గ్రామాల్లో తిష్ఠ.. సమస్యల పుట్ట.. నేతలకు మరో షాక్!
దీంతో రోజుకో సమస్యతో వారు వినతి పత్రాలు సమర్పిస్తున్నారు. మీరు ఈ సమస్యను పరిష్కరిస్తేనే.. మా ఓటు అని మొహం మీదే చెబుతున్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు సమయం మరో 14 రోజులు మాత్రమే ఉంది. ప్రచారానికి 13 రోజులు మాత్రమే ఉంది. దీంతో గ్రామీణ ఓటు బ్యాంకుపై దృష్టి పెట్టిన బీఆర్ ఎస్, కాంగ్రెస్ నాయకులు జోరుగా తిరుగుతున్నారు. పట్టణ ఓటు బ్యాంకు ఎలా ఉన్నా.. గ్రామీణస్థాయి ఓటు బ్యాంకు ఎక్కువగా ఉండడంతో దీనిని సొంతం చేసుకునేందుకు రెండు పార్టీలు కూడా జోరుగా ప్రయత్నాలు చేస్తున్నాయి.
ఈ క్రమంలో నాయకులు గ్రామీణ స్థాయిలోనే తిష్ట వేస్తున్నారు. రాత్రి సమయాల్లోనూ అక్కడే ఉంటున్నా రు. వారానికి మూడు రోజులు గ్రామాల్లో తిరగేలా ప్లాన్ చేసుకున్నారు. మిగిలిన నాలుగు రోజులు మండలాలు, నగరాల్లో తిరుగుతున్నారు. ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్, నిజామాబాద్ వంటి జిల్లాల్లో గ్రామీణ ప్రాంతాలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో అక్కడి అభ్యర్థులు గ్రామాలను టార్గెట్ చేసుకుని ప్రచారం ముమ్మరం చేస్తున్నారు.
అయితే.. గ్రామాల్లో ఉంటున్న అభ్యర్థుల దృష్టి.. ఇక్కడి ప్రజల ఓటుపై ఉంటే.. ఇక్కడి ప్రజల దృష్టి తమ సమస్యల పరిష్కారంపై ఉంది. దీంతో రోజుకో సమస్యతో వారు వినతి పత్రాలు సమర్పిస్తున్నారు. మీరు ఈ సమస్యను పరిష్కరిస్తేనే.. మా ఓటు అని మొహం మీదే చెబుతున్నారు. నిజామాబాద్ జిల్లాలోని ఓగ్రామంలో అయితే.. లిఖిత పూర్వక హామీ కోరడం ఇటీవల సంచలనంగా మారింది. అయితే.. ఆయా సమస్యల్లో రహదారులు, విద్యుత్, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు ఉన్నాయి.
వీటిపై ఉదాసీనంగా హామీలు ఇచ్చుకుంటూ పోతే.. ఇబ్బందని.. తమ చేతుల్లో ఉన్నంత వరకు చేస్తామని కొందరు అభ్యర్థులు చెబుతున్నారు. మరికొందరు మాత్రం అన్నీ ఓకే.. ఓటు మాకే! నినాదంతో ముందుకు సాగుతున్నారు. అయినప్పటికీ.. నాయకులకు మాత్రం కంటిపై కునుకు లేకుండా పోయింది. తాము ఓట్ల కోసం వస్తే.. స్థానికులు.. సమస్యలు ఏకరువు పెడుతుండడం.. రాష్ట్ర ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు పరిష్కారం కాలేదని చెబుతుండడంతో నాయకులకు గుటకలు మింగుతున్నారు. ఇది చివరకు షాక్ ఇస్తుందా? అనే చర్చ కూడా సాగుతుండడం గమనార్హం.