కేసీఆర్ కు బిగ్ షాకిచ్చిన ఈసీ... తెరపైకి అరుదైన ఘటన!
కాంగ్రెస్ నేతల ఫిర్యాదు మేరకు ఎన్నికల సంఘం ఈ విధంగా చర్యలు చేపట్టింది!
లోక్ సభ ఎన్నికల వెళ తెలంగాణలో అరుదైన ఘటన తెరపైకి వచ్చింది. ప్రస్తుతం లోక్ సభ ఎన్నికల ప్రచారాలతో అన్ని పార్టీలూ హోరెత్తించేస్తున్న వేళ.. కేసీఆర్ విషయంలో ఎన్నికల కమిషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా... 48 గంటల పాటు కేసీఆర్ ప్రచారం చేయకుండా నిషేధం విధించింది. కాంగ్రెస్ నేతల ఫిర్యాదు మేరకు ఎన్నికల సంఘం ఈ విధంగా చర్యలు చేపట్టింది!
అవును... తెలంగాణలో కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై ఎన్నికల కమిషన్ 48 గంటలు నిషేధం విధించింది. ఇటీవల ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పై అవమానకర, అభ్యంతరకర పదజాలాన్ని ఉపయోగించినందుకు ఎన్నికల సంఘం కేసీఆర్ ప్రచారంపై వేటు వేసింది. ఈ రోజు రాత్రి 8 గంటల నుంచే ఈ నిబంధన అమలులో ఉండనున్నట్లు ఈసీ కీలక ఆదేశాలు జారీ చేసింది.
వివరాళ్లోకి వెళ్తే... సిరిసిల్లలో గత నెలలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడిన కేసీఆర్... కాంగ్రెస్ పార్టీని, ఆ పార్టీ నేతలను ఉద్దేశించి తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని.. ఇది ఎన్నికల నియమావళికి పూర్తిగా విరుద్ధమని ఆ పార్టీ నేత నిరంజన్ రెడ్డి ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేశారు. దీంతో... ఈ ఫిర్యాదు ఆధారంగా విచారణ చేపట్టిన ఎన్నికల సంఘం కేసీఆర్ నుంచి వివరణ కూడా తీసుకుంది.
ఈ సమయంలో... స్థానిక అధికారులు తెలంగాణ మాండలికాన్ని పూర్తి స్థాయిలో అర్థం చేసుకోలేక పోయారంటూ బీఆరెస్స్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వివరణ ఇచ్చారు. అయితే.. ఈ వివరణపై సంతృప్తి చెందని ఈసీ.. కేసీఆర్ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని భావించింది. ఈ నేపథ్యంలోనే... ఈ రోజు రాత్రి 8 గంటల నుంచి 48 గంటల పాటు కేసీఆర్ లోక్ సభ ఎన్నికల ప్రచారం చేయకూడదని ఈసీ స్పష్టం చేసింది.