కామ్రెడ్స్ భవితవ్యం ఏంటి... తెలంగాణ చెబుతున్న లెస్సన్ ఏంటి..?
ఈ పరిణామాలను ఏపీలోనూ చవిచూసే ప్రమాదం ఉందని.. ముందుగా మేల్కొనాలని మెజారిటీ నాయకులు సూచిస్తున్నారు.
కామ్రెడ్స్.. ఈ మాట అనగానే.. ప్రజా ఉద్యమాలు, ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై పోరాటం ఠక్కున గుర్తు కు వస్తాయి. అయితే.. వారికి ఓటు బ్యాంకు మాత్రం పదిలంగా లేదనే చెప్పాలి. ఏపీలో మరింత దారునం గా కామ్రెడ్ల పరిస్థితి కనిపిస్తోంది. సొంతగా ఎదిగేందుకు ప్రయత్నాలు చేయకపోవడం.. ఒక ప్రారబ్దమైతే.. మరోవైపు.. పొత్తుల విషయంలో కలిసి వెళ్లకపోవడం. పెను ప్రమాదాన్ని సూచిస్తోంది. తాజాగా తెలంగాణలో కమ్యూనిస్టుల పరిస్థితి గమనిస్తే.. ఏపీలో వ్యవహరించాల్సిన తీరును కళ్లకు కడుతోంది.
తెలంగాణలో కూనంనేని సాంబశివరావు(సీపీఐ) విజయం దక్కించుకున్నారు. ఇదే సమయంలో సీపీఎం నుంచి బరిలో నిలిచిన అగ్రనేత.. తమ్మినేని వీరభద్రం అభాసుపాలయ్యారు. అయితే.. ఈ రెండు విషయాల్లోనూ కమ్యూనిస్టుల ఆలోచనా సరళి కళ్లకు కనిపిస్తుంది. ఆచితూచి వ్యవహరించిన కంకి నేతలు.. విజయం దక్కించుకోగా.. ఆరాటం పడిన సుత్తీకొడవలి నేతలు.. అభాసుపాలయ్యారు. ముందుగానే ప్లాన్ చేసుకోకపోవడం.. మరింతగా కమ్యూనిస్టులను దెబ్బేసింది
ఈ పరిణామాలను ఏపీలోనూ చవిచూసే ప్రమాదం ఉందని.. ముందుగా మేల్కొనాలని మెజారిటీ నాయకులు సూచిస్తున్నారు. ఏపీలో సీపీఎం పార్టీ నిద్రాణ దశలో ఉంది. అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తోందనే వాదన కూడా వినిపిస్తోంది. మరోవైపు సీపీఐ నాయకులు నిత్యం మీడియాలోనే ఉంటూ.. సర్కారును ఎండగడుతున్నా.. క్షేత్రస్థాయిలో బలాన్ని పుంజుకునే స్థాయిలో అయితే.. కనిపించడం లేదు.
2019లో జనసేనతో జట్టుకట్టిన కమ్యూనిస్టులు.. ఒక్క సీటును కూడా దక్కించుకోలేదు. 2014లోనూ ఇదే పరిస్థితిని ఎదుర్కొన్నారు. అంటే.. దాదాపు పదేళ్లుగా ఏపీలో కమ్యూనిస్టులకు ప్రజాప్రాతినిధ్యం కరువైంది. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో అయినా.. కనీసం రెండు నుంచి మూడు స్థానాల్లో విజయం దక్కించుకోవాలంటే.. ముందస్తుగా ప్లాన్ చేసుకోవడం.. ప్రజాబలాన్ని ఓటు బ్యాంకును పెంచుకోవడం.. పొత్తులపై ముందుగానేఒక నిర్ణయానికి రావడం వంటి కీలక అంశాలపై దృస్టి పెట్టాల్సి ఉందని అంటున్నారు పరిశీలకులు.