ట్రంప్ ప్రమాణంలో ‘నాజీ సెల్యూట్’.. చేసింది అపర కుబేరుడు

అంతా బాగానే ఉన్నా ట్రంప్ ప్రమాణ స్వీకారంలో మస్క్ చేసిన ఓ పని మాత్రం అందరినీ ఆశ్చర్యపరించింది.

Update: 2025-01-21 09:59 GMT

అసలే ఆయన వివాదాస్పద నాయకుడు.. ఆయనకు తోడు వివాదాస్పద అపర కుబేరుడు.. అసలు వీరిద్దరి కాంబినేషనే ఆశ్చర్యం అంటే.. ప్రభుత్వంలోనూ భాగస్వామ్యం. ఇదంతా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. టెస్లా అధినేత ఎలాన్ మస్క్ గురించి.

అమెరికా 47వ అధ్యక్షుడిగా ట్రంప్ సోమవారం ప్రమాణం చేసిన సందర్భానికి మస్క్ కూడా హాజరయ్యారు. అయితే, అక్కడ ఆయన అత్యుత్సాహం వివాదానికి దారితీసింది.

ట్రంప్ పై గత జూలైలో హత్యాయత్నం అనంతరం.. ఆయన కోలుకుని సాగించిన ప్రచారంలో మస్క్ హడావుడి చేశారు. మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్ (మాగా) టోపీ ధరించి డ్యాన్స్ చేశారు.

ట్రంప్ గెలుపుతో.. మస్క్ కు అమెరికా వ్యవస్థను ప్రక్షాళన (డోజ్) చేసే కీలక బాధ్యతలు అప్పగించారు. ఈ టీమ్ లో ప్రవాస భారతీయుడు వివేక్ రామస్వామి కూడా ఉన్నారు. దీంతోనే ట్రంప్ సర్కారులో మస్క్ కు ప్రాధాన్యం దక్కుతుందని స్పష్టమైంది.

అయితే, అంతా బాగానే ఉన్నా ట్రంప్ ప్రమాణ స్వీకారంలో మస్క్ చేసిన ఓ పని మాత్రం అందరినీ ఆశ్చర్యపరించింది. వాస్తవానికి ట్రంప్ ప్రమాణంలో మస్క్‌ ప్రత్యేక ఆకర్షణ. ఈ క్రమంలో హాజరైన ప్రముఖులు, నాయకుల్లోల జోష్‌ నింపే ప్రయత్నంలో చేసిన ప్రయత్నం అభాసుపాలైంది.

ట్రంప్ ప్రమాణం చేసిన వాషింగ్టన్ డీసీలోని క్యాపిటల్ వన్ అరేనాలో మస్క్ మాట్లాడుతూ.. బ్యాక్ టు బ్యాక్ నాజీ సెల్యూట్‌ చేయడం వివాదానికి దారి తీసింది. ఈ వీడియోను తన సొంత సంస్థ ‘ఎక్స్’ ఖాతాలో మస్క్ పోస్ట్ చేశారు. కానీ, వివాదం రేగడంతో సర్దుకున్నారు. పాత ట్వీట్ ను రీ ట్వీట్ చేయగా.. అందులో నాజీ సెల్యూట్‌ లేదు.

ఏమిటీ నాజీ సెల్యూట్?

ట్రంప్ ప్రమాణంలో మస్క్ నాజీ సీగ్ హీల్ సెల్యూట్ చేశారు. ఇది జర్మనీ నియంత హిట్లర్ సైన్యం సెల్యూట్. దీంతోనే మస్క్ పై యూజర్లు మండిపడ్డారు. అమెరికాకు ఎన్నికవని అధ్యక్షుడు అంటూ ట్రోల్ చేశారు. అయితే, నష్టం జరుగుతోందని గమనించి మస్క్ కు చెందిన స్పేస్ ఎక్స్ సంస్థ.. ‘‘మీడియా మిమ్మల్ని తప్పుదారి పట్టిస్తోంది.. మస్క్ ఎప్పుడూ నాజీ సెల్యూట్ చేయలేదు’’ అని వివరణ ఇచ్చుకుంది.

Tags:    

Similar News