ఆ పార్టీ మరో దుశ్చర్య.. ఇస్రో రాకెట్ పై చైనా జెండా!
డీఎంకే విడుదల చేసిన ఆ ప్రకటనలో ఓవైపు ప్రధాని నరేంద్ర మోదీ చిత్రం, ఇంకోవైపు తమిళనాడు సీఎం, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ చిత్రాన్ని ఉంచారు. మధ్యలో రాకెట్ ను ఉంచారు.
దేశంలోనే వివాదాస్పద పార్టీల్లో తమిళనాడులో అధికారంలో ఉన్న డీఎంకే పార్టీ ఒకటి అని చెబుతుంటారు. డీఎంకే ఒకప్పటి అధినేత, మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి, ఆయన కుమారుడు ప్రస్తుత తమిళనాడు ముఖ్యమంత్రి దేవుడిని నమ్మరనే విషయం తెలిసిందే. గతంలో శ్రీరాముడిపై కరుణానిధి చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టించాయి. రాముడేమైనా ఇంజనీరా.. రామసేతును కట్టడానికి అంటూ కరుణానిధి అప్పట్లో చేసిన వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా దుమారం రేగింది.
అలాగే మాజీ ప్రధాని రాజీవ్ గాంధీని లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ ఈలం (ఎల్టీటీఈ) చంపినప్పుడు తమిళనాడులో అధికారంలో ఉంది కూడా కరుణానిధే కావడం గమనార్హం. అంతేకాకుండా ఎల్టీటీటీఈకి డీఎంకే గట్టి మద్దతుదారుగా ఉండేది.
ఈ వివాదాలు చాలవన్నట్టు ఇప్పుడు ఇప్పుడు డీఎంకే మరో దుశ్చర్యకు పాల్పడింది. తమిళనాడుని కులశేఖర పట్నంలో కొత్తగా ఏర్పాటు చేయబోతున్న ఇస్రో స్పేస్ పోర్టు గురించి డీఎంకే మంత్రి చేసిన ప్రకటనలో చైనా జెండాను ఉంచారు. రాకెట్ పై భాగంలో చైనా జెండాను పెట్టి ప్రకటన విడుదల చేయడంతో డీఎంకేను నెటిజన్లు తిట్టిపోస్తున్నారు.
డీఎంకే విడుదల చేసిన ఆ ప్రకటనలో ఓవైపు ప్రధాని నరేంద్ర మోదీ చిత్రం, ఇంకోవైపు తమిళనాడు సీఎం, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ చిత్రాన్ని ఉంచారు. మధ్యలో రాకెట్ ను ఉంచారు. ఆ రాకెట్ పైభాగంలో చైనా జెండాను ఉంచడం తీవ్ర వివాదాస్పదమైంది. డీఎంకే మంత్రివర్గంలో మత్స్యశాఖ మంత్రిగా ఉన్న అనితా రాధాకృష్ణన్ ఈ ప్రకటన విడుదల చేశారు.
దీంతో బీజేపీ.. అధికార డీఎంకేపై తీవ్ర విమర్శలకు దిగింది. బీజేపీ నేతృత్వంలోని కేంద్రం ప్రాజెక్టులపై డీఎంకే తన ముద్ర వేస్తోందని బీజేపీ నేతలు మండిపడుతున్నారు. డీఎంకే ఏ పని చేయని పార్టీ అని, కానీ క్రెడిట్ తీసుకునేందుకు మాత్రం ముందుంటుందని ధ్వజమెత్తుతున్నారు. తమ పథకాలపై వారి స్టిక్కర్లు అంటించుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు చైనా స్టిక్కర్లును కూడా అంటిస్తున్నారంటూ తిరునల్వేలిలో జరిగిన బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ మండిపడ్డారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై మాట్లాడుతూ.. డీఎంకే ప్రకటనను ఖండించారు, డీఎంకే దేశ సార్వభౌమాధికారాన్ని విస్మరిస్తుందని ధ్వజమెత్తారు. చైనా పట్ల డీఎంకే నిబద్ధతకు ఇది నిదర్శనమని ఎద్దేవా చేశారు. డీఎంకే పెద్దగా మారలేదని.. అది మరింత అధ్వాన్నంగా మారిందని దుయ్యబట్టారు.