పార్టీలో చీలిక భయం.. ఏకంగా 90 మందికి కేబినెట్‌ పదవులు!

ఈ నేపథ్యంలో మెజార్టీ మార్కుకంటే అదనంగా 22 సీట్లను కాంగ్రెస్‌ అదనంగా గెలుచుకుంది.

Update: 2024-02-14 02:30 GMT

గతేడాది మే నెలలో కర్ణాటకలో బీజేపీని మట్టికరిపించి కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా, డీకే శివకుమార్‌ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. కాగా కర్ణాటక అసెంబ్లీలో మొత్తం 224 సీట్లు ఉండగా 135 సీట్లను కాంగ్రెస్‌ పార్టీ గెలుచుకుంది. ప్రభుత్వ ఏర్పాటుకు 113 సీట్లు ఉంటే సరిపోతుంది. ఈ నేపథ్యంలో మెజార్టీ మార్కుకంటే అదనంగా 22 సీట్లను కాంగ్రెస్‌ అదనంగా గెలుచుకుంది.

అయితే ప్రతిపక్షంలో బీజేపీ ఉంది. బీజేపీ 66 సీట్లను గెలుచుకుంది. మాజీ ప్రధాని దేవగౌడ నేతృత్వంలోని జేడీఎస్‌ 19 సీట్లలో విజయం సాధించింది. అసెంబ్లీ ఎన్నికల్లో వేర్వేరుగా పోటీ చేసిన జేడీఎస్, బీజేపీ వచ్చే లోక్‌ సభ ఎన్నికల కోసం పొత్తు పెట్టుకున్నాయి.

ఈ నేపథ్యంలో బీజేపీ, జేడీఎస్‌ కలిసి కాంగ్రెస్‌ పార్టీలో కొంతమందిని చీల్చి ప్రభుత్వాన్ని పడేసే ప్రమాదం ఉందని అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ భావిస్తోంది. ప్రస్తుతం 34 మంది కర్ణాటక కాంగ్రెస్‌ ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నారు. ఇంకా 100 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలకు పదవులు లేవు. వీరిపై బీజేపీ వల వేసే అవకాశం ఉండటంతో వారిపైన కాంగ్రెస్‌ ప్రభుత్వం దృష్టి సారించింది.

ఈ నేపథ్యంలో 34 మంత్రులు కాకుండా 56 మంది ఎమ్మెల్యేలకు కేబినెట్‌ మంత్రి స్థాయి పదవులను కట్టబెట్టింది. దీంతో కర్ణాటక ప్రభుత్వంలో ఎక్కువ మంది ఎమ్మెల్యేలు కేబినెట్‌ మంత్రి స్థాయి హోదాలను అనుభవిస్తున్నారు. తద్వారా పార్టీలో అసంతృప్తికి కాంగ్రెస్‌ ప్రభుత్వం అడ్డుకట్ట వేసిందని అంటున్నారు.

సిద్ధరామయ్య ప్రభుత్వంలో ప్రస్తుతం ఉన్న 34 మంది మంత్రులతో పాటు మరో 56 మందికి కేబినెట్‌ మంత్రి హోదాలున్నాయి. ఇలా ఏకంగా 90 మందికి కేబినెట్‌ మంత్రి హోదా ఉండటం కర్ణాటక చరిత్రలోనే కాకుండా దేశంలోనే ఒక అరుదైన రికార్డుగా చెబుతున్నారు.

34 మంది మంత్రులు కాకుండా 56 మంది ఎమ్మెల్యేలను ముఖ్యమంత్రి ఆర్థిక సలహాదారు, మాధ్యమ సలహాదారు, రాజకీయ సలహాదారు, వైద్య సలహాదారు, బ్రాండ్‌ బెంగళూరు నిపుణులు, వివిధ బోర్డుల చైర్మన్లు, రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ల చైర్మన్లుగా నియమించారు. కేబినెట్‌ హోదా పొందిన ప్రతి ఒక్కరికి 14 మంది చొప్పున సహాయకులు, ఒక కారు, పోలీసు భద్రత, అత్యుత్తమ వేతనాలు అందిస్తున్నారు.

2003లో చేసిన భారత రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం అసెంబ్లీలో కేవలం 15 శాతం మందికి కేబినెట్‌ హోదా ఉండాలి. ఈ నేపథ్యంలో సిద్ధరామయ్య ప్రభుత్వం ఈ చట్టాన్ని ఉల్లంఘించినట్లు బీజేపీ, జేడీఎస్‌ నేతలు మండిపడుతున్నారు.

గతంలో బీఎస్‌ యడియూరప్ప సర్కారు ఐదుగురికి కేబినెట్‌ హోదా కల్పించినందుకే సిద్ధరామయ్య తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారని బీజేపీ నేతలు గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు ఇంతమందికి కేబినెట్‌ హోదా ఎలా ఇచ్చారని మండిపడుతున్నారు.

Tags:    

Similar News