పోలీసుల్ని కంట్రోల్ చేయటంలో బాబు సర్కార్ ఫెయిల్ అవుతోందా?
విపక్షంలో ఉన్నప్పుడు ఉక్కిరిబిక్కిరి అయిన చంద్రబాబు.. తాను అధికారంలోకి వస్తే పోలీసుల్ని సెట్ చేస్తానంటూ తరచూ చెప్పేవారు
విపక్షంలో ఉన్నప్పుడు ఉక్కిరిబిక్కిరి అయిన చంద్రబాబు.. తాను అధికారంలోకి వస్తే పోలీసుల్ని సెట్ చేస్తానంటూ తరచూ చెప్పేవారు. కొన్ని సందర్భాల్లో సీరియస్ అయ్యేవారు. అధికారం లేనప్పుడు ఎన్ని మాటలైనా చెప్పొచ్చు. కానీ.. ఒకసారి చేతికి పవర్ వచ్చిన తర్వాత.. ఫాస్టుగా నిర్ణయాలు తీసుకోవటంతో పాటు.. వ్యవస్థల్ని మార్చాల్సిన అవసరం ఉంది. కానీ.. ఈ విషయంలోచంద్రబాబు తప్పు మీద తప్పు చేస్తున్నట్లుగా పలువురు ప్రస్తావిస్తున్నారు.
జగన్ ప్రభుత్వంలో చోటు చేసుకున్న కొన్ని కీలక పరిణామాల్లోఒకటి నాటి విపక్ష పార్టీ ఆఫీసుపై పెద్ద ఎత్తున దాడికి దిగటం.. ఈ ఉదంతం అప్పట్లో పెను సంచలనంగా మారింది. అలాంటి కీలకమైన కేసులకు సంబంధించిన అధికారులు ఎంత నిష్పక్షపాతంగా పని చేయాల్సి ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గన్నవరం టీడీపీ ఆఫీసుపై నాటి వైసీపీ నేతలు దాడికి పాల్పడ్డారంటూ తెలుగు తమ్ముళ్లు ఆరోపించారు.
ఈ కేసుకు సంబంధించిన రిమాండ్ రికార్డును కోర్టు తీవ్రంగా తప్పు పట్టింది. ఇదే మొదటిసారి అయితే తప్పు జరిగింది అన్న భావనకు గురి కావొచ్చు. కానీ.. అదేపనిగా పలు అంశాల మీద కోర్టులో నివేదిక ఇవ్వాల్సిన వేళ.. సదరు పోలీసులు అధికారి నుంచి కోర్టుకు వస్తున్న సమాచారంలోతప్పులు ఉండటాన్ని న్యాయమూర్తులు అంగీకరించని పరిస్థితి.
తాజాగాచోటు చేసుకున్న పరిణామాన్ని చూస్తే.. గన్నవరం టీడీపీ ఆఫీసుపై జరిగిన మూకుమ్మడి దాడిలో నిందితులైన వ్లలభనేని వంశీ అనుచరుల దాడి కేసు సైతం రిమాండ్ రిపోర్టు తప్పుల తడకగా ఉన్నట్లు కోర్టు పేర్కొంది. ఈ కేసులో ఇప్పటివరకు పరారీలో ఉన్న 71 మందిలో 15 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిని రిమాండ్ నిమిత్తం కోర్టుకు హాజరుపర్చారు.
ఈ సందర్భంగా రికార్డుల్ని పరిశీలించిన న్యాయమూర్తి పోలీసులు చేసిన తప్పుల్ని ప్రస్తావించారు. ఎఫ్ఐఆర్ లో ఒక పేరు.. మరో చోట పూర్తి పేరు.. ఇంకోచోట సగం పేరు.. ఊరి పేర్లు తప్పులు ఉండటాన్ని చూపిస్తూ.. రిమాండ్ రిపోర్టులో తప్పుల్నిసరిదిద్దిన తర్వాతే నిందితుల్నికోర్టులో ప్రవేశ పెట్టాలంటూ స్పష్టం చేయటం గమనార్హం. ఇదంతాచూసినప్పుడు ఇలాంటి ముఖ్యమైన కేసుల్లో రిమాండ్ రిపోర్టును సైతం ఫాలో అప్ చేయాల్సిన బాధ్యత చంద్రబాబుకు ఉండదు కదా?
ఈ కేసులకు సంబంధించి రిమాండ్ రిపోర్టు పక్కాగా సిద్ధం చేయాల్సిన అవసరం సంబంధిత పోలీసులకు ఎందుకు ఉండట్లేదు? గత ప్రభుత్వంలో మాదిరి పోలీసుల చేత పని చేయించే విషయంలో చంద్రబాబు సర్కారు దూకుడు ప్రదర్శించటం లేదన్న విమర్శ వినిపిస్తోంది. తప్పుడు మార్గాల్లో వెళ్లాలని చెప్పట్లేదు కానీ.. చేసే పనికి సంబంధించిన వివరాలు తప్పులు దొర్లకుండాజాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది కదా?
రాజకీయ ప్రతీకారం సమస్యలకు పరిష్కారం కాదు. అదే సమయంలో తప్పులు చేసిన వారు తప్పించుకోవటం సరికాదు. ఈ రెండింటికి మధ్యస్తంగా తప్పులు చేసి వారు కోర్టుల నుంచి తప్పించుకోలేరన్న భయాన్నికలిగించటం ద్వారా మరింత బాధ్యత ప్రదర్శించేలా చేయొచ్చు. అదే సమయంలో బరితెగింపునకు మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందన్న విషయం అందరికి అర్థం కావాల్సిన అవసరం ఉంది. ఇదంతా ఒక ఎత్తు అయితే.. రాజకీయ సంచలన కేసులకు సంబంధించి కోర్టులకు సమర్పించే పత్రాలు.. అందులో పేర్కొనే అంశాల్లో తప్పులు దొర్లటం దేనికి నిదర్శనం? ఇలాంటి వాటి విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకోవాలి కదా? అలాంటిదేమీ జరగనప్పుడు పోలీసుల చేత పని చేయించుకునే విషయంలో చంద్రబాబు అండ్ కో ఫెయిల్ అవుతున్నారన్న భావన కూడా ఫెయిల్యూరే అవుతుంది. ఈ తప్పుల్ని తక్షణమే సరిదిద్దుకోవటంతో పాటు.. పోలీసులు మరింత జాగ్రత్తగా వ్యవహరించే సిస్టంను పక్కాగా అమలు చేయాలన్న మాట వినిపిస్తోంది.