ఎన్నికల వేళ పట్టుబడిన డబ్బులన్ని విపక్షాలవే ఎందుకంటే?

ఇటీవల అదుపులోకి తీసుకున్న మాజీ పోలీసు అధికారి రాధాకిషన్ రావు నోటి నుంచి వచ్చినట్లుగా చెబుతున్న ఆయన రిమాండ్ రిపోర్టు సంచలనంగా మారింది.

Update: 2024-04-02 03:56 GMT

సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసు అంతకంతకూ వవిస్తృతం కావటమే కాదు.. దాని వెనుకున్న చీకటి అంశాలు వెలుగులోకి వస్తూ షాకుల మీద షాకులు ఇస్తున్నాయి. ఇటీవల వెలుగు చూస్తున్న అంశాల్ని చూస్తున్న కొందరు పోలీసులు అధికారులు.. కేసీఆర్ ప్రభుత్వంలో ఇంత జరిగిందా? అని ముక్కున వేలేసుకుంటున్న పరిస్థితి. ఏదో జరుగుతుందన్న విషయం తెలుసు కానీ.. ఇంత ప్లాన్డ్ గా.. విపక్షాలే ఉండకూడదన్నట్లుగా వ్యవహరించారా? అంటూ అవాక్కు అవుతున్నారు. రాజకీయ వైరం గురించి తెలిసిందే. అంత మాత్రాన వెనుకా ముందు చూసుకోకుండా తమను వ్యతిరేకంగా పార్టీలే బతకకూడదన్న రీతిలో గత ప్రభుత్వంలో అధికారులు వ్యవహరించారా? అన్నది చర్చగా మారింది.

ఇటీవల అదుపులోకి తీసుకున్న మాజీ పోలీసు అధికారి రాధాకిషన్ రావు నోటి నుంచి వచ్చినట్లుగా చెబుతున్న ఆయన రిమాండ్ రిపోర్టు సంచలనంగా మారింది. హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ డీసీపీగా.. ఓఎస్డీగా పని చేసిన రాధాకిషన్ రావును పోలీసు అధికారులు విచారించారు. గత గురువారం ఆయన్ను అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేశారు.

రాధాకిషన్ రావు రిమాండ్ రిపోర్టులో ఇప్పుడు అందరిని ఆందోళనకు గురి చేసిన అంశాలు కొన్ని ఉన్నాయి. వాటిల్లో ముఖ్యమైనది ఎన్నికల వేళ విపక్ష నేతల ఫోన్లు ట్యాప్ చేసి.. వారు మాట్లాడుకునే అంశాలు ఆధారంగా చేసుకొనివారు తరలించే డబ్బును పట్టుకోవటం. గత ఎన్నికల్లోనూ.. అంతకు ముందు జరిగిన ఎన్నికల్లోనూ అధికార పార్టీకి చెందిన డబ్బులు పట్టుబడకుండా.. కేవలం విపక్షాల డబ్బుల్ని పట్టుకోవటం చూసిన వేళలో.. చాలామంది నోటి నుంచి వచ్చిన మాట.. డబ్బుల్ని కూడా సక్కగా తరలించటం చేతకాదా? అని.

అయితే.. దీని వెనుక ఫోన్ ట్యాపింగ్ ఉందన్న విషయం ఇప్పుడు బయటకు వెల్లడయ్యాక.. విపక్షాల వైఫల్యం ఎక్కడుందన్న విషయం అందరికి అర్థమైన పరిస్థితి. దీనికి సంబంధించి రాధాకిషన్ రావు నోటి నుంచి వచ్చిన పలు అంశాలు నోట మాట రానివ్వటం లేదు. టాస్క్ ఫోర్సు ఓఎస్డీగా ఉన్న రాధాకిషన్ రావు తన పరిధిని దాటి చాలానే చేశారనటానికి విచారణ వేళ ఆయన చెప్పిన అంశాలే నిదర్శనం.

మరో సీనియర్ పోలీసు అధికారి ప్రభాకర్ రావు సూచనల మేరకు 2018 ఎన్నికల వేళలో డబ్బు పంపిణీకి సంబంధించిన సమాచారాన్ని రాధాకిషన్ రావుకు ప్రణీత్ రావు ఇచ్చేవారు. దీని ఆధారంగా రాధాకిషన్ రావు ఆధ్వర్యంలోని టాస్క్ ఫోర్సు సిబ్బంది హైదరాబాద్ లోని ప్యారడైజ్ హోటల్ వద్ద శేరిలింగంపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన టీడీపీ అభ్యర్తి భవ్య సిమెంట్స్ అధినేత ఆనంద్ ప్రసాద్ కు చెందిన రూ.70 లక్షలు స్వాధీనం చేసుకున్నారు.

2022 మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా ప్రభాకర్ రావు ఆదేశాల మేరకు ప్రణీత్ రావు సాంకేతిక నిఘాను నిర్వహించేవారు. ఆయన ఇచ్చిన సమాచారంతోనే హైదరాబాద్ టాస్క్ ఫోర్సు పోలీసులు నాటి బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అనుచరులైన గుంట సాయికుమార్ రెడ్డి.. కుండె మహేశ్.. డి. సందీప్ కుమార్.. ఎం మహేందర్.. ఎ అనూష్ రెడ్డి తదితరుల నుంచి రూ.3.5 కోట్లు స్వాధీనం చేసుకున్నారు.

2020లో జరిగిన దుబ్బాక ఉప ఎన్నికల్లోనూ రాధాకిషన్ రావు ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్సు పోలీసులు బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు బంధువులకు చెందిన ఒక చిట్ ఫండ్ కంపెనీకి చెందిన రూ.కోటి నగదును ఇదే రీతిలో పట్టుకున్నారు. ఇలా ఫోన్ ట్యాపింగ్ లో నాటి అధికార పక్షానికి వైరిగా ఉన్న పార్టీ అభ్యర్థుల్ని టార్గెట్ చేసిన వైనం ఇప్పుడు కొత్త చర్చగా మారింది.

Tags:    

Similar News