బిలియన్ డాలర్లకు స్టార్టప్ ను అమ్ముకొని.. ఇప్పుడు ఆదాయం లేక ఇంటర్న్ షిప్ వేట

అనంతరం ఇప్పుడు అన్నీ అమ్ముకొని ఇప్పుడు తన సమయాన్ని , డబ్బుతో ఎలా గడుపుతున్నానో వెల్లడించారు. అదే వైరల్ అయ్యింది.;

Update: 2025-03-30 02:30 GMT
బిలియన్ డాలర్లకు స్టార్టప్ ను అమ్ముకొని.. ఇప్పుడు ఆదాయం లేక ఇంటర్న్ షిప్ వేట

లూమ్ సహ వ్యవస్థాపకుడు వినయ్ హిరేమఠ్ చాలా మంది కలలు కనే దానికంటే ఎక్కువ సంపదను ఒక్క స్టార్టప్ ను సృష్టించి తొందరగానే పొందాడు. 2023లో తన స్టార్టప్‌ను అట్లాసియన్‌కు దాదాపు $1 బిలియన్‌కు విక్రయించినప్పుడు హిరేమఠ్ సుమారు $50 నుండి $70 మిలియన్ల వరకు సంపాదించారు. ఇప్పుడు 33 ఏళ్ల ఈయనకు ఎలాంటి ఆదాయం లేదు. ఇంటర్న్‌షిప్‌ల కోసం చూస్తున్న పరిస్థితి నెలకొంది.. మనీవైస్ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న భారతీయ సంతతి సహ వ్యవస్థాపకుడు ఒకప్పుడు "దివాళా తీసిన వ్యక్తి" నుండి మిలియనీర్‌గా ఎలా మారారో వివరించాడు. అనంతరం ఇప్పుడు అన్నీ అమ్ముకొని ఇప్పుడు తన సమయాన్ని , డబ్బుతో ఎలా గడుపుతున్నానో వెల్లడించారు. అదే వైరల్ అయ్యింది.

మనీవైస్ పాడ్‌కాస్ట్ హోస్ట్ సామ్ పార్ తో మాట్లాడిన వినయ్ హిరేమఠ్ తన స్టార్టప్‌ను $975 మిలియన్లకు విక్రయించానని.. $60 మిలియన్ల రిటెన్షన్ బోనస్‌ను కూడా వదులుకున్నానని.. అయినా దాని గురించి ఆయన చింతించడం లేదని వెల్లడించారు.

- ఇంటర్న్‌షిప్‌ల కోసం చూస్తున్న వినయ్

పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న హిరేమఠ్ తన స్టార్టప్‌ను విక్రయించడం ద్వారా తాను సంపాదించిన ఖచ్చితమైన మొత్తాన్ని వెల్లడించడానికి నిరాకరించారు. అయితే అది $30 నుండి $100 మిలియన్ల మధ్య ఉంటుందని ధృవీకరించారు. దీని ఆధారంగా హోస్ట్ పార్ దాదాపు $50 నుండి $70 మిలియన్లు వినయ్ సంపాదించి ఉంటారని నిర్ధారించారు.

భారతీయ సంతతికి చెందిన ఈ వ్యవస్థాపకుడు తాను చాలా డబ్బు సంపాదించానని, అది తన పిల్లలకు సరిపోతుందని (వారు పుట్టినప్పుడు) చెప్పారు. హిరేమత్‌కు నాలుగేళ్లలో చెల్లించేలా $60 మిలియన్ల రిటెన్షన్ బోనస్ కూడా ఆఫర్ చేశారు. అయితే వినయ్ దానిని తిరస్కరించడం విశేషం. "నేను $60 మిలియన్లను వదులుకున్నాను. నాకు ఎలాంటి ఆదాయం లేదు. ప్రస్తుతం నేను ఇంటర్న్‌షిప్‌ల కోసం చూస్తున్నాను" అని ఇల్లినాయిస్‌లో జన్మించిన ఈ మిలియనీర్ అన్నారు.

హిరేమఠ్ ఈ ఏడాది ప్రారంభంలో ఒక బ్లాగ్ పోస్ట్‌లో తనకు ఏమి చేయాలో తెలియడం లేదని.. కంపెనీని అమ్ముకున్నాక ఏం తోచడం లేదంటూ చెప్పి వార్తల్లో నిలిచారు. "నా కంపెనీని విక్రయించిన తర్వాత మళ్లీ ఎప్పటికీ పని చేయాల్సిన అవసరం లేని పూర్తిగా సంబంధం లేని స్థితిలో నేను ఉన్నాను" అని ఆయన పేర్కొనడం సంచలనమైంది.

ఇప్పుడు తన సమయాన్ని ఎలా గడుపుతున్నానో ఈ పాడ్ కాస్ట్ లో వినయ్ వివరించాడు. "ప్రతిరోజూ 5-8 గంటలు భౌతిక శాస్త్రాన్ని అధ్యయనం చేస్తున్నాను. మెకానికల్ ఇంజనీర్‌గా ఇంటర్న్ చేయడానికి చూస్తున్నాను. ప్రస్తుతం వినయ్ ఒక రోబోటిక్స్ కంపెనీలో ఇంటర్న్‌షిప్ పొందాలని కోరుకుంటున్నారు."నేను చాలా కాలంగా భౌతిక శాస్త్రం చదువుతున్నాను. దేవుడి దయ వల్ల ఇక్కడ కొన్ని వేర్వేరు స్టార్టప్‌లలో, కొన్ని రోబోటిక్స్ కంపెనీలలో మెకానికల్ ఇంజనీర్‌గా ఇంటర్న్ చేయడానికి ఇంటర్వ్యూలకు హాజరు కావాలని అనుకుంటున్నా" అని హిరేమఠ్ పాడ్‌కాస్ట్‌లో చెప్పారు. దీని తర్వాత నేను ఎలక్ట్రికల్ ఇంజనీర్‌గా ఇంటర్న్ చేయాలనుకుంటున్నాను. అయితే దీంతో ఏమి చేయబోతున్నానో నాకు నిజంగా తెలియదు" అని ఆయన అన్నారు.

Tags:    

Similar News