ఇంటి వద్దకే రూ.4వేల పింఛన్... చంద్రబాబు కొత్త హామీ!
ఈ నేపథ్యంలో కూటమి అధికారంలోకి వస్తే రూ. 4 వేల పింఛన్ అందిస్తామని, అది కూడా ఇంటికి పంపిస్తామని సరికొత్త హామీ ఇచ్చారు చంద్రబాబు!
ఏపీ రాజకీయాల్లో పింఛన్ అనే టాపిక్ 2019 ఎన్నికల సమయంలోనూ, వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ స్థాయిలో చర్చనీయాంశం అయిన టాపిక్ అనేది తెలిసిన విషయమే. ఈ క్రమంలో ప్రస్తుతం ఏపీలో 3000 రూపాయల పింఛన్ అందుతోంది. అది కూడా వాలంటీర్లు ఒకటో తేదీ వేకువజామునే ఇంటికి పట్టుకొచ్చి ఇస్తుంటారు. ఈ నేపథ్యంలో కూటమి అధికారంలోకి వస్తే రూ. 4 వేల పింఛన్ అందిస్తామని, అది కూడా ఇంటికి పంపిస్తామని సరికొత్త హామీ ఇచ్చారు చంద్రబాబు!
అవును... తాజాగా కుప్పంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించిన చంద్రబాబు... ఎన్నికలకు ముందు నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదం కోసం కుప్పం వచ్చినట్లు తెలిపారు. ఇక కుప్పంలో హింస, దోపిడీ రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. ఇదే సమయంలో పేరు ప్రస్థావించకుండా.. పుంగనూరు నుంచి వ్యక్తి దోచుకున్న డబ్బు మొత్తం కక్కిస్తానని తెలిపారు. కుప్పంలో వైసీపీ అభ్యర్థికి డిపాజిట్లు కూడా రాకూడదని అన్నారు.
ఇదే సమయంలో... తనపై ఇప్పటివరకూ ఏడు సార్లు అభిమానం చూపించారని చెప్పిన చంద్రబాబు, మరోసారి గెలిపితే వచ్చే ఐదేళ్లలో కుప్పాన్ని అభివృద్ధి చేసి నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకుంటానని తెలిపారు. ఇదే క్రమంలో... నియోజకవర్గ అభివృద్ధికి వైసీపీ ప్రభుత్వం అడ్డుపడిందని చెప్పుకొచ్చారు చంద్రబాబు. ఈసారి కుప్పంలో టీడీపీ లక్ష ఓట్ల మెజారిటీ లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. ఇదే సమయంలో... కుప్పానికి హంద్రీనీవా నీళ్లు తీసుకొచ్చే బాధ్యత కూటమి ప్రభుత్వానిదని అన్నారు.
ఇక అధికారాన్ని అడ్డుపెట్టుకుని రౌడీయిజం ఏస్తున్నారని చెప్పిన చంద్రబాబు.. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీసులతో వారిని నియంత్రిస్తామని అన్నారు. ఇదే సమయంలో ఎన్నికలు సజావుగా జరగనివ్వాలని ఈ సందర్భంగా రౌడీలను హెచ్చరిస్తున్నట్లు బాబు తెలిపారు. వైసీపీ నాయకులు గ్రానైట్ వ్యాపారం చేస్తున్నారని.. కేజీఎఫ్. తరహాలో శాంతిపురంలో గ్రానైట్ తవ్వేశారని విమర్శించారు. ఒంటిమిట్టను తానే అభివృద్ధి చేసినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా పింఛన్ ప్రస్థావన తెచ్చిన చంద్రబాబు... రాష్ట్రాభివృద్ధే టీడీపీ - బీజేపీ - జనసేన పార్టీల లక్ష్యం అని.. రాష్ట్ర అభివృద్ధి చెందాలంటే కేంద్రం సాయం అవసరం అని అన్నారు. అందువల్ల ఈసారి 160 అసెంబ్లీ, 24 లోక్ సభ స్థానాలు గెలవాలని అన్నారు. ఇక తాము అధికారంలోకి వచ్చిన తర్వాత రూ. 4వేల పింఛన్ ఇంటివద్దకే తెచ్చి ఇస్తామని బాబు సరికొత్త హామీని కుప్పం వేదికగా ప్రకటించారు.