ఇండియన్ ఫ్యామిలీని స్మగ్లింగ్ చేసిన వ్యక్తి చికాగోలో అరెస్ట్!

కెనడియన్ బ్రాడ్‌ కాస్ట్ కార్పొరేషన్ న్యూస్ ఫిఫ్త్ ఎస్టేట్ కథనాల ప్రకారం... హర్షకుమార్ అరెస్ట్ చికాగో విమానాశ్రయంలో జరిగిందని తెలుస్తుంది.

Update: 2024-02-26 05:29 GMT

2022 జనవరిలో కెనడా నుంచి అమెరికాకు అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నించిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దారుణ విషాదాంతానికి గురైన సంగతి తెలిసిందే. హృదయ విదారక ఘటనపై జరిపిన విచారణలో షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఇందులో భాగంగా... ఈ ఘటనకు, గుజరాత్‌ లో మానవ అక్రమ రవాణా రాకెట్‌ లకు సంబంధాలు ఉన్నాయని వెల్లడైంది! ఈ క్రమంలో తాజాగా ఈ కేసుకు సంబంధించి కీలక వ్యక్తిని యూఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు.

అవును... కెనడా నుంచి అమెరికాకు అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నించి మృతి చెందిన గుజరాత్ ఫ్యామిలీకి సంబంధించిన కేసులో కీలక నిందితుడు హర్ష్‌ కుమార్ పటేల్ అలియాస్ డర్టీ హ్యారీని అమెరికా అధికారులు చికాగోలో అరెస్టు చేశారని తెలుస్తుంది. కెనడియన్ బ్రాడ్‌ కాస్ట్ కార్పొరేషన్ న్యూస్ ఫిఫ్త్ ఎస్టేట్ కథనాల ప్రకారం... హర్షకుమార్ అరెస్ట్ చికాగో విమానాశ్రయంలో జరిగిందని తెలుస్తుంది.

జగదీష్ పటేల్ (39), అతడి భార్య వైశాలి (37), కుమార్తె విహంగీ (11), కుమారుడు ధార్మిక్ (3) మరణాలు కెనడా, యుఎస్‌ లోని గుజరాతీ సమాజాన్ని తీవ్రంగా కదిలించిన సంగతి తెలిసిందే. గాంధీనగర్ సమీపంలోని డింగుచాకు చెందిన ఈ కుటుంబం... జనవరి 19, 2022న యూఎస్ అధికారులు పట్టుకున్న స్టీవ్ షాండ్ అనే వ్యాన్‌ తో హర్ష్‌ కుమార్‌ కు పరిచయం అయ్యింది! యూఎస్ సరిహద్దు సమీపంలో మరణించిన నలుగురితో సహా గుజరాత్ నుండి ఏడుగురిని అక్రమంగా స్మగ్లింగ్ చేసినట్లు షాండ్‌ పై ఆరోపణలు వచ్చాయి.

ఈ క్రమంలో హర్షకుమార్ – షాండ్ లమధ్య ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు వాట్సప్ మెసేజ్ లలో దర్యాప్తు అధికారులు గుర్తించారని తెలుస్తుంది. ఈ సమయంలో ఇతడి అరెస్ట్... ఎన్నో కలలతో గుజరాత్ నుంచి అమెరికాకు జరుగుతున్న అంతర్జాతీయ హ్యూమన్ స్మగ్లింగ్ రాకెట్ ను వెలిలికి తీసే ప్రక్రియలో ముఖ్యమైన పురోగటిగా పరిగణించబడుతుందని అంటున్నారు. గతంలో ఇదే కేసులో కెనడాలో ఫెనిల్ పటేల్, అమెరికాలో బిట్టు సింగ్ అలియాస్ పాజీ పాత్రలను అధికారులు హైలైట్ చేశారు.

ఇక తాజా కేసులో తదుపరి విచారణ ఫిబ్రవరి 28న జరగనుంది. అయితే అందుతున్న సమాచారం ప్రకారం ఈ కేసును మిన్నెసోటాకు బదిలీ చేయవచ్చని తెలుస్తుంది. షాండ్ జ్యూరీ విచారణ కూడా మార్చిలో మిన్నెసోటాలో ప్రారంభం కానుంది. హర్ష్‌ కుమార్‌ కి హ్యారీ పటేల్, హరేష్ పటేల్, హరేష్‌ కుమార్ సింగ్ పటేల్, పరమ్ సింగ్ అనే మారుపేర్లు కూడా ఉన్నాయని అంటున్నారు.

Tags:    

Similar News