మనుషులకు వాడే మందుల్ని పిల్లులకు వాడేస్తున్నారట

ఆధునిక ప్రపంచంలో వైరస్ కారణంగా అన్ని వ్యవస్థలు సడన్ బ్రేక్ వేసినట్లుగా ఆగిపోవటం అందరూ అనుభవించిందే.

Update: 2025-01-05 06:30 GMT

మిగిలిన ప్రపంచ దేశాలతో పోలిస్తే చైనాలో గుట్టు ఎక్కువ. అలాంటి దేశాలు చాలానే ఉన్నాయి. రాకెట్ స్పీడ్ తో డెవలప్ అవుతూ.. అందుకోలేనంత అభివృద్ధిని సాధిస్తున్న దేశాల జాబితాలో డ్రాగన్ దేశం ముందుంటుంది. అదే సమయంలో దరిద్రపుగొట్టు వైరస్ కు జన్మస్థలిగానూ చైనా ఉంటుంది. ప్రపంచాన్ని వణికించిన కొవిడ్ గురించి తెలిసిందే. ఈ మహమ్మారిని పుట్టించిన చైనా కారణంగా యావత్ ప్రపంచమే స్తంభించి పోయిన పరిస్థితి. ఆధునిక ప్రపంచంలో వైరస్ కారణంగా అన్ని వ్యవస్థలు సడన్ బ్రేక్ వేసినట్లుగా ఆగిపోవటం అందరూ అనుభవించిందే.

అందుకే ఆ దేశంలో ఏదైనా వైరస్ వృద్ధి చెందుతున్నా.. కేసుల సంఖ్య పెరుగుతున్నా ప్రపంచ దేశాలు అలెర్టు అవుతుంటాయి. తాజాగా హెచ్ఎంపీవీ అనే వైరస్ కలకలాన్ని రేపుతోంది. అయితే.. దీని తీవ్రత ప్రపంచం మీద ఉండదని చెబుతున్నా.. ఎవరికి వారు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా ఆ దేశంలో పెంపుడు పిల్లుల్లో ‘ఫీలైన్ ఇన్ఫెక్షియస్ పెర్టోనిటిస్’ అనే ప్రాణాంతక వైరల్ వ్యాధి పెరుగుతోంది.

ఈ వైరస్ బారిన పడే పిల్లులు వాటి శరీరం మొత్తం వ్యాపించేసి.. తెల్ల రక్త కణాలకు సోకుతుంది. దీనికి చెక్ పెట్టేందుకు వినియోగించాల్సిన మందులు చాలా ఖరీదుతో కూడుకున్నవి. దీంతో.. ఈ మందులకు బదులుగా.. ఈ వైరస్ బారిన తమ పెంపుడు పిల్లులు పడకూడదన్న ఉద్దేశంతో మనుషుల్లో కొవిడ్ వైద్యానికి వాడే మందుల్ని వేస్తున్నట్లుగా కథనాలు వస్తున్నాయి. ఈ వైరస్ ను కొవిడ్ యాంటీ వైరల్ మందులు ప్రభావం చూపుతాయని ఒక అధ్యయనంలో తేలినట్లుగా తెలుస్తోంది.

దీంతో.. ఆ మందుల్ని వాడేస్తున్న చైనీయుల తీరును పలువురు తప్పు పడుతున్నారు. మరోవైపు.. కొవిడ్ మందుల్ని తమ పెంపుడు పిల్లుల్లో వాడుతున్నప్పుడు వాటి పరిస్థితి మెరుగవుతున్న విషయాన్ని తాము గుర్తించినట్లుగా నెటిజన్లు చెబుతన్నారు. అయితే.. మనుషులు వాడే మందుల్ని.. జంతువులకు వాడటం వల్ల వాటి ఆరోగ్యాన్ని మనమే చెడగొడుతున్నట్లుగా చెబుతున్నారు.

పిల్లుల సంగతి ఇలా ఉంటే.. మననుషులకు వ్యాపిస్తున్న ‘హెచ్ఎంపీవీ’ వైరస్ తో పాటు.. ఇప్పుడు ‘హ్యుమన్ మెటానిమో వైరస్’ కూడా ఎక్కువగా వ్యాప్తి చెందుతోందని చెబుతున్నారు. దీని కారణంగా ప్రజలు పెద్ద ఎత్తున ఆసుపత్రుల ఎదుట క్యూ కడుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ వైరస్ బారిన పడిన వారి లక్షణాల్ని చూస్తే.. ఫ్లూ.. ఇతర శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల మాదిరే ఉంటాయనిన చెబుతున్నారు. దగ్గు.. జ్వరం.. ముక్కు దిబ్బడగా అనిపించటం.. శ్వాస తీసుకోవటంలో ఇబ్బందులు కనిపిస్తాయని చెబుతున్నారు. మరోవైపు.. ఈ వైరస్ తీవ్రత తమ దేశంలో తక్కువగా ఉన్నట్లు చైనా చెబుతోంది. కారణం ఏమైనా కానీ.. సిత్రవిచిత్ర వైరస్ లతో చైనా ప్రపంచాన్ని తరచూ వణికిస్తోందని చెప్పక తప్పదు.

Tags:    

Similar News