ఫస్ట్ టైమ్: ఈడీపై కేసు పెట్టిన ముఖ్యమంత్రి.. ఎక్కడ? ఎందుకు?
ఇదిలావుంటే.. తనను ఈడీ విచారించడం.. తనను గాలించడం వంటి చర్యలపై ఈడీ ఆధికారులపై ముఖ్యమంత్రి హేమంత్ పోలీసు కేసు పెట్టారు.
కేంద్ర దర్యాప్తు సంస్థ.. పైగా స్వతంత్రంగా వ్యవహరించే సంస్థగా రాజ్యాంగంలోనే చోటు కల్పించిన ఎన్ ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఇప్పుడు చిక్కుల్లో పడింది. ఈడీ దూకుడుకు కళ్లెం వేస్తూ.. ఏకంగా ముఖ్యమంత్రి ఈ సంస్థ అధికారులపై కేసులు పెట్టారు. దీంతో ఈ విషయం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. దేశంలో ఇప్పటి వరకు సీబీఐ అధికారులపై పశ్చిమ బెంగాల్,ఏపీ తదితర రాష్ట్రాల్లో కేసులు నమోదయ్యాయి. కానీ, ఇప్పటి వరకు ఈడీపై ఏ రాష్ట్రంలోనూ కేసులు నమోదు కాకపోవడం గమనార్హం.
ఎక్కడ..
గనుల రాష్ట్రంగా పేరొందిన.. జార్ఖండ్‌లో అక్కడి ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్‌పై ఈడీ అధికారులు భూ కుంభకోణం సహా.. మనీ లాండరింగ్ కేసులు నమోదు చేశారు. ఈ క్రమంలో ఆయనకు నోటీసులు జారీ చేయడం.. వాటిని ఆయన పట్టించుకోక పోవడం తెలిసిందే. ఇప్పటికి నాలుగు సార్లు ఆయనకు నోటీసులు జారీచేసినా.. ఆయన పలు కారణాలతో వాటి నుంచి తప్పించుకున్నా రు. ఇక, ఈ క్రమంలో తాజాగా ఆయనను ఢిల్లీలో విచారిస్తున్నారు. ఆయనను ఏ క్షణంలో అయినా అరెస్టు చేసే అవకాశం ఉందని ఒకవైపు వార్తలు వస్తున్నాయి. మరోవైపు.. ప్రభుత్వ బాధ్యతలను ఆయన సతీమణి కల్పనకు ఇవ్వనున్నారని తెలుస్తోంది.
ఇదిలావుంటే.. తనను ఈడీ విచారించడం.. తనను గాలించడం వంటి చర్యలపై ఈడీ ఆధికారులపై ముఖ్యమంత్రి హేమంత్ పోలీసు కేసు పెట్టారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద చర్యలు కోరుతూ.. ఆయన రాష్ట్ర రాజధాని రాంచీలో ఉన్న ప్రత్యేక ఎస్సీ, ఎస్టీ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది ఆసక్తిగా మారింది. నిజానికి ఈడీ అధికారులపై కేసులు నమోదు చేసినా.. దీనికి న్యాయ స్థానం నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. దీనిపై పోలీసులు కూడా.. న్యాయ నిపుణుల సలహాలు తీసుకుంటున్నట్టు సమాచారం.
రాజకీయ దుమారం..
సీఎం హేమంత్‌ను ఈడీ అధికారులు ప్రశ్నించడం.. ఆయనను విచారణకురావాలని వెంటపడడం వెనుక కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు ఉందని జేఎంఎం నాయకులు తీవ్రస్థాయిలో ఆరోపిస్తున్నారు. బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేశారు. కేంద్రం ఆదేశాల మేరకే ముఖ్యమంత్రి సోరెన్‌ను ఈడీ అధికారులు వేధిస్తున్నారని నాయకులు వ్యాఖ్యానించారు. ఈ పరిణామాలను చూస్తూ ఊరుకోబోమని కూడా వ్యాఖ్యానించారు. పార్లమెంటు ఎన్నికలకు ముందు.. ఉద్దేశ పూర్వకంగానే బీజేపీని వ్యతిరేకించే వారిపై ఈడీ, సీబీఐ అధికారులను ఉసిగొల్పుతున్నారని వ్యాఖ్యానించారు. దీంతో హేమంత్ వ్యవహారం.. రాజకీయంగా కూడా సెగలు పుట్టిస్తోంది.