మొక్కజొన్న పొత్తులు కాల్చేందుకు.. శవాల బొగ్గులు
నాలుగు చినుకులు పడ్డాయంటే చాలు.. అందరి చూపులూ.. గోరు వెచ్చటి మొక్క జొన్ను పొత్తులపైనే ఉంటాయి.
నాలుగు చినుకులు పడ్డాయంటే చాలు.. అందరి చూపులూ.. గోరు వెచ్చటి మొక్క జొన్ను పొత్తులపైనే ఉంటాయి. ఎంత దూరమైనా వెళ్లి.. ఎర్రటి నిప్పులపై సలసలా కాగుతూ.. వేగుతున్న మొక్క జొన్న పొత్తులను కొనేయాల్సిందే.. నోట్లో వేసుకుని టపటపలాడించాల్సిందే. ఆ మజానే వేరు!! అయితే.. ఇక్కడే ఓ ప్రమాదకర విషయం వెలుగు చూసింది. మొక్క జొన్న పొత్తులను కాల్చేందుకు వినియోగించే బొగ్గులను శ్మశానాల నుంచి సేకరిస్తున్నారనేది తాజా సంచలన విషయం.
ప్రస్తుతం ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. నెత్తిన బొగ్గుల మూటతో వెళ్తున్న వృద్ధుడు చెప్పిన విషయం మొక్క జొన్న పొత్తులంటే ఇష్టంగా తినేవారి గొంతులో మంట పుట్టిస్తోంది!. ఎందుకంటే.. ఆ వృద్ధుడు తీసుకువెళ్తున్న బొగ్గుల సంగతి అలాంటిది మరి. తెలంగాణలోని ఓ ప్రాంతంలో ఓ వృద్ధుడు నెత్తిన భారీ బొగ్గుల మూటతో ఎదురు పడడంతో ఓ ఔత్సాహిక వ్యక్తి.. ``ఏంటి తాతా అవి!`` అని ప్రశ్నించాడు. వెంటనే సదరు వృద్ధుడు బొగ్గులని, వాటిని శ్మశానం నుంచి సేకరించానని మనసులో ఏమీ దాచుకోకుండా చెప్పాడు.
అయితే, ఆ బొగ్గులను వేటికి వాడతారని ప్రశ్నించగా మొక్కజొన్న పొత్తులు కాల్చే వారికి విక్రయిస్తానని బదులిచ్చాడు. దీంతో మైండ్ బ్లాంక్ అయిన.. సదరు వ్యక్తి.. వృద్ధుడిపై చడామడా తిట్ల వర్షం కురిపించి.. పోలీసులకు సమాచారం ఇస్తాననే సరికి.. సదరు వృద్ధుడు అక్కడి నుంచి పలాయనం చిత్తగించాడు. అయితే.. ఈ వీడియో క్షణాల్లోనే వైరల్ కావడంతోపాటు నెటిజన్లు కూడా తీవ్రస్థాయిలో స్పందించారు.
శవాలను తగలబెట్టగా మిగిలిన బొగ్గులపై మొక్కజొన్న పొత్తులు కాల్చుతున్నారా? ఇంతకన్నా దుర్మార్గం ఏముంటుందని.. కొందరు విమర్శలు గుప్పించారు. మరికొందరు చివరకు శవాల బూడిద కూడా వదిలి పెట్టడం లేదా? అని నివ్వెర పోయారు.