హైదరాబాద్‌ లో కొత్త గ్యాంగ్‌... చుడీదార్‌ లతో దొంగతనం... వీడియో!

అవును... హైదరాబాద్ లో తొలిసారిగా మహిళల వేషధారణలో కొంతమంది చుడీదార్ లు ధరించి దొంగతనాలు చేస్తున్నారు

Update: 2024-05-24 10:37 GMT

హైదరాబాద్ నగర వాసులకు సరికొత్త టెన్షన్ మొదలైంది. నిన్న మొన్నటివరకూ గొలుసు దొంగలు, తాళం వేసి ఉన్న ఇళ్లలో చోరీలు చేసే నేరగాళ్లుగా "చడ్డీ గ్యాంగ్‌" హల్ చల్ చేసేవారు. ఈ క్రమంలోనే తాజాగా హైదరాబాద్‌ లో "చుడీదార్‌ గ్యాంగ్" చోరీ కలకలం రేపుతోంది. మహిళల వేషధారణలో కొందరు చుడీదార్‌ ధరించి దొంగతనాలకు తెగబడుతున్నారు.

అవును... హైదరాబాద్ లో తొలిసారిగా మహిళల వేషధారణలో కొంతమంది చుడీదార్ లు ధరించి దొంగతనాలు చేస్తున్నారు. తొలిసారిగా ఈ తరహా గ్యాంగ్ ల వ్యవహారం తెరపైకి రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. వీరంతా మహిళల్లా తయారై ఎవరికీ అనుమానం రాకుండా పక్కాపథకం ప్రకారం వ్యవహరిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

ఇప్పటికే నగర శివార్లలో చెడ్డీగ్యాంగ్‌ సంచరిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలిన సంగతి తెలిసిందే. అర్ధరాత్రి సమయాల్లో ఆ ముఠాలు సంచరిస్తూ చోరీలకు తెగబడుతోంది. ప్రధానంగా ఈ తరహా గ్యాంగ్ లు నగర శివార్లలో ఉన్నట్లు చెబుతుండగా.. ప్రస్తుతం చుడీధార్‌ గ్యాంగ్ దొంగతనాలు బయటపడడంతో పలు ప్రాంతాల్లో గస్తీ పెంచారు పోలీసులు.

తాజాగా హైదరాబాద్‌ జెక్‌ కాలనీ నాలుగోవీధిలో ఉన్న ఆకృతి ఆర్కేడ్‌ అపార్ట్‌మెంట్‌ లో వెంకటేశ్వర రావు అనే వ్యక్తి నివసిస్తున్నారు. అదే అపార్ట్‌మెంట్‌ పై అంతస్తులో ఆయన కుమార్తె, అల్లుడు ఉంటున్నారు. అయితే ఈనెల 16 వారంతా ఒంగోలుకు వెళ్లారు. ఈ క్రమంలో 18న ఉదయం పనిమనిషి ఇళ్లు శుభ్రం చేసేందుకు వచ్చి తాళంవేసి ఉండటాన్ని గమనించింది.

ఈ సమయంలో పైఅంతస్తులోని వెంకటేశ్వర రావు కుమార్తె వద్దకు వెళ్లి తాళం తీసుకొని తలుపు తెరిచేందుకు వెళ్లగా.. అప్పటికే తాళం పగలగొట్టి ఉండడం, ఇంట్లోని వస్తువులన్నీ చిందరవందరగా పడి ఉండడం గమనించింది ఆ పనిమనిషి. దీంతో ఈ విషయం అతని కుమార్తెకు చెప్పగా పోలీసులకు సమాచారం ఇచ్చారు.

ఈ సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సీసీ కెమెరాలు పరిశీలించగా... మహిళల వేషధారణలో ముసుగు ధరించిన కొంతమంది దొంగలు చొరబడినట్లు గుర్తించారు. ఈ సమయంలో ఇంట్లోని నాలుగు తులాల బంగారం, లక్ష రూపాయల నగదు, ల్యాప్‌ టాప్‌ లను దొంగలించారని చెబుతున్నారు. దీంతో పోలీసులు అలర్ట్ అయ్యారు.

Tags:    

Similar News