దేశంలో బాణసంచా అమ్మకాల బ్యాన్ పై సుప్రీం కీలక వ్యాఖ్యలు!

దేశంలో బాణాసంచా అమ్మకాలు, వినియోగంపై బ్యాన్ కోరుతూ సుప్రీంలో పలు పిటిషన్లు నమోదయ్యాయిన సంగతి తెలిసిందే

Update: 2023-11-07 16:54 GMT

దేశంలో బాణాసంచా అమ్మకాలు, వినియోగంపై బ్యాన్ కోరుతూ సుప్రీంలో పలు పిటిషన్లు నమోదయ్యాయిన సంగతి తెలిసిందే! ఈ క్రమంలో... సుప్రీంకోర్టు గత తీర్పు కేవలం ఢిల్లీకే పరిమితం అనుకుంటున్నారని పిటిషనర్ పేర్కొన్నారు. ఈ తీర్పు దేశమంతటా వర్తిస్తుందని అందరికీ తెలియాలని.. గతంలో ఇచ్చిన తీర్పును దేశమంతటా అమలు చేయాలని పిటిషనర్ పేర్కొన్నారు. దీంతో తాజాగా రాజస్థాన్ పిటిషన్లపై సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా కీలక సూచనలు చేసింది.

అవును... ప్రస్తుతం వాయుకాలుష్యం అనేది దేశ రాజధానిని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుంది. ప్రతీ ఏటా ఈ సమస్య పెరుగుతూ వస్తుందని అంటున్నారు. నవంబర్ నెలలోనే ఇలా ఉంటే... జనవరిలో దీని తీవ్రత మరింత ఎక్కువగా ఉండే ప్రమాదం లేకపోలేదనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ సమయంలో దీపావళి దగ్గరకు రావడంతో మరింత ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

ఇందులో భాగంగా... బాణాసంచా పేల్చకూడదని తాము జారీ చేసిన ఆదేశాలు ఢిల్లీ - నేషనల్ కేపిటల్ రీజియన్ (ఎన్.సీ.ఆర్) లకే కాకుండా అన్ని రాష్ట్రాలకు కూడా ఉన్నాయని మంగళవారం సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ సందర్భంగా... వాయు కాలుష్యాన్ని, శబ్ధ కాలుష్యాన్ని నియంత్రించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలను కోర్టు ఆదేశించింది. ఇదే సమయంలో పర్యావరణాన్ని కాలుష్య పరిచేలా చేసుకునే సంబరాలు స్వార్ధపూరితమైనవిగా అభివర్ణించింది.

రాజస్థాన్ రాష్ట్రం కోసం గత ఉత్తర్వులను నేరుగా అమలు చేసేలా అత్యున్నత న్యాయస్థానం ఆదేశించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో... భారతదేశంలో బాణాసంచా అమ్మకాలు, వినియోగంపై నిషేధం విధించాలని కోరుతూ దాఖలైన ఈ పిటిషన్లపై జస్టిస్ ఏఎస్ బోపన్న, జస్టిస్ ఎంఎం సుందరేష్‌ లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ జస్టిస్ సుందరేష్ మాట్లాడుతూ... పర్యావరణానికి సంబంధించిన అంశాలు కేవలం కోర్టు బాధ్యత మాత్రమేననే తప్పుడు అభిప్రాయం ఉందని వ్యాఖ్యానించారు.

ఈ క్రమంలో గతంలో ఇచ్చిన ఆదేశాలను రాజస్థాన్ రాష్ట్రం తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాలని కోర్టు పేర్కొంది. ప్రధానంగా పండుగ సీజన్‌ లలో వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు రాష్ట్రాలు చర్యలు తీసుకోవాలని.. ప్రజలను చైతన్యవంతులను చేయడమే కీలకమని కోర్టు పేర్కొంది. ఇదే సమయంలో... 2018లో సర్వోన్నత న్యాయస్థానం బాణసంచా అమ్మకాలు, వినియోగంపై నిషేధం విధించిందని.. ఆంక్షలు కొనసాగుతాయని, సక్రమంగా అమలు చేయబడతాయని పేర్కొంది.

ఇదే సమయంలో... దేశవ్యాప్తంగా బాణసంచా అమ్మకాలు, కొనుగోళ్లు, వినియోగంపై నిషేదం విధించడం సాద్యం కాదని కోర్టు అభిప్రాయపడింది. అదేవిధంగా టపాసులు కాల్చే విషయంలో ప్రజలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోర్టు తెలిపింది. ఈ రోజుల్లో పిల్లల కన్నా పెద్దలే ఎక్కువగా టపాసులు కాలుస్తున్నారని వ్యాఖ్యానించింది. కాగా.. బేరియం సహా నిషేధిత రసాయనాలతో బాణసంచా తయారీపై గతంలో సుప్రీంకోర్టు నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఇది దేశమంతటా అప్లై అవుతుందని తాజాగా తెలిపింది.

ఆ సంగతి అలా ఉంటే... మరోపక్క దేశ రాజధాని ఢిల్లీలో నానాటికీ పెరుగుతున్న వాయు కాలుష్యంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ప్రజల ఆరోగ్యాన్ని ఈ వాయు కాలుష్యం ఖూనీ చేస్తోందని ఆవేదన చెందింది. ఈ సందర్భంగా వాయు కాలుష్యంపై కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పరం నిందలు వేసుకోవడంపైనా సుప్రీం సీరియస్‌ అయ్యింది. ఇందులో భాగంగా... ఇది రాజకీయ యుద్ధం కాకూడదని సూచించింది. పంట వ్యర్థాల దగ్ధాన్ని తక్షణమే ఆపాలని ఢిల్లీ పొరుగు రాష్ట్రాలను ఆదేశించింది.

Tags:    

Similar News