ఇరుగు పొరుగు సంగతి ఖతం..ఇక యూరప్ పై ట్రంప్ ఫోకస్.. తర్వాత భారత్?
మరి.. గ్రీన్ ల్యాండ్ కోసం యూరప్ దేశం డెన్మార్క్ తో కయ్యం పెట్టుకున్న ఆయన తదుపరి ఏం చేస్తారు..? దీనికి సమాధానం.. ట్రంప్ టారిఫ్ టార్గెట్ యూరప్ అని అంటున్నారు.
ఉత్తర అమెరికా ఖండంలో ఉండేవే మూడు నాలుగు దేశాలు.. వాటిలో ప్రపంచానికే పెద్దన్న అమెరికా.. మిగతావి అగ్ర రాజ్యం అంటే భయం నటించే కెనడా, మెక్సికో.. తాజాగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ రెండు దేశాలపై టారిఫ్ లు (సుంకాలు) బాదేశారు. సుదూరాన ఉన్న చైనానూ టార్గెట్ చేశారు. మరి.. గ్రీన్ ల్యాండ్ కోసం యూరప్ దేశం డెన్మార్క్ తో కయ్యం పెట్టుకున్న ఆయన తదుపరి ఏం చేస్తారు..? దీనికి సమాధానం.. ట్రంప్ టారిఫ్ టార్గెట్ యూరప్ అని అంటున్నారు.
యూరప్ ఖండ దేశాలన్న కొన్ని దశాబ్దాల కిందటే యూరోపియన్ యూనియన్ (ఈయూ)గా ఏర్పడ్డాయి. ఇప్పటివరకైతే వాటికి అమెరికా నుంచి మద్దతు ఉంది. మున్ముందు మాత్రం ట్రంప్ సుంకాలు బాదేయాలని ఆలోచిస్తున్నారా?..అంటే దీనికి ఔననే సమాధానమే వస్తోంది. అధ్యక్ష భవనం వైట్ హౌస్ లోని ఓవల్ కార్యాలయంలో మీడియా ప్రశ్నకు ట్రంప్ సమాధానం ఇస్తూ.. ‘‘మీకు సరైన సమాధానం కావాలా లేక రాజకీయ సమాధానం కావాలా?’’ అని ఎదురు ప్రశ్నించారు. ఈయూ తమపట్ల దారుణంగా ప్రవర్తించిందని మండిపడ్డారు. అంటే.. ఈయూపై ట్రంప్ ప్రతీకారానికి దిగుతారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
ఏడేళ్ల కిందట..
2018లో ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఈయూ అల్యూమినియం, స్టీల్ పై సుంకం విధించింది. వీటిలో అమెరికా దిగుమతి చేసుకునే ఉత్పత్తులూ ఉన్నాయి. వాటిని గుర్తుపెట్టుకుని మరీ ట్రంప్ ప్రతీకార చర్యకు దిగుతారా? అనే ఆందోళన వ్యక్తం అవుతోంది.
తదుపరి టార్గెట్ భారత్..?
ట్రంప్ భారత ప్రధాని మోదీకి ఎంత గౌరవం ఇచ్చినా.. ఆయన తదుపరి టారిఫ్ టార్గెట్ లో భారత్ కూడా ఉందని తెలుస్తోంది. ఇప్పటికే బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా ,ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా) కూటమి సొంత కరెన్సీ తెచ్చే ఆలోచనపై ట్రంప్ మండిపడుతున్నారు. 100 శాతం టారిఫ్ లు విధిస్తానని హెచ్చరించారు. ఇతర పన్నుల విషయంలోనూ భారత్ పై ట్రంప్ ఓ కన్నేశారు. అంటే.. ఆయన తదుపరి టార్గెట్ మన దేశమేనన్నమాట.?