బాబుకు భారీ సెగ: తీసేస్తే.. జనాలతో.. తీయకపోతే.. డబ్బులతో తంటా..!
ఏపీ సీఎం చంద్రబాబుకు భారీ సెగ తగులుతోంది. అలాగని ఎలాంటి నిర్ణయం తీసుకున్నా.. ఆయనకు ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం
ఏపీ సీఎం చంద్రబాబుకు భారీ సెగ తగులుతోంది. అలాగని ఎలాంటి నిర్ణయం తీసుకున్నా.. ఆయనకు ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం.. విపక్షం నుంచి విమర్శలు ఎదురయ్యే అవకాశం రెండూ కనిపిస్తున్నాయి. దీంతో ఈ విషయంపై ఏం చేయాలన్న దానిపై చంద్రబాబు మల్లగుల్లాలు పడుతున్నా రు. అదే.. రాష్ట్రంలో కూటమి ప్రబుత్వం ఏర్పడేందుకు కారణమైన పింఛన్ల వ్యవహారం. రాష్ట్రంలో ప్రస్తుతం 65 లక్షల మందికి పైగా సామాజిక భద్రతా పింఛన్లు అందుకుంటున్నారు.
వీరికి రూ.1000 చొప్పున పెంచిన చంద్రబాబు ప్రభుత్వం ఏప్రిల్ నుంచి లెక్కగట్టి జూలై 1న వాటిని అందించింది. అయితే.. ఇది పెను భారంగా ఉంది. వచ్చిన ఆదాయం వచ్చినట్టు నెల నెల రూ.3500 కోట్ల వరకు సామాజిక భద్రతా పింఛన్లకు వెచ్చించాల్సి ఉంది. వీటికి తోడు.. ఉద్యోగులకు వేతనాలు, రిటైర్డ్ ఉద్యోగులకు పింఛన్లు ఇవ్వక తప్పదు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ల తీరుపై అధ్యయనం చేయించాలని నిర్ణయించారు.
ఈ క్రమంలో తాజాగా చంద్రబాబు సర్కారుకు అందిన ప్రాథమిక సమాచారం ప్రకారం రాష్ట్రంలో 2,50,000 నకిలీ పెన్షన్లు ఉన్నట్టు గుర్తించారు. దీంతో వీటిపై విచారణకు ఆదేశించారు. ఉదారణకు ఆధార్ లో వయస్సు మార్చుకొని పింఛను పొందుతున్న వారు ఉన్నారు. అదేవిధంగా వికలాంగుడు కాకపోయినా వికలాంగుల పెన్షన్ తీసుకుంటున్నవారు ఉన్నారని తెలిసింది. అలాగే.. ఒంటరి మహిళ కాకపోయినా పెన్షన్ తీసుకుంటున్నవారు.. వితంతు కాకపోయినా..(భర్త వదిలేసి విడాకులు తీసుకున్నవారు) పెన్షన్ అక్రమంగా పొందుతున్నవారు ఉన్నారని తేలింది.
కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు కూడా పెన్షన్లు పొందుతూ అర్హులైన వారికి పెన్షన్ ఆపి అడ్డగోలుగా దోచేస్తున్నారని సర్కారుకు ప్రాధమిక సమాచారం ఉంది. అయితే.. వీటిని తొలగించడం ద్వారా.. భారం తగ్గించుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. కానీ,వీటిని తొలగిస్తే.. లబ్ధిదారుల నుంచి ఆగ్రహంతోపాటు.. ప్రతిపక్షం నుంచి కూడా విమర్శలు వచ్చే అవకాశం ఉంది. ఈ రెండిటినీ ఎలా మేనేజ్ చేయాలన్న వాదన ప్రభుత్వ వర్గాల్లో వినిపిస్తుండడం గమనార్హం.