పెళ్లైనా అర్హురాలే.. తేల్చిన టీహైకోర్టు!

ఆసక్తికర తీర్పును ఇచ్చింది తెలంగాణ హైకోర్టు. నిజానికి ఎంతోమంది ఆడబిడ్డలకు మేలు చేసే ఈ తీర్పు లింగ సమానత్వంలో భాగంగా మారుతుందని చెప్పొచ్చు.;

Update: 2025-04-11 10:30 GMT
పెళ్లైనా అర్హురాలే.. తేల్చిన టీహైకోర్టు!

ఆసక్తికర తీర్పును ఇచ్చింది తెలంగాణ హైకోర్టు. నిజానికి ఎంతోమంది ఆడబిడ్డలకు మేలు చేసే ఈ తీర్పు లింగ సమానత్వంలో భాగంగా మారుతుందని చెప్పొచ్చు. ఇంతకూ ఈ తీర్పు దేనికి సంబంధించిందన్న విషయంలోకి వెళితే.. కుమార్తె వైవాహిక స్థితిని పరిగణలోకి తీసుకొని కారుణ్య నియామకానికి అర్హులా? కారా? అని చెప్పటం సరికాదని స్పష్టం చేసింది హైకోర్టు. పెళ్లైనప్పటికి.. వారి ఆర్థిక పరిస్థితితో పాటు పలు అంశాల్ని పరిశీలించాలని పేర్కొంది.

కంచ్ బాగ్ పోలీస్ స్టేషన్ లో ఏఎస్ఐగా పని చేస్తూ యూసఫ్ మరణించారు. కారుణ్య నియామకం కింద తన కుమార్తె ఫాతిమాకు ఏదైనా ఉద్యోగం ఇవ్వాలని కోరుతూ ఆమె నగర పోలీస్ కమిషనర్ ను కోరారు. అందుకు ఆయన నిరాకరించారంటూ యూసఫ్ భార్య షాహీన్ సుల్తానా హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ పై విచారణను జస్టిస్ నామవరపు రాజేశ్వర్ రావు చేపట్టారు.

సాహీన్ కు ఇద్దరు కూతుళ్లు.. ఒక కొడుకు. కొడుకు కెనడాకు వెళ్లి తండ్రి అంత్యక్రియలకు కూడా హాజరు కాలేదు. దీంతో తల్లిని కూతురు ఫాతిమానే చూసుకుంటోంది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా తల్లికి సరైన వైద్యాన్ని అందించలేని పరిస్థితి. ‘మీకు కొడుకు ఉన్నాడు. అతను ఉద్యోగం చేస్తున్నాడు. అందుకే కారుణ్య నియామక వినతిని తిరస్కరిస్తున్నట్లు’ సీపీ చెప్పినట్లుగా పేర్కొన్నారు.

దీనికి ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ఫాతిమా..ఆమె భర్త ఆర్థిక పరిస్థితిని షాహీన్ వెల్లడించలేదన్నారు. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి.. ఆమె డాక్యుమెంట్లను పున:పరిశీలించి నిబంధనల ప్రకారం నిర్ణయం తీసుకోవాలని ఆదేశించారు. మరి.. నగర సీపీ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి.

Tags:    

Similar News