వైఎస్ శ్రీనివాస్'గా పేరు.. మారిన వేళ!!
పలు సందర్భాల్లో వైఎస్‌తో కలిసి ఢిల్లీకి వెళ్లారు. రోజుల తరబడి అక్కడే ఉండి.. పార్టీని ముందుకు నడి పించడంపై ఆయన చర్చించారు.
ధర్మపురి శ్రీనివాస్.. ఈ పేరు ఉమ్మడి రాష్ట్రానికి బాగా తెలుసు. కానీ, 2004కు ముందు.. తర్వాత.. ఆయన పేరు వైఎస్ శ్రీనివాస్‌గా మారిపోయింది. దీనికి కారణం.. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి.. డీఎస్‌కు మధ్య ఉన్న అనుబంధం అలాంటిది. పార్టీ చాలా క్లిష్ట పరిస్థితిలో ఉంది. దీనిని ఎలా ముందుకు నడిపించాలి. బలమైన చంద్రబాబు ప్రభుత్వాన్ని ఎలా గద్దెదింపాలని అంతర్మథనం పడుతున్న సమయంలో అనేకరాత్రులు.. వైఎస్‌తో కలిసి.. పార్టీ కోసం చర్చించారు శ్రీనివాస్.
పలు సందర్భాల్లో వైఎస్‌తో కలిసి ఢిల్లీకి వెళ్లారు. రోజుల తరబడి అక్కడే ఉండి.. పార్టీని ముందుకు నడి పించడంపై ఆయన చర్చించారు. ఈ సమయంలోనే ''నేను పాదయాత్ర చేస్తా'' అని వైఎస్ అన్నప్పు డు.. మొదటవ్యక్తిగతంగా అడ్డుకున్నది డీఎస్. ''ఏమనుకున్నారు.. ఈ వయసులో అవసరమా?'' అని డీఎస్ అడ్డగించారు. ఈ సమయంలోనే వీహెచ్ వంటి వారు కూడా వద్దంటున్నారని చెప్పుకొచ్చారు. కానీ, వైఎస్ మాత్రం పార్టీ కోసం ఆమాత్రం చేస్తే తప్పులేదుగా! అంటూ.. ముందుకు సాగారు.
అయితే..ఇక్కడ చెప్పుకోవాల్సింది .. ఏంటంటే.. పాదయాత్ర చేయడం గొప్పవిషయమే. కానీ, దీనికి సం బంధించిముందు.. వెనుక.. అన్ని ఏర్పాట్లు చేయడం.. పార్టీ కార్యకర్తలను, నాయకులను సమన్వయం చేయడం.. మీడియా కవరేజీ. ఆర్థికవెసులు బాటు.. విమర్శలకు సమాధానం చెప్పడం.. ఇలా.. అనేక రూపాల్లో తెరవెనుక ఉన్నది ధర్మపురి శ్రీనివాస్. రాజశేఖరరెడ్డి చెప్పినట్టు.. ''నేను పాదయాత్ర మాత్రమే చేశాను. మా శ్రీనివాస్ నాకన్నాముందే.. రాష్ట్రాన్నిచుట్టి వచ్చాడు'' అన్నది వాస్తవం.
ఎందుకంటే.. ఆయన భౌతికంగా పాదయాత్ర చేయకపోవచ్చు. కానీ, మానసికంగా వైఎస్‌కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా.. రూట్ మ్యాప్ నుంచి అన్నింటినీ రెడీ చేశారు. ఇక, వైఎస్ మంత్రివర్గంలోనూ ఆయనకు చోటు కల్పించారు. అయితే.. కేవలం మంత్రిగానేకాకుండా.. ఓ సోదరుడిగా డీఎస్‌ను వైఎస్ ట్రీట్ చేసేవారు. ఈయన కూడా.. అలానే ఉండేవారు. ఇద్దరి కారణంగానే.. రెండు సార్లు.. పార్టీ అధికారం లోకి వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ విషయంలో కొన్ని రోజులు వైఎస్‌తో విభేదించినా.. నిధులు సరిపోవని భావించినా..తర్వాత వైఎస్ మాటకే విలువ ఇచ్చారు. ఇలా.. డీ శ్రీనివాస్ కాస్తా.. వైఎస్ శ్రీనివాస్‌గా కాంగ్రెస్‌లో గుర్తింపు తెచ్చుకున్నారు. ఇద్దరూ వేర్వేరుకాదు.. ఇద్దరూ ఒక్కటే అన్న మాటను చిరస్థాయి చేశారు.