బాబుకో సూచ‌న‌: ఆ 'ముద్ర' ప‌డితే ప్ర‌మాద‌మే..!

దీంతో అప్పుగా తెచ్చిన‌ 7000 కోట్ల రూపాయలు హారతి కర్పూరంలా కరిగిపోయాయి. మళ్ళీ ఇప్పుడు ఆదాయం లేదు. ఏం చేయాలి

Update: 2024-07-08 06:13 GMT

జగన్ మోహన్ రెడ్డి హయంలో అప్పులు చేశారు. రాష్ట్రాన్ని శ్రీలంక చేస్తున్నారు. అని తీవ్ర ప్రచారం చేసిన టిడిపి ప్రభుత్వం ఇప్పుడు అప్పుల బాటలోనే నడుస్తోంది. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటయి నెల రోజులు గడిస్తే ఈ నెల రోజుల్లో తొలి 15 రోజుల్లో 7వేల కోట్లను అప్పుగా తీసుకొచ్చారు. అప్పుగా వ‌చ్చిన మొత్తం నుంచి 4,400 కోట్ల రూపాయలకు పైగా సామాజిక భ‌ద్ర‌తా పింఛన్ల కింద ప్రజలకు పంపిణీ చేశారు. మిగిలిన మొత్తంలో ఉద్యోగులు జీతభత్యాలు, ప్రభుత్వం నిర్వహణ, ఎమ్మెల్యేలకు జీతాలు ఇచ్చారు.

దీంతో అప్పుగా తెచ్చిన‌ 7000 కోట్ల రూపాయలు హారతి కర్పూరంలా కరిగిపోయాయి. మళ్ళీ ఇప్పుడు ఆదాయం లేదు. ఏం చేయాలి. మరోవైపు ఇసుకను ఉచితంగా ఇస్తున్నారు. అంటే ఇసుక మీద ఆదాయం కోల్పోయినట్టే కాబట్టి మళ్లీ అప్పుల కోసం పరుగులు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదే కానీ ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. రేపు మంగళవారం అప్పులు తెచ్చేందుకు చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అదే విధంగా రాబోయే రోజుల్లో మరో 20 రోజుల్లో మరో 3,000 కోట్లకు పైగా పింఛన్లు పంపిణీ కార్యక్రమం ఎదురుచూస్తోంది.

దీంతో అడుగులు వేయాల్సిన తప్పని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో గతంలో ఏవైతే ఆరోపణలు చేశారో ఇప్పుడు అవే ఆరోపణలు చంద్రబాబు ముందు కనిపిస్తున్నాయి. విపక్షం బలంగా లేకపోయినా విపక్షం విమర్శలు పట్టించుకోము అని భావించినా.. ప్రజల్లో అయితే అప్పులు చేస్తున్నార‌నే భావన గనక పెరిగితే నాడు జగన్‌కు ఏ వ్యతిరేకత అయితే వచ్చిందో అది చంద్రబాబుకు కూడా తప్పకపోవచ్చు అనే సందేహాలు వ్యక్తం అవుతుంది. దీని నుంచి తప్పించుకునేందుకు సంపద సృష్టిస్తామని చెప్పిన చంద్రబాబు ఆ మాట నిలబెట్టుకునేందుకు సరైన మార్గాలను అవలంభించాలి.

చెత్త పన్నులు తొలగిస్తామని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారు. కానీ, ఈ నెలలో చెత్త పన్ను వసూలు చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. అదేవిధంగా విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని చెప్పారు. కానీ విద్యుత్ ఛార్జీలు ఇంకా తగ్గించలేదు. ఈ విషయాలన్నీ కూడా ప్రజల్లో చర్చనీయాంశంగా మారుతున్నాయి. దీన్ని బట్టి అదుపు తప్పకుండా, అప్పులు పెద్ద మొత్తంలో తీసుకురాకుండా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడం ఇప్పుడు చంద్రబాబు మీద ఉన్నటువంటి ప్రధాన బాధ్యతగా చెప్పాలి.ఇలా అడుగులు వేస్తేనే జగన్‌కు చంద్రబాబుకు మధ్య తేడా స్పష్టంగా కనిపిస్తుంది. లేకపోతే జగన్ పాలనను విమర్శించిన చంద్రబాబు కూడా అదే విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది అనడంలో సందేహం లేదు.

Tags:    

Similar News