బీఆర్ఎస్ తొలి జాబితా కేసీఆర్ లక్కీ నెంబర్ రోజున కాదా?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముంగిట్లోకి వచ్చేశాయి. కేంద్ర ఎన్నికల కమిషన్ త్వరలో తెలంగాణ కు నోటిఫికేషన్ విడుదల చేసేందుకు కసరత్తు చేస్తోంది.

Update: 2023-08-13 07:26 GMT

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముంగిట్లోకి వచ్చేశాయి. కేంద్ర ఎన్నికల కమిషన్ త్వరలో తెలంగాణతో పాటు మరో నాలుగు రాష్ట్రాలకు నిర్వహించాల్సిన అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసేందుకు కసరత్తు చేస్తోంది. అయితే.. ఎన్నికల నోటిఫికేషన్ కు ముందే తెలంగాణ అధికార పక్ష అధినేత తమ పార్టీ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించిన కసరత్తు పూర్తి అయ్యిందని.. తొలిజాబితాలోనే భారీ ఎత్తున అభ్యర్థులను ప్రకటిస్తారని చెబుతున్నారు.

నిజానికి ఈ అభ్యర్థుల జాబితా విడుదల మీద బోలెడన్ని అంచనాలు ఉన్నాయి. తొలుత జులై రెండో వారంలో అని జోరుగా ప్రచారం జరిగినా అది నిజం కాలేదు. అనంతరం ఆగస్టు 12, 13 తేదీల్లో ఖాయంగా అభ్యర్థుల లిస్టు వస్తుందన్న ప్రచారం జరిగింది. దీనికి తగ్గట్లే.. ఎర్రవెల్లి ఫాంహౌస్ లో పెద్ద ఎత్తున కసరత్తు జరిగిన వేళ.. టికెట్ల లెక్కలు ఫైనల్ అయినట్లేనని చెప్పారు. కానీ.. అలాంటిదేమీ జరగలేదు. గత ఎన్నికల్లో సెప్టెంబరు 7న తొలిజాబితా విడుదల చేయటం.. మొత్తం 119 స్థానాలకు మొదటి జాబితాలోనే 105 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించి అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు.

అయితే.. మిగిలిన 14 పేర్లను డిసైడ్ చేసేందుకు మాత్రం రెండు జాబితాల్ని విడుదల చేసిన కేసీఆర్.. ఈసారీ గతంలో మాదిరి తొలి జాబితాలోనే మెజార్టీ అభ్యర్థుల పేర్లు విడుదల చేస్తారన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి. జులై.. ఆగస్టు నెలల్లో అనుకున్నట్లుగా తొలి జాబితా విడుదల కాని నేపథ్యంలో సెప్టెంబరులో ఖాయంగా లిస్టును ప్రకటిస్తారని చెబుతున్నారు. అయితే.. గతంలో మాదిరే కేసీఆర్ సెంటిమెంట్ నెంబరైన ‘‘6’’న కాకుండా వేరే తేదీనే ప్రకటించే వీలుందని చెబుతున్నారు.

గత ఎన్నికల్లోనూ లక్కీ నెంబరుకు భిన్నంగా అభ్యర్థుల జాబితాను ప్రకటించి ఘన విజయాన్ని సాధించిన నేపథ్యంలో.. ఈసారి అదే రీతిలో లక్కీ నెంబరుతో కూడిన డేట్ కన్నా.. తన రాశికి అనుుకూలంగా ఉండే తేదీలోనే జాబితాను విడుదల చేయటం ఖాయమంటున్నారు. ఎందుకిలా? మరో కారణం లేకపోలేదు. ఈసారి తమ అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ తొలి జాబితా విడుదలైన తర్వాతే రిలీజ్ చేసే వీలుందని చెబుతున్నారు. వారు ప్రకటించిన అభ్యర్థులను చూసుకొని కొన్ని మార్పులు చేర్పులు చేసుకునే అవకాశం ఉందంటున్నారు.

అదే నిజమైతే.. కాంగ్రెస్ తొలి జాబితా ఆగస్టు మూడు.. నాలుగు వారాల్లో ప్రకటించే వీలుందంటున్నారు. రాజకీయ వర్గాల అంచనా ప్రకారంగా కేసీఆర్ నడిస్తే.. సెప్టెంబరు మొదటి వారంలో తన జాబితాను ప్రకటించే వీలుంది. ఇక.. ఆయన లక్కీ నెంబరుగా చెప్పే ఆరో తేదీన సప్తమి ఉన్న నేపథ్యంలో ఆ తేదీ కంటే కూడా గత ఎన్నికల వేళలో ద్వాదశి రోజున జాబితాను విడుదల చేసే వీలుందంటున్నారు. అదే జరిగితే.. సెప్టెంబరు 10-11 తేదీల్లో ఏదో ఒకదానిని ఎంచుకునే వీలుంది. లక్కీ నెంబరు కన్నా.. తన జాతకానికి కలిసి వచ్చే రోజునే జాబితాను విడుదల చేయటానికి గులాబీ బాస్ మక్కువ చూపుతారంటున్నారు. . మరీ.. ఈ అంచనా ఎంతవరకు కరెక్టు అవుతుందో కాలమే డిసైడ్ చేయాలి.

Tags:    

Similar News