఆయన విడుదల తర్వాత సినీ ప్రముఖులు వరుసగా వెళ్లి కలవడం మరింత వివాదం రేపింది. పుష్ప సినిమా ప్రీమియర్ షో పరిణామాలపై తెలంగాణ సీఎం రేవంత్ అసెంబ్లీ సాక్షిగా మాట్లాడడం, దానిపై అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టడం ఇంకా వివాదమైంది.
సంచలనాల ఎంపీ..
తెలంగాణలోని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తొలినుంచి ప్రత్యేకమే. తొలిసారి ఎంపీగా గెలిచిన ఆయన చురుగ్గా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్ సీఏ) అక్రమాలపై చామల కిరణ్ కుమార్ రెడ్డి ఫిర్యాదులు చేశారు. హెచ్ సీఏను ప్రక్షాళన చేయించే దిశగా ప్రయత్నాలు సాగిస్తున్నారు. మరోవైపు రాజకీయం సహా ఇతర అంశాల్లోనూ చామల చాలా చురుకు. పూర్తిగా సీఎం రేవంత్ రెడ్డి లైన్ లో వెళ్తుంటారు.
పుష్ప కాదు రేవంత్ పాన్ ఇండియా
‘పుష్ప అరెస్టుతో రేవంత్ రెడ్డి పాన్ ఇండియా సీఎం అయ్యారని తాజాగా చామల కిరణ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ మేరకు అల్లు అర్జున్ అరెస్టును ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. కాగా, పుష్ప-2 సినిమాలో తనతో ఫొటో దిగనందుకు సీఎంనే మార్చేసే సీన్ ఉన్న సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ అరెస్టు ఉదంతం రీత్యా ఈ సీన్ పై ఇప్పటికే చాలా చర్చ జరిగింది. ఇక పుష్ప-2 కలెక్షన్ల పరంగా దుమ్మురేపుతోంది. రూ.వందల కోట్లు రాబడుతోంది. అల్లు అర్జున్ ను పాన్ ఇండియా హీరోగా మరింత నిలబెట్టింది.