దుబాయ్ లో ఇకపై ''బ్లూ వీసా''... ఎవరు అర్హులంటే..?

దీంతో... మన దేశానికి చెందిన పలువురు సినీ ప్రముఖులకు ఈ వీసాలు లభించాయి.

Update: 2024-05-17 09:35 GMT

యునైటెడ్ అరెబిక్ ఎమిరేట్స్ (యూఏఈ) ఇప్పటికే "గోల్డెన్‌ వీసా"లను జారీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... పెట్టుబడిదారులు, వ్యవస్థాపకులు, శాస్త్రవేత్తలు, అసాధారణ ప్రతిభ కలిగిన గ్రాడ్యుయేట్లకు 10 ఏళ్ల కాలపరిమితితో ఈ ప్రత్యేక వీసాలను అందిస్తోంది. దీంతో... మన దేశానికి చెందిన పలువురు సినీ ప్రముఖులకు ఈ వీసాలు లభించాయి. ఈ క్రమంలో తాజాగా "బ్లూ వీసా" లను తెరపైకి తెచ్చింది.

అవును... గోల్డెన్‌ వీసా, గ్రీన్‌ వీసా, రిమోట్‌ వర్కింగ్ వీసాలను ఇటీవలి కాలంలో ప్రత్యేకంగా తీసుకొచ్చిన యూఏఈ.. తాజాగా "బ్లూ రెసిడెన్సీ వీసా" లను తెరపైకి తెచ్చింది. ఇందులో భాగంగా... పర్యావరణ పరిరక్షణ, సుస్థిరతను ప్రోత్సహించే ప్రయత్నంలో భాగంగా యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది.

ఈ క్రమంలో... పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేసే వ్యక్తులకు సుదీర్ఘకాల రెసిడెన్సీ వీసాను తీసుకురానుంది. ఈ మేరకు ఇటీవల జరిగిన కేబినెట్‌ సమావేశంలో ఈ "బ్లూ రెసిడెన్సీ వీసా"ల జారీకి ఆమోదం తెలిపినట్లు దుబాయ్ ప్రధానమంత్రి షేక్‌ మహమ్మద్‌ బిన్‌ రషీద్‌ వెల్లడించారు. తమ ఆర్థిక వ్యవస్థ స్థిరత్వం అనేది కచ్చితంగా పర్యావరణ సమతుల్యతతో ముడిపడి ఉందని ప్రధాని పేర్కొన్నారు.

ఇక ఈ బ్లూ రెసిడెన్సీ వీసా ప్రకారం... పదేళ్ల పాటు యూఏఈలో నివాసం ఉండేందుకు వీలు ఉంటుంది. పర్యావరణాన్ని పరిరక్షించే అంశంపై పలు రంగాల్లో అసాధారణ కృషి చేసిన వ్యక్తులకు వీటిని జారీ చేస్తారు. ఈ వీసాలు పొందే వ్యక్తులకు యూఏఈలో దీర్ఘకాలిక నివాసంతో పాటు పర్యావరణ ప్రాజెక్టుల్లో సహకారం అందించే అవకాశాలు లభిస్తాయి.

కాగా... భూ ఉపరితలంపై పర్యావరణ వ్యవస్థ, గాలి నాణ్యత, మెరైన్‌ లైఫ్‌, సుస్థిర సాంకేతికత మొదలైన రంగాల్లో పనిచేస్తున్న వారు ఈ వీసాలకు అర్హులని యూఏఈ ప్రభుత్వం ప్రకటించింది. ఆ అర్హతలు ఉన్నవారు ఈ వీసాల కోసం ఫెడరల్‌ అథారిటీ ఫర్‌ ఐడెంటిటీ, సిటిజన్‌ షిప్, కస్టమ్స్‌ అండ్‌ పోర్ట్‌ సెక్యూరిటీ నుంచి దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.

Tags:    

Similar News