కాకాణి తప్పించుకున్నారా.. తప్పించారా? : చంద్రబాబు సీరియస్
వైసీపీ మాజీ మంత్రి, నెల్లూరు జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి వ్యవహారంపై సీఎం చంద్రబాబు సీరియస్ అయినట్టు తెలిసింది;

వైసీపీ మాజీ మంత్రి, నెల్లూరు జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి వ్యవహారంపై సీఎం చంద్రబాబు సీరియస్ అయినట్టు తెలిసింది. సోమవారం సాయంత్రం ఆయన అమరావతి సచివాలయంలో ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కాకాణికి హైకోర్టు బెయిల్ ఇచ్చే విషయంపై చర్చించారు. ప్రస్తుతం హైకోర్టు బెయిల్ పిటిషన్‌పై వాదనలు పూర్తి చేసినా.. తీర్పును రిజర్వ్ చేసింది. ఈ విషయాన్ని అధికారులు సీఎం చంద్రబాబుకు చెప్పారు. అయితే.. వారిపై ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు.. కాకాణి తప్పించుకున్నారా? మనలో ఎవరైనా తప్పించారా(అధికారులు) అని ప్రశ్నించారు.
దీనిపై అధికారులు మౌనంగా ఉండిపోయారు. ఈ సందర్భంగా చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ``ఫిబ్రవరి 16న కాకాణికి నోటీసులు ఇచ్చారు. ఇప్పటి వరకు ఆయనను అరెస్టు చేయలేకపోయారు. దీనిలో ఎవరి పాత్ర ఎంత ఉందో తెలుసుకుంటా? తప్పు ఎవరు చేసినా కఠినంగా వ్యవహరిస్తా. అసలు అలా చేసిన వారికి ప్రభుత్వంలో ఉండే అర్హత కూడా ఉండదు. దీనిని చాలా సీరియస్‌గానే తీసుకుంటున్నా. ఎందుకు తాత్సారం చేశారో.. ఎందుకు ఆయన పారిపోయి.. ఇన్నాళ్లయినా.. పట్టుకోలేక పోయారో.. తెలుసుకుంటా`` అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
కాగా.. నెల్లూరు జిల్లా రుస్తుం మైనింగ్‌లో 250 కోట్ల రూపాయల మేరకు అక్రమాలకు పాల్పడ్డారని కాకాణిపై మైనింగ్ అధికారులు ఫిర్యాదు చేశారు. దీంతో తొలుత ఆయనపై ఫిబ్రవరి రెండో వారంలోనే కేసుపెట్టారు. దీంతో ముందస్తు బెయిల్ కోసం కాకాణి కోర్టును ఆశ్రయించారు. ఇది విచారణలోనే ఉంది. ఇంతలో అక్రమాలను ప్రశ్నించిన తమపై దాడులకు దిగారని.. కులం పేరు పెట్టి దూషించారని ఎస్టీ సామాజిక వర్గాలకు చెందిన వారు.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అదే నెలలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదు చేశారు. ఈ క్రమంలోనే ఫిబ్రవరి 16న తొలిసారి నోటీసులు ఇచ్చారు.
కానీ.. కాకాణి హాజరు కాలేదు. ఆ తర్వాత.. పలుమార్లు నోటీసులు ఇచ్చే ప్రయత్నం చేసినా.. ఆయన హైదరాబాద్‌కువెళ్లారని సమాచారం వచ్చింది. ఇక, ఈ నెలలో ఆయన ఎక్కడున్నారో కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది. ఆయన గురించి హైదరాబాద్, నెల్లూరు, చెన్నై, బెంగళూరులలో గాలిస్తున్నామని.. ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని పోలీసులు చెబుతున్నా.. రోజులు గడుస్తున్నాయే తప్ప. ఆయన ఎక్కడున్నదీ ఆచూకీ కనిపెట్టలేక పోయారు. దీంతో చంద్రబాబు ఉన్నతాధికారుల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.