ఐదు కోట్ల మందే హైకమాండ్: చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
ఐదు కోట్ల మంది ప్రజల రుణం తీర్చుకునేందుకు తాను శక్తి వంచన లేకుండా.. రోజుకు 18 గంటలకు మించి పనిచేస్తున్నట్టు తెలిపారు.
తనకు రాజకీయంగా ఎవరూ హైకమాండ్ లేరని.. తనకు ఐదుకోట్ల మంది రాష్ట్ర ప్రజలే హైకమాండ్ అని సీఎం చంద్రబాబు చెప్పారు. నరసరావుపేట నియోజకవర్గంలో పర్యటిస్తున్న చంద్రబాబు ఇక్కడి లబ్ధి దారులకు సామాజిక భద్రతా పింఛన్‌ను పంపిణీ చేశారు. అనంతరం నిర్వహించిన గ్రామ సభలో ఆయన ప్రసంగించారు. ఐదు కోట్ల మంది ప్రజల రుణం తీర్చుకునేందుకు తాను శక్తి వంచన లేకుండా.. రోజుకు 18 గంటలకు మించి పనిచేస్తున్నట్టు తెలిపారు.
ప్రజల ప్రయోజనాలే తనకు ప రమావధి అని తెలిపారు. తనను నియంత్రించేవారు ఎవరైనా ఉంటే అది ప్రజలేనని.. కానీ, తాను నిరంతరం కష్టపడుతున్నప్పుడు.. ప్రజలు కూడా సంతోషిస్తారని తెలిపారు. పేద ల జీవితాల్లో వెలుగులు తీసుకురావడమే లక్ష్యంగా తాను పనిచేస్తున్నట్టు చంద్రబాబు చెప్పారు. తనకు తెలిసింది పనిచేయడమేనని.. ఫలితాలు ప్రజలకు అందించడమేనన్నారు. తన మంత్రివర్గంలోని వారు కూడా ఎంతో కష్టపడుతున్నారని చెప్పారు. విజన్ - 2047 తనకోసం కాదని.. ఈ రాష్ట్రం కోసమేనని చెప్పారు.
ఇది నాకల!
గోదావరి నుంచి ఏటా 300 టీఎంసీల నీరు సముద్రంలో కలిసిపోతోందని చంద్రబాబు చెప్పారు. ఈ నీటిని ఒడిసి పట్టి.. గోదావరి నుంచి కర్నూలులోని బనకచర్ల వరకు నీటిని ప్రవహించేలా చేయడమే తన లక్ష్యమ ని చెప్పారు. వందల కిలో మీటర్ల దూరం అయినా.. సంకల్పం ఉంటే.. చిన్న లక్ష్యమే అవుతుందన్నారు. దీనికి సంబంధించి కేంద్రానికి ప్రతిపాదనలు పంపుతున్నామని.. తన హయాంలోనే ఇది పూర్తి చేయాలన్న సంకల్పంతో ముందుకు సాగుతున్నామని తెలిపారు.
మరిచిపోను!
పార్టీ కోసం పనిచేసిన వారిని తాను ఎప్పుడూ మరిచి పోనని ఈ సందర్భంగా చంద్రబాబు చెప్పారు. పార్టీ సభ్యత్వం కోసం.. నాయకులు, కార్యక్తలు అలుపెరుగకుండా కృషి చేశారని.. ఎన్నడూ లేని రీతిలో ఈ సారి 90 లక్షల మంది సభ్యత్వం తీసుకున్నారని తెలిపారు. కష్ట పడిన ప్రతి కార్యకర్తకూ భవిష్యత్తులో గుర్తింపు వస్తుందన్నారు. ఎవరూ నిరుత్సాహ పడాల్సిన అవసరం లేదన్నారు. పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన అవసరం ఉందని.. భవిష్యత్తులో పార్టీని మరింత బలోపేతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.