విశాఖ ఫిలిం సిటీకి రామోజీ పేరు: చంద్రబాబు
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. తెలుగు నేలపై అక్షర జ్యోతులు వెలిగించి రామోజీరావు కీర్తి అనన్య సామాన్యమని కొనియాడారు
విశాఖపట్నాన్ని సినీ ఇండస్ట్రీకి హబ్‌గా తయారు చేస్తామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. విశాఖలో ఏర్పాటు చేసే ఫిలిం సిటీకి దివంగత రామోజీరావు పేరును పెట్టనున్నట్టు ఆయన వెల్లడించారు. తాజాగా విజయవాడ సమీపంలోని కానూరులో రామోజీ గ్రూప్ సంస్థల చైర్మన్, ఇటీవల అనారోగ్య సమస్యల తో కాలం చేసిన రామోజీరావు సంస్మరణ సభ జరిగింది. దీనిని ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు , డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఇతర మంత్రులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. తెలుగు నేలపై అక్షర జ్యోతులు వెలిగించి రామోజీరావు కీర్తి అనన్య సామాన్యమని కొనియాడారు. పత్రికా రంగం నుంచి సినిమా రంగం వరకు.. అనేక రంగాల్లో రామోజీరావు ఎనలేని కృషి చేశారని, ఆయన తనదైన ముద్ర వేశారని తెలిపారు. తన జీవితాంతం నీతి నిజాయితీతో కూడిన విలువలతో ముందుకు సాగారని తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయి నవ్యాంధ్ర ఏర్పడిన తర్వాత.. ఎంపిక చేసిన రాజధాని ప్రాంతానికి `అమరావతి` అని పేరు పెట్టాలని రామోజీరావే సూచించినట్టు సీఎం తెలిపారు.
దేవతలు నడయాడిన భూమిగా పేరున్న నేపథ్యంలో రాజధానికి అమరావతి పేరును ఆయన సూచించార ని చంద్రబాబు చెప్పారు. ఏ రంగాన్ని తీసుకున్నా.. ఆయన తనదైన ముద్ర వేసినట్టు చెప్పారు. ముఖ్యం గా సినీ, మీడియా రంగాల్లో నిస్పాక్షికతకు, సృజనాత్మకతకు పెద్దపీట వేశారని తెలిపారు. అనేక సంస్థల ను స్థాపించి వేల మందికి ఉపాధి కల్పించారని తెలిపారు. కరోనా వంటి విపత్కర సమయంలో తన వంతు సహాయంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో 25 కోట్ల రూపాయలకు పైగా సాయం చేసినట్లు తెలిపారు.
నిజాయితీ విలువలతో కూడిన పాత్రికేయునిగా మీడియా రంగంలో తనకంటూ ఒక చెరగని ముద్ర వేసుకొని లెజెండ్ గా నిలిచారని చంద్రబాబు తెలిపారు. రామోజీరావుకు భారతరత్న సాధించడం మనందరి బాధ్యత అని అన్నారు. త్వరలో అమరావతిలో రామోజీ విజ్ఞాన కేంద్రాన్ని స్థాపిస్తామని చంద్రబాబు ప్రకటించారు. అదేవిధంగా విశాఖ పట్నంలో స్థాపించబోయే ఫిలిం సిటీకి రామోజీరావు పేరు పెడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రామోజీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.