కోటికి పైగా ఫాలోవర్స్‌.. అడవిలో సావాసం చేస్తోన్న టిక్ టాకర్! /

ఆ సమయంలో ధరించాల్సిన దుస్తులతో పాటు ఎన్నో మెలకువలు చెబుతుంటారు డానీ డస్ట్.

Update: 2023-07-31 11:44 GMT

ఈ రోజుల్లో చాలామంది జనం గ్రామాలు విడిచి మెట్రోపాలిటన్ నగరాలకు ప్రయాణమవుతున్న రోజులివి! ఈ సమయంలో ప్రపంచానికి దూరంగా అడవుల్లో సంచరిస్తూ.. గుహల్లో తలదాచుకుంటూ బ్రతికే ఒక ఆధునిక అడవి మనిషి జీవితం తాజాగా హాట్ టాపిక్ గా మారింది.

అవును... కొంతకాలంగా అడవుల్లో సంచరిస్తూ.. గుహలలోనే తలదాచుకుంటూ బతికేస్తున్నాడు ఒక టిక్ టాకర్. గుహలలో తలదాచుకోవడానికి, అడవుల్లో సురక్షితంగా తిరగడానికి అవసరమైన మెలకువలు చెబుతూ ఉంటాడు. వీటన్నింటికీ సంబంధించి వీడియోలను "టిక్‌ టాక్‌" లో షేర్‌ చేసుకుంటున్నాడు. అమెరికాలోని కొలరాడోకు చెందిన ఈ డానీ డస్ట్‌ కు "టిక్‌ టాక్‌" లో ఏకంగా కోటి మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు.

ఈ సందర్భంగా అడవుల్లో సంచరించేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. గుహల్లో తలదాచుకోవాలనుకున్నప్పుడు పాటించాల్సిన మెలుకువలు.. ఆ సమయంలో ధరించాల్సిన దుస్తులతో పాటు ఎన్నో మెలకువలు చెబుతుంటారు డానీ డస్ట్.

ఈ నేపథ్యంలో తాజాగా.. "గుహలలో తలదాచుకోవడం అంత తేలికైన పనేమీ కాదు.. తలదాచుకోవాలనుకున్న గుహ సురక్షితమైనదో కాదో చూసుకోవాలి.. గుహలో ఏదైనా జంతువు విసర్జకాలు ఉన్నట్లయితే.. అది ఆ జంతువు సొంతం. అలాంటి గుహలో తలదాచుకోవడం ప్రాణాలకే ప్రమాదం.." అని పలు సూచనలు చేస్తున్నారు.

ఇదే సమయంలో గుహ పైభాగంలో పగుళ్లు ఉన్నాయో లేదో చూడాలి.. పైభాగంలో పగుళ్లు ఉంటే, ఏ క్షణంలోనైనా పెళ్లలు విరిగి నెత్తిన పడే ప్రమాదం ఉంటుంది.. అన్నీ సజావుగా ఉన్న గుహను ఎంపిక చేసుకోవడం ఒక కష్టమైతే.. అందులోని రాతి నేల మీద అలాగే పడుకోవడం మరో కష్టం అని చెబుతున్నారు డానీ!

ఈ సమయంలో సజావుగా ఉన్న గుహను ఎంపిక చేసుకొన్న అనంతరం.. తగినంత ఎండుగడ్డిని పోగు చేసుకుని, పరుచుకుంటే పడుకోవడానికి సౌకర్యంగా ఉంటుంది అని చెబుతున్నాడు డానీ. అడవుల్లో జంతువులను వేటాడుతూ.. వాటి మాంసంతోను, అడవిలో దొరికే పండ్లు కాయలతోనే కాలక్షేపం చేస్తూ ఇతడు తీసే వీడియోలు క్షణాల్లోనే వైరల్‌ అవుతుండటం విశేషం.

Tags:    

Similar News