కుప్పం కోసం వరాలు మోసుకెళ్తున్న బాబు !

తనను ఎంతగానో ఆదరించి కన్నతల్లిగా చూసుకున్న కుప్పం నియోజకవర్గానికి ముఖ్యమంత్రి చంద్రబాబు వెళ్తున్నారు

Update: 2024-06-25 02:30 GMT

తనను ఎంతగానో ఆదరించి కన్నతల్లిగా చూసుకున్న కుప్పం నియోజకవర్గానికి ముఖ్యమంత్రి చంద్రబాబు వెళ్తున్నారు. ఆయన 25, 26 తేదీలలో రెండు రోజుల పాటు తన సొంత నియోజకవర్గంలో పర్యటిస్తారు. చంద్రబాబు సీఎంగా ప్రమాణం చేసింది ఈ నెల 12న. కేవలం పదమూడు రోజుల వ్యవధిలో కుప్పానికి వెళ్ళడం విశేషంగానే చూస్తున్నారు.

చంద్రబాబు ఈసారి తన ఏలుబడిలో అయిదేళ్లలో కుప్పాన్ని ఏపీలోనే నంబర్ వన్ గా తీర్చిదిద్దాలని చూస్తున్నారు. దాని కోసం ప్రభుత్వం వచ్చిన డే వన్ నుంచే యాక్షన్ ప్లాన్ ని రెడీ చేసి పెట్టుకున్నారు. ఇక కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు 2024లో తాజా విజయంతో ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా గెలిచినట్లు అయింది.

చంద్రబాబు మొదటిసారి 1978లో చంద్రగిరిలో పోటీ చేసి గెలిచారు. 1983లో అదే చంద్రగిరి నుంచి కాంగ్రెస్ మంత్రిగా పోటీ చేసి టీడీపీ చేతిలో ఓటమి పాలు అయ్యారు. ఆయన టీడీపీలో చేరిన తరువాత 1985 ఎన్నికల్లో ఎన్టీఆర్ టికెట్ ఇస్తానని చెప్పినా పోటీ చేయలేదు. ఆనాడే ఆయన చేసి ఉంటే చంద్రగిరిలో గెలిచి ఉండేవారు అదే ఆయనకు పర్మనెంట్ నియోజకవర్గంగా ఈ రోజుకీ ఉండేది.

కానీ బాబు పార్టీ పనులు చూస్తానని నాడు చెప్పి తెర వెనక ఉన్నారు. ఆ టైం లో బాబు చూపు కుప్పం మీద పడింది. అది ఏపీకి చివరన విసిరేసినట్లుగా ఉంది. మరి బాబుని ఎందుకు ఆకర్షించిదో తెలియదు కానీ కుప్పం నుంచి 1989లో బాబు తొలిసారి పోటీ చేశారు. కుప్పం ప్రజానీకం బాబుని ఆనాడే అక్కున చేర్చుకుని ఆదరించారు. ఆ ఎన్నికల్లో టీడీపీ ఓటమి పాలు అయింది. దాంతో బాబు ప్రతిపక్ష పాత్రలోకి వచ్చారు.

అలా కుప్పం బాబులోని లీడర్ ని చూసింది. 1994లో రెండోసారి గెలిచిన బాబు ఏకంగా 1995లో ముఖ్యమంత్రి అయిపోయారు. అలా సీఎం ని ఎన్నుకున్న ఘనతను కుప్పం సాధించింది. అది లగాయితూ 1999, 2004, 2009, 2014, 2019, 2024 ఇలా బాబు ఎదురులేకుండా గెలుస్తూనే ఉన్నారు. ఎవరెన్ని చెప్పినా కుప్పం ప్రజలు మాత్రం బాబునే ఆదరిస్తున్నారు దానికి గానూ ఆయన తాను అధికారంలో ఉన్నపుడు చేయాల్సినవి అన్నీ చేశారు.

ఇపుడు ఆయనకు నాలుగో సారి సీఎం అయిన అదృష్టం వచ్చింది. దాంతో బాబు తన ఈ టెర్మ్ లో కుప్పాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలని కంకణం కట్టుకున్నారు ఆయన కుప్పానికి వస్తున్నారు. దాంతో పాటు వరాలను కూడా వెంట తెస్తున్నారు. ఇదిలా ఉంటే కుప్పానికి హంద్రీ నీవా జలాలను అందించి తాగు సాగు నీరు సమకూర్చేలా బాబు చర్యలు చేపట్టనున్నారు. వైసీపీ ప్రభుత్వం హంద్రీ నీవా నీరు ఇస్తామని చెప్పింది కానీ చేయలేదు.

ఇపుడు బాబు ఆ వరాన్ని కుప్పానికి ఇవ్వబోతున్నారు. హంద్రీ నీవా నీరు పారే కాలువలను ఆయన స్వయంగా పరిశీలిస్తారు అని అంటున్నారు. అలాగే బాబు కుప్పం లో పండే పంటలకు ఎగుమతి చేసుకునేందుకు తగిన మార్గాలను బాబు ఈ తడవ పర్యటనలో ప్రకటిస్తారని అంటున్నారు. దాని వల్ల కుప్పం రైతులకు పెద్ద ఎత్తున మేలు జరుగుతుంది.

అంతే కాదు కుప్పంలో దీర్ఘకాలంగా పెండింగులో ఉన్న సమస్యలకు కూడా బాబు ఈ పర్యటనలో పరిష్కారం చూపిస్తారని, ఒక నిర్దిష్ట కాలపరిమితిలోగా వాటిని పూర్తి చేయాలని అధికారులను ఆయన ఆదేశిస్తారని అంటున్నారు. మొత్తం మీద బాబు కుప్పంతో తన అనుబంధాన్ని శాశ్వతం చేసుకోబోతున్నారు. ఆయన అక్కడ కట్టుకుంటున్న ఇల్లు కూడా పూర్తి కాబోతోంది. దాంతో బాబు ఇక మీదట తరచూ కుప్పానికి వస్తారని అంటున్నారు.

Tags:    

Similar News